జగన్ కు ఈస్ట్…బెస్ట్ కానుందా?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో అప్రహతిహతంగా సాగుతోంది. సుదీర్ఘంగా సాగుతున్న ఈ యాత్ర ఏ జిల్లాలోనూ జరగలేదు. రెండు నెలలు ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే జగన్ పాదయాత్ర చేస్తున్నారు. జూన్ 12వ తేదీన జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెన ఊగేలా సాగిన ఈ యాత్ర ఆరోజు జాతీయ మీడియాలో హైలెట్ అయింది. అక్కడి నుంచి జగన్ పాదయాత్రకు జిల్లాలో విశేష స్పందన కన్పిస్తోంది. జగన్ ఇప్పటికి 9జిల్లాల్లో యాత్రను పూర్తి చేశారు. ప్రతి జిల్లాలోనూ జగన్ నెల రోజులకు మించి యాత్రను చేయలేదు.

పర్యటన ఆసాంతం…..

జగన్ యాత్ర ప్రతి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకే పరిమితమయింది. మిగిలిన నియోజకవర్గాలు పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత బస్సుయాత్ర ద్వారా పర్యటించాలని జగన్ నిర్ణయించారు. అందుకే కొన్ని దాదాపు అన్ని జిల్లాల్లో నాలుగైదు నియోజకవర్గాల్లోకి పాదయాత్ర వెళ్లకుండా రూట్ మ్యాప్ ను నిర్వాహకులు ఖరారు చేశారు. పాదయాత్ర పూర్తయిన తర్వాత మరోసారి జిల్లాలో పర్యటించవచ్చన్నది వారి ఆలోచనగా కన్పిస్తోంది. అయితే తూర్పు గోదావరి జిల్లా దానికి విరుద్ధంగా కన్పిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలుంటే అందులో 17 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్రను ప్లాన్ చేశారు.

రెండు నియోజకవర్గాలు మినహాయిస్తే….

రంపచోడవరం, రాజానగరం మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో జగన్ పర్యటన జరుగుతోంది. జూన్ 12వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన జగన్ పాదయాత్ర ఈ నెల 13వ తేదీ వరకూ సాగనుంది. అంటే దాదాపు రెండు నెలల పాటు ఈ జిల్లాలో జగన్ పాదయాత్ర సుదీర్ఘంగా సాగిందనే చెప్పాలి. పాదయాత్రకు మంచి స్పందన రావడం, ఎక్కడికక్కడ ప్రజలు వచ్చి పలుకరిస్తుండటంతో జగన్ యాత్ర రోజుకు ఐదు కిలోమీటర్లకన్నా ఎక్కువ సాగడం లేదు. అంతేకాకుండా తూర్పు గోదావరి జిల్లాలో ఈసారి ఎలాగైనా అత్యధిక సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న జగన్ నింపాదిగా అందరినీ పలుకరిస్తూ వెళుతున్నారు.

సంచలనాలకు కేంద్రంగా….

జగన్ పాదయాత్ర మరికొద్దిరోజుల్లోనే తూర్పు గోదావరి జిల్లాను దాటి విశాఖ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర సమయంలో అనేక సంచలనాలు జరిగాయనే చెప్పాలి. తూర్పులోనే జగన్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శించడం సంచలనం కల్గించింది. దీనిపై రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. పవన్ పక్షాన టీడీపీ నిలిచింది. తర్వాత ఈ దుమారం సద్దుమణిగే లోపే జగ్గంపేటలో జగన్ కాపు రిజర్వేషన్లపై సంచలన ప్రకటన చేశారు. కాపు రిజర్వేషన్లపై తాను ఎటువంటి హామీలు ఇవ్వలేనని సూటిగా చెప్పడంతో రాజకీయాలు హీటెక్కాయి. దాదాపు వారం పాటు నడిచిన ఈ ఎపిపోడ్ కు జగన్ పిఠాపురంలో ఫుల్ స్టాప్ పెట్టారు. కాపు రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం కాదని, అది కేంద్రం పరిధిలోఉంది కాబట్టి అలా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు. తూర్పు గోదావరిజిల్లాలో పాదయాత్రకు అనూహ్య స్పందన కన్పించడంతో వైసీపీ శ్రేణులు అమితానందంతో ఉన్నాయి. రెండు నెలల సుదీర్ఘ పర్యటన విజయవంతమయిందనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*