జగన్ అధికారంలోకి వస్తేనా….?

వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి వస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయన రేపు మళ్లీ విశాఖ నుంచి పోరాట యాత్ర ప్రారంభించనున్నారు. జగన్ పై ఒకవైపు ఫైర్ అవుతూనే ఈ నెల 29న కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైసీపీ, వామపక్షాలు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ బంద్ కు మాత్రం మద్దతిచ్చారు. పవన్ కల్యాణ‌్ ప్రస్తుతం పటమటలో ఉన్న తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. ఈరోజు విశాఖ బయలుదేరి వెళ్లనున్నారు.

టీడీపీపై ఫైర్…..

రేపటి నుంచి తిరిగి పవన్ యాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం తెలుగుదేశం పార్టీ చేస్తున్న దీక్షలు దొంగవేనన్నారు. కడపకు స్టీల్ ఫ్యాక్టరీ రాకుండా అడ్డుపడింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన సంచలన ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్ల నిరుద్యోగుల్లో అసహనం పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి తీరాల్సిందేనన్నారు పవన్.

వామపక్షాలతో కలసి…..

అలాగే తాను ఒంటరిగా పోటీ చేస్తానని అన్నానంటే దాని అర్థం జనసేన ఒక్కటే కాదని, వామపక్షాలు, లోక్ సత్తాతో కలసి ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పవన్ తెలిపారు. వామపక్ష భావాజలం, తన ఆలోచనలూ ఒకే విధంగా కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయాయన్నారు. ఏపీ డిమాండ్లను కేంద్రం మెడలు వంచి సాధించుకోవాలన్నారు పవన్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*