జగన్ వస్తారని… ఆ ఇద్దరూ జంప్ అయ్యారా?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతుంది. అయితే జగన్ రాజమండ్రిలో ప్రవేశించే సమయానికి ఇద్దరు నేతలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. వారు ఇద్దరు మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్ లు. జగన్ పాదయాత్ర రాజమండ్రి చేరుకునే సమయానికి వారు జిల్లాకు దూరంగా వెళ్లిపోయారట. జగన్ నుంచి తమపై వత్తిడి వస్తుందని భావించిన ఈ ఇద్దరూ ప్రయివేటు కార్యక్రమాలను సాకుగా చూపి జిల్లా నుంచి బయట ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లో ఉండవల్లి…..

ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ వల్లనే ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయంగా ఎదిగారన్నది వాస్తవం. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన జగన్ పార్టీలో చేరతారన్న ప్రచారం అప్పుడప్పుడూ విన్పించినా తనకు అంత ఆసక్తి లేదని ఉండవల్లి తరచూ చెబుతూనే వస్తున్నారు. గతంలో ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి జగన్ వెళ్లి స్వయంగా కలసి వచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఉండవల్లి అరుణ్ కుమార్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ విభజన హామీలపై పెట్టిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన జనసేనలో చురుగ్గా పాల్గొంటారన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది.

తటస్థంగా ఉండాలనేనా?

కాని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సమావేశాల తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ జనసేనకు కూడా పెద్దగా టచ్ లో లేరు. ఈ నేపథ్యంలో జగన్ రాజమండ్రి వస్తే అరుణ్ కుమార్ ను కలుస్తారన్న ఊహాగానాలు పెద్దయెత్తున చెలరేగాయి. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పాదయాత్ర రాజమండ్రిలో ప్రవేశించే నాటికి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన తన కుమార్తె ఇంటికి హైదరాబాద్ వెళ్లినట్లు చెబుతున్నారు. తటస్థంగా ఉండాలని భావిస్తున్న అరుణ్ కుమార్ జగన్ తన ఇంటికి వస్తారేమోనని భావించే ఆయన రాజమండ్రి నుంచి దూరంగా వెళ్లినట్లు తెలుస్తోంది.

దళిత ఉద్యమాల్లో హర్షకుమార్…..

ఇక మరో సీనియర్ నేత హర్షకుమార్ దీ అదే పరిస్థితి. హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరారు. ఆ పార్టీ ఇప్పుడు లేదు. హర్ష కుమార్ ఇప్పుడు ఏ పార్టీలో లేరు. ఆయన దళిత ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దళిత సమస్యలపై పోరాడుతూ తిరిగి పార్లమెంటు సభ్యుడిగా గెలవాలని తపిస్తున్నారు. హర్ష కుమార్ పై కూడా వైసీపీ లో చేరాలని వత్తిడి ఉంది. ఆయన, ముద్రగడ సన్నిహిుతులు కావడంతో ఇద్దరూ ఫ్యాన్ పార్టీలోకి వస్తారని గత కొంతకాలంగా ఊహానాలు వస్తున్నాయి. అయితే హర్షకుమార్ ఎన్నికలకు రెండు నెలల ముందే నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అందుకే జగన్ రాజమండ్రిలో పర్యటిస్తున్న సందర్భంలో ఆయన దళిత ఉద్యమాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ రాజమండ్రిలోకి ప్రవేశించగానే ఇద్దరు ముఖ్య నేతలు జిల్లా నుంచి జంప్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*