జగన్ నడిచిన తర్వాత కూడా…?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ పాద‌యాత్రకి ముందు.. ఆ త‌ర్వాత‌.. వివిధ జిల్లాల్లో రాజ‌కీయ ప‌రిస్థితులు మారుతున్నాయని ఆ పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు. పార్టీ నాయ‌కుల్లో, కార్య‌క‌ర్త‌ల్లో కొత్త ఉత్సాహం నింపుతోంద‌ని విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు. మ‌రి అంత‌కు ముందు.. ఆ త‌ర్వాత కూడా ప్ర‌కాశం జిల్లాలో ప‌రిస్థితులు ఒకేలా ఉన్నాయి. పాద‌యాత్ర స‌మ‌యంలో.. పార్టీ నాయ‌కులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించినా త‌ర్వాత మాత్రం ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉంది. దీంతో ద్వితీయ శ్రేణి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో నైరాశ్యం నెల‌కొంది. ఇతర జిల్లాల్లో జ‌గ‌న్‌ పాద‌యాత్ర త‌ర్వాత పార్టీ ప‌రిస్థితి కొంత‌ మెరుగుప‌డినా.. ప్ర‌కాశం వైసీపీలో మాత్రం మార్పు రాలేదట‌. ఎవ‌రికి వారు య‌మునా తీరే అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. పార్టీని పట్టించుకోవ‌డం లేదంటున్నారు. ఫ‌లితంగా జ‌గ‌న్ ఆశ‌లు మాత్రం నెర‌వేర‌డం లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

బలమైన జిల్లా అయినా……

వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి కడప తర్వాత అంతటి బలమైన జిల్లా ఏదీ అంటే ప్రకాశం! ప్రస్తుతం ఆ జిల్లాలో ఎలాంటి వికాసం కనిపించడం లేదు. 2004 నుంచి 2012 వరకూ కాంగ్రెస్‌ పార్టీకి, వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి జిల్లా ప్రజలు జైకొట్టారు. గత ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్ సీపీ ఆరు స్థానాలు గెలుచుకుంది. టీడీపీ 5, చీరాలలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఎన్నికల అనంతరం జిల్లాలో క్రమేపీ సమీకరణాలు మారిపోయాయి. జిల్లాలో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో నలుగురు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. దీంతో ఒక‌ ప్రజా ప్రతినిధి మత్రమే ఆ పార్టీకి మిగిలారు. ప్రజాబలం ఎంత ఉన్నప్పటికీ దాన్ని ఓటుగా మలిచే అభ్యర్ధులు లేకపోవటం ఆ పార్టీకి ప్రధాన సమస్యగా మారింది.

దగ్గర బంధువులే……

ప్రకాశంలో జగన్‌కు స‌న్నిహిత‌ బంధువులు ఉన్నారు. అయినా రోజురోజుకీ పార్టీ పరిస్ధితి దిగజారిపోతోంది. పార్టీపరమైన సంస్థాగత సమస్యలు, నాయకుల మధ్య సమన్వయ లోపం వంటివి పార్టీని దెబ్బతీస్తున్నాయి. అన్నింటికీ మించి అధినేత జగన్ వ్యవహారశైలి జిల్లాలో పార్టీని దయనీయస్ధితికి చేర్చిందని రాజకీయ వర్గాల టాక్‌! కొందరు అసంతృప్త టీడీపీ నేతలు వైసీపీలోకి దూకవచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో తమ పార్టీలోకి చేరికలు ఉండవచ్చునన్న ఆశాభావంతో వైసీపీ ముఖ్యనేతలు ఉన్నారు. సమాజంలో ఆర్ధిక, అంగబలం ఉన్న నేతలు వైసీపీలోకి రావాలంటే ప్రజల్లో ఆ పార్టీపై పూర్తి విశ్వాసం ఉందన్న విషయాన్ని నిరూపించుకోవాలి. ఇదే ఆలోచనతో ఉన్ననేత‌లు జగన్ పాదయాత్రను అవకాశంగా ఉపయోగించుకోవాలని ప్లాన్‌ చేసింది.

పాదయాత్ర ను…..

ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఏర్పాట్ల‌కు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. రాజ‌కీయ ప‌రిస్థితులు జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో మార‌తాయ‌ని, జిల్లాలో పార్టీకి పూర్వ వైభ‌వం వ‌స్తుంద‌ని నాయ‌కులు భావించారు. నైరాశ్యం నుంచి బ‌య‌ట‌పడేస్తార‌ని ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నా రు. కానీ వారి న‌మ్మ‌కం వ‌మ్ము అయింది. జగన్ పాదయాత్రలో పార్టీ కార్యకర్తలతోపాటు జనం సందడి కనిపించింది. త‌ర్వాత దీనిని క్యాష్ చేసుకోవ‌డంలో మాత్రం.. విఫ‌ల‌మ‌య్యారు వైసీపీ నాయ‌కులు. దీంతో అధినాయకత్వం సీరియస్ అయినట్లు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*