జగన్ రూటు మార్చేసుకున్నారే….!

వైసీపీ అధినేత జగన్ మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎక్కువ సమయం తీసుకున్నా పరవలేదని, జిల్లాలో ముఖ్యమైన నియోజకవర్గాలన్నీ టచ్ చేయాలన్నది జగన్ అభిమతంగా కన్పిస్తోంది. ఈ మేరకు జగన్ పాదయాత్ర నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. వాస్తవానికి జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర శనివారం పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే సడెన్ గా జగన్ రూట్ మార్చారు. ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

మూడు రోజులు జగన్ మకాం అక్కడేనా?

జగ్గంపేట అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది జ్యోతుల నెహ్రూ. గత ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఖాతాలోనే పడింది. అక్కడినుంచి జ్యోతుల నెహ్రూ వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు. తర్వాత జ్యోతుల నెహ్రూ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలోకి చేరిపోయారు. తొలుత జగ్గంపేట నియోజకవర్గం జగన్ పాదయాత్ర రూట్ మ్యాప్ లో లేదు. కాని అక్కడి నేతలు, కార్యకర్తలు పట్టు బట్టి మరీ జగన్ ను జగ్గంపేటకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. నేతలు, కార్యకర్తల కోరికకు జగన్ ఓకే చెప్పడంతో శనివారం నుంచి జగ్గంపేటలో జగన్ పర్యటించనున్నారు.

జగ్గంపేటలో భారీ బహిరంగ సభ…..

ఇక ఇదే నియోజకవర్గంలో మూడు రోజుల పాటు జగన్ మకాం వేయనున్నారు. జగ్గయ్యపేటలో భారీ బహిరంగ సభకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి సాయత్రం జరగబోయే బహిరంగ సభలో జగన్ ఏ విషయంపైన ప్రసంగిస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. జగ్గయ్యపేటలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండటంతో అక్కడ పవన్ కల్యాణ్ పై తాను చేసిన వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తారేమోనని వైసీపీలోని కాపు సామాజిక వర్గం నేతలు ఆసక్తిగా ఉన్నారు. జగన్ వ్యాఖ్యలతో కాపు సామాజిక వర్గం దూరమవుతుందని భావించిన ఈ సామాజిక వర్గం నేతలు ఇందుకోసమే జగ్గయ్య పేట వైపు యాత్రను మరలించారన్న టాక్ కూడా ఉంది.

రాష్ట్ర స్థాయి సమావేశంలో……

అలాగే జగన్ ఈ నెల 29వ తేదీన జగ్గయ్యపేటలోనే ఉండనున్నారు. అక్కడ రాష్ట్రంలోని నియోజకవర్గ ఇన్ ఛార్జులు, కో-ఆర్డినేటర్లతో జగన్ సమావేశం కానున్నారు. పాదయాత్ర పూర్తి చేసిన జిల్లాల్లో పార్టీ పరిస్థితితో పాటు భవిష్యత్ కార్యాచరణను కూడా జగన్ వారికి వివరించనున్నారు. ఇటీవల వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేయించిన సర్వే ఫలితాలను బట్టి నేతలు వ్యవహరించాల్సిన తీరును జగన్ చెప్పనున్నారని పార్టీ వర్గాలు వివరించనున్నాయి. వైసీపీ ఎంపీల రాజీనామా వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నియోజకవర్గ స్థాయి నేతలు విఫలమయ్యారని జగన్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఆ మరుసటి రోజు కూడా జగన్ జగ్గయ్యపేటలోనే పాదయాత్ర చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*