జజ్జనకరి జనారే….జగన్…!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి నేటికి 200 రోజులవుతోంది. 200 రోజుల నుంచి జగన్ ప్రజల మధ్యనే ఉన్నారు. గత ఏడాది నవంబరు 6వ తేదీన ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. గత నవంబరు 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ ప్రజాసంకల్ప యాత్ర తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని పదో జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం జగన్ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 200 రోజులకు  పాదయాత్ర నేడు చేరుకున్న సందర్భంగా ఈరోజు జగన్ కు అపూర్వ స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి.

వైసీపీకి కష్టసమయంలో….

ఒకసారి రెండు వందల రోజులు వెనక్కు వెళితే….వైసీపీకి పెద్దగా హైప్ లేదన్నది వాస్తవం. 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతోనే అధికారం కోల్పోయిన జగన్ ఈసారి ఎలాగైనా పవర్ లోకి రావాలని భావించారు. ప్రతిపక్ష నేతగా ఇటు శాసనసభలోనూ, అటు ప్రజాక్షేత్రంలోనూ ఉద్యమించారు. ప్రత్యేకహదా, రైతు సమస్యల వంటి వాటిపై ఆమరణ దీక్షకు కూడా జగన్ దిగారు. అయినా వైసీపీ నుంచి పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వెళ్లిపోవడం జగన్ ను కలవరపర్చిందనే చెప్పాలి. దీంతో ఆయన తనకు ఒక వ్యూహకర్త కావాలని భావించి, నరేంద్ర మోడీని విజయపధాన నిలబెట్టిన ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. వైసీపీ ప్లీనరీలో ఆయనను కార్యకర్తలకు కూడా పరిచయం చేశారు.

పాదయాత్రకు శ్రీకారం……

అయితే అప్పటి వరకూ అధికార పార్టీ అయిన తెలుగుదేశం దూకుడు మీద ఉండటంతో వైసీపీ నేతలు, కార్యకర్తల్లో నైరాశ్యం అలుముకుందనే చెప్పాలి. ఎంతగా అంటే పార్టీఅధినేతగా జగన్ పిలుపునిచ్చిన కార్యక్రమాలను కూడా నేతలు సక్రమంగా చేయలేదు. ప్రతిచోటా గ్రూపు విభేదాలతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. దీంతో ఒకదశలో జగన్ ఆందోళన కూడా చెందారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని భావించారు. అలా పార్టీని పటిష్టంచేయడంతో పాటుగా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు వీలుంటుందని దాదాపు మూడువేల కిలోమీటర్ల పాదయాత్రకు జగన్ ఏడు నెలల క్రితం శ్రీకారం చుట్టారు. ఇప్పటికి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పాదయాత్ర పూర్తిచేసుకుని తూర్పు గోదావరిజిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఇటీవలే జగన్ పాదయాత్ర 2400 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.

యాత్ర తెచ్చిన మార్పు…..

జగన్ పాదయాత్రతో వైసీపీలో నూతనోత్సాహం నెలకొందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. జగన్ పాదయాత్ర పూర్తి చేసిన తొమ్మిది జిల్లాల్లోనూ పార్టీకి మంచి ఊపు వచ్చింది. క్యాడర్ లోనూ భరోసాను నింపింది. నేతల్లోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. దీనికి తోడు ఇతర పార్టీల నుంచి నేతలు చేరడం కూడా పాదయాత్ర వల్లనే నంటున్నారు. పాదయాత్రకు ప్రజల్లో మంచి స్పందన వస్తుండటం, ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతుండటంతో అప్పటి వరకూ మౌనంగా ఉన్న నేతలు పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని చెబుతున్నారు. ఇలా జగన్ పాదయాత్ర నేటికి రెండు వందల రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఏడు నెలలు ఎండను, వానలను, చలిని కూడా లెక్క చేయకుండా జగన్ ప్రజలమధ్యనే గడిపారు. ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతూనే జగన్ పాదయాత్రను పూర్తి చేస్తున్నారు. నేడు పాదయాత్ర 200వ రోజుకు చేరుకోవడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

1 Comment on జజ్జనకరి జనారే….జగన్…!

Leave a Reply

Your email address will not be published.


*