జగన్ కు పవన్ ఎఫెక్ట్ పడేది ఇక్కడేనా?

ముందస్తు ఎన్నికలకు వైసీపీ సన్నద్ధం చేసుకుంటోంది. ఉప ఎన్నికలు జరిగినా మేం రెడీ అంటోంది. ఈ ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లోనే ముందస్తు ఎన్నికలు వస్తాయని సంకేతాలు అందుతుండటంతో వైసీపీ అధినేత జగన్ అప్రమత్తమయ్యారు. పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ ఛార్జులతో సమావేశమైన జగన్ ముందస్తు ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్నికలు దాదాపుగా ఈ ఏడాదే వచ్చే అవకాశముందని ఆయన నేతలకు చెప్పారు. ఇందుకోసం ఇప్పటి నుంచే సన్నద్ధులై ఉండాలని, క్యాడర్ ను కూడా ఎన్నికలకు సిద్ధం చేయాలని జగన్ పిలుపునిచ్చారు.

సైన్యాన్ని సిద్ధం చేస్తూ……

ఇప్పటికే వైసీపీ బూత్ లెవెల్ కమిటీ సభ్యులతో సమావేశాలను నిర్వహిస్తోంది. పార్లమెంటరీ నియోజకకవర్గాల వారీగా బూత్ లెవెల్ కమిటీ సభ్యులకు శిక్షణ ఇస్తున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఈ బూత్ లెవెల్ కమిటీ శిక్షణ కార్యక్రమాలు దాదాపు పూర్తికావచ్చాయి. దీంతో పాటు సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వినియోగించుకోవాలని, ప్రజా సమస్యలను, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు చేరవేయాలని జగన్ నేతలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

అభ్యర్ధుల జాబితాపైన…..

ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కూడా జగన్ సమావేశమై అభ్యర్థుల జాబితాపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ రెండు దఫాలు తమ బృందం ద్వారా సర్వేలు చేయించారు. అలాగే పాదయాత్రలో ప్రశాంత్ కిషోర్ టీమ్ ఉండి ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. జగన్ పాదయాత్ర పూర్తి చేసిన ఎనిమిది జిల్లాల్లోనూ వైసీపీకి పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు చెబుతున్నారు. గతంలో కన్నా పాదయాత్ర తర్వాత పార్టీ పరిస్థితి బాగా మెరుగుపడిందని సర్వేల్లో తేలడంతో కొంత వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

జనసేన ఎఫెక్ట్…

ముఖ్యంగా కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో వైసీపీ పరిస్థితి బాగా మెరుగుపడిందంటున్నారు. ఇదే పరిస్థితి ఎన్నికల వరకూ కొనసాగితే గతంలో కన్నా ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే వీలుందని చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఎఫెక్ట్ పడే అవకాశముందని కూడా సర్వేల్లో స్పష్టమయిందంటన్నారు. ముఖ్యంగా అనంతపురం, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ఎఫెక్ట్ కొంత వైసీపీ పడే అవకాశముందని తేలింది. దీంతో ఆ ప్రాంత నేతలను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు. ముందునుంచే ప్రజల్లో ఉండి జనసేన దెబ్బ పడకుండా జాగ్రత్త పడాలని ఆ ప్రాంత నేతలకు సూచించనున్నారు. మొత్తంమీద పీకే సర్వేల్లో కొంత పాజిటివ్ రిజల్ట్ రావడంతో ముందస్తు ఎన్నికలకైనా సిద్ధమేనంటోంది వైసీపీ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*