జగన్ కు ఇక్కడ ’’వర’’ మేనా?

వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఈరోజు చోడవరం నియోజకవర్గంలోకి చేరుకుంటుంది. చోడవరం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఈసారి ఖచ్చితంగా ఎగరాల్సిందేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. నిన్నటి వరకూ అనకాపల్లి నియోజకవర్గంలో విజయవంతంగా జరిగిన పాదయాత్ర చోడవరంలోనూ సక్సెస్ చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. జగన్ ను చూసేందుకు దారి పొడువునా ప్రజలు నిరీక్షిస్తుండటం, బహిరంగ సభలకు వేల సంఖ్యలో హాజరుకావడం, ముఖ్యంగా యువత జగన్ చెంతకు రావడం తమకు ఈసారి ప్లస్ అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు.

టీడీపీ ఎక్కువ సార్లు…..

ఇక చోడవరం విషయానికొస్తే…. 1955 లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. జనరల్ నియోజకవర్గం కావడంతో అభ్యర్థులు మారుతూ వస్తున్నారు. ప్రస్తుత మంత్రి గంటా శ్రీనివాసరావు సయితం 2004లో చోడవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీలు బలంగానే ఉన్నాయి. రాష్ట్ర విభజన చేయడంతో కాంగ్రెస్ ఈ నియోజకవర్గంలో కుదేలైపోయంది. ఇప్పుడు కాంగ్రెస్ స్థానాన్ని వైఎస్సార్సీపీ సంపాదించుకుంది. చోడవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికలను చూస్తే13 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నాలుగు సార్లు విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు గెలిచింది. ఇక ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కూడా రెండు సార్లు గెలుపొందడం విశేషం.

సానుభూతి పనిచేస్తుందా?

గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ కరణం ధర్మశ్రీ పోటీ చేశారు. ఆయన టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు (బాబు)చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇద్దరి మధ్య తేడా కేవలం 900 ఓట్లు మాత్రమే. దీంతో జగన్ ఈసారి ఎలాగైనా ఇక్కడ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. కలిదిండి సన్యాసి రాజు వరుసగా 2009, 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఆయన పై ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే రెండు సార్లు వరుస ఓటములతో ఉన్న కరణం ధర్మశ్రీకి సానుభూతి పనిచేస్తుందన్న అంచనా వేస్తున్నారు. దీంతో చోడవరంలో ఈరోజు సాయత్రం జగన్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

నేటి యాత్ర షెడ్యూల్……

ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర అనకాపల్లి నియోజకవర్గంలో జరుగుతోంది. పాదయాత్ర 251వ రోజుకు చేరుకుంది. ఈరోజు నైట్ క్యాంప్ నుంచి బయలుదేరే జగన్ మామిడిపాలెం క్రాస్ రోడ్స్, గంధవరం, దొడ్డుపాలెం క్రాస్ రోడ్స్, వెంకన్న పాలెం, గోవాడ, అంబేరు పురం వరకూ జగన్ పాదయాత్ర జరుగుతుంది. అక్కడ భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం బయలుదేరిన పాదయాత్ర చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. గణపతి నగరం మీదుగా యాత్ర చోడవరం చేరుకుంటుంది. చోడవరంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగిస్తారు. అక్కడే రాత్రికి బస చేస్తారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*