జగన్ ఇక్కడ ఆ యువనేతకే ఛాన్సిస్తారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గంలో జరుగుతుంది. పెందుర్తి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి పెద్దగా పట్టులేదు. అలాగని వైసీపీ కూడా బలంగా లేదు. ఈ నియోజకవర్గాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ ఇక్కడ ఒకప్పుడు బలంగా ఉండేది. రాష్ట్ర విభజన పాపంతో కాంగ్రెస్ క్యాడర్ తో సహా ఓటు బ్యాంకు కూడా కోల్పోయింది. కాంగ్రెస్ క్యాడర్ అంతా వైసీపీకి టర్న్ అవ్వడంతో వైసీపీ ఇక్కడ బలంగానే ఉంది. గత ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలుచుకుంది. ఈసారి ఎలాగైనా పెందుర్తి నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలన్న బలమైన ఆకాంక్షతో జగన్ ఇక్కడ పాదయాత్ర మొదలుపెట్టారు.

టీడీపీ పెద్దగా బలంగా……

పెందుర్తి నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ తెలుగుదేశం అంత బలంగా లేదన్నది తెలుస్తుంది. 1978 లో పెందుర్తి నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పది సార్లు పెందుర్తి శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ పది ఎన్నికల్లో నాలుగు సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, మూడుసార్లు తెలుగుదేశంపార్టీ గెలిచింది. ఒకసారి సీపీఐ, ప్రజారాజ్యం, స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో టీడీపీకి ఇక్కడ అంత పెద్ద ఓటు బ్యాంకు లేదన్నది తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టికి చెందిన బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గండి బాబ్జీ దాదాపు 9వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు.

యువనేతకు ఇస్తారా…?

అయితే అభ్యర్థి ఎంపికే వైసీపీని గత ఎన్నికల్లో కొంపముంచిందన్న విశ్లేషణలు ఉన్నాయి. గండి బాబ్జీ మీద ప్రజల్లో సదభిప్రాయం లేకపోవడం, టీడీపీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి పట్ల కొంత సానుకూలత ఉండటం వల్లనే టీడీపీ గెలిచిందన్నది అందరికీ తెలిసిందే. అయితే ఈసారి వైసీపీ అధినేత జగన్ ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. పలు సర్వేల్లోనూ పెందుర్తి నియోజకవర్గంలో ఒక యువనాయకుడికి మంచి మార్కులే పడ్డాయంటున్నారు. ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గ సమన్వయ కర్తగా పనిచేస్తున్న ఆదీప్ రాజు యువకుడు కావడం, గత కొన్నేళ్లుగా ప్రజలతో మమేకమవ్వడం పార్టీకి కలసి వస్తుందంటున్నారు. ఆదీప్ రాజు జనంలోకి చొచ్చుకుని వెళ్లడం వల్లనే పెందుర్తిలో పార్టీకి మంచి బలం సమకూరిందన్న వ్యాఖ్యలు పార్టీలోనే విన్పిస్తున్నాయి.

పాదయాత్రకు అనూహ్య స్పందన…..

ప్రజా సంకల్ప పాదయాత్ర భాగంగా వై.ఎస్.జగన్ సబ్బవరం బహిరంగ సభలో ప్రసంగించారు. సభకు పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయమూర్తిపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ప్రభుత్వ భూములన్నీకబ్జా చేశారని, పెందుర్తిలోనేకాకుండా విశాఖలోనూ భూములను స్వాహా చేశారని ఆరోపించారు. అటువంటి బండారు సత్యనారాయణమూర్తి అవినీతి బయటపెట్టే సిట్ నివేదిక ఇంతవరకూ బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లాలో పాదయాత్రకు మంచి స్పందన లభిస్తుండటంతో వైసీపీ నేతల్లో జోష్ పెరిగింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*