జనసేనకు జగన్ ఝలక్…?

కాపు రిజర్వేషన్ పై క్లారిటీ ఇవ్వలిసిన తరుణాన్నితెచ్చి పవన్ నెత్తిమీద పెట్టారు చంద్రబాబు, జగన్. ఇప్పటివరకు కాపుల రిజర్వేషన్ అంశంపై జనసేన స్పష్టమైన విధానం ప్రకటించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి, వైసిపి, ముద్రగడ పద్మనాభం ఈ అంశంపై చర్చను లేవదీశారు. ఇక క్లారిటీ ఇవ్వలిసిన సమయం కూడా వచ్చేసింది. అలా అని తొందరపడి మాట్లాడితే మిగిలిన కులాల్లో కాపు ముద్రను జనసేన తగిలించుకునే పరిస్థితి వుంది. ఇప్పటికే పార్టీ ట్యాగ్ లైన్ గా కులం, మతం లేని సమాజ నిర్మాణమే జనసేన లక్ష్యమని పేర్కొంది ఆ పార్టీ. ఇస్తామన్నా, ఇవ్వడం సాధ్యం కాదన్నా, తరువాత చూద్దాం అని ప్రకటించినా ఎలా చెప్పినా ఈ అంశం కందిరీగ తుట్టె కదిపినట్లే ఉంటుంది.

ఇంకా అనేక సమస్యలపై …

కులమతాలు కలిపే సమాజమే ధ్యేయంగా పార్టీ సిద్ధాంతం టీజర్ విడుదల చేసిన జనసేన ఏపీలో కులాలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు సమాధానం ఇవ్వలిసి వుంది. మత్సకారులను ఎస్సిల్లో చేరుస్తామని ప్రకటించి ఆదివాసీల ఉద్యమంతో ఇరుకున పడ్డ టిడిపి పై గతంలో జనసేనాని విమర్శలు గుప్పించినా ఆ సమస్యకు శాశ్వతంగా పరిస్కారాన్ని ఆయన సూచించలేదు. రజకులను టిడిపి ఎస్సిల్లో చేరుస్తామన్న అంశంపైనా జనసేన తన వైఖరి స్పష్టం చేయాలి.

సున్నితమైన సమస్య కావడంతో……

వీటన్నిటి కన్నా ముఖ్యమైంది కాపు రిజర్వేషన్ల అంశం. దీనిని ఇప్పటివరకు సరైన కోణంలో అడ్రెస్ చేయలేదు పవన్ కళ్యాణ్. అన్ని సమస్యలకు రాజకీయంగా అధికారంలోకి రావడమే పరిష్కారం అని కూడా ధైర్యంగా ఆయన ప్రకటించలేదు. అలా ఆయన చెప్పినా కాపు సామాజిక వర్గం ముద్రగడతో సహా పవన్ వెంట నడిచే వాతావరణం ఏర్పడుతుంది. అన్ని సామాజిక వర్గాలకు వారి జనాభా ప్రకారం సీట్లు ప్రాంతాల వారీగా ఇస్తామని కూడా జనసేన వివరించలేదు. ఇలా సున్నిత సమస్యలపై జనసేన ప్రజలకు సవివర వివరణ ఇవ్వలిసిన సందర్భం వచ్చిందని గుర్తించి చెప్పకపోతే క్లారిటీ లేని పార్టీ అనే ముద్ర పడేలా ప్రత్యర్ధులు రాబోయే రోజుల్లో ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*