ఇక్కడ అంతా పీకేపైనే భారం …!

నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఏర్పడ్డ తూర్పుగోదావరి జిల్లాలోని పి గన్నవరం లో రాబోయే ఎన్నికల్లో ఫలితాలపై ఇప్పటినుంచి ఆసక్తికర చర్చ నడుస్తుంది. పి. గన్నవరం, అంబాజీపేట, ఐనవిల్లి, మామిడికుదురు మండలాల పరిధిలో వున్న ఈ నియోజకవర్గం గోదావరి లంకల నడుమ వున్న ప్రాంతం. కొబ్బరి, అరటి, వరి వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన గన్నవరం అంతకుముందు నగరం నియోజకవర్గంలో భాగంగా ఉండేది. కులాల ఈక్వేషన్స్ పై ఈ ప్రాంతంలో రాజకీయాలు నడిచే తీరు వున్నా ఎస్సి రిజర్వ్ గా ఉండటంతో ఎన్నికల్లో పార్టీ గాలిపైనే ఫలితం ఆధారపడుతూ వస్తుంది. గన్నవరం ఏర్పడ్డాక 2009 లో కాంగ్రెస్ 2014 లో టిడిపి విజేతలుగా నిలిచాయి.

2009 లో కాంగ్రెస్ గెలుపు లో …

2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముల రాజేశ్వరి ఇక్కడి నుంచి విజేతగా నిలిచారు. ఆ ఎన్నికల్లో రెండో స్థానం కోసం టిడిపి, ప్రజారాజ్యం నడుమ ఓట్ల శాతం అతి స్వల్పం కావడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి పాముల రాజేశ్వరి దేవి 44756 ఓట్లను 33.26 శాతం సాధించగా, టిడిపి అభ్యర్థి పులపర్తి నారాయణ మూర్తి 41651 ఓట్లను 30.96 శాతం సాధిస్తే, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి జంగాగౌతం 41359 ఓట్లను 30.74 శాతం సాధించారు.కాంగ్రెస్ అభ్యర్థి పాముల రాజేశ్వరి దేవి 3105 ఓట్ల మెజారిటీతో టిడిపి అభ్యర్థి నారాయణ మూర్తిపై విజయం సాధించారు.

2014 లో పవన్ గాలి తోడు కావడంతో …

2014 ఎన్నికల్లో జనసేన, బిజెపి పవన్ కళ్యాణ్ టిడిపి పక్షాన ఉండటంతో ఈ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి పులపర్తి నారాయణ మూర్తి విజయం నల్లేరుపై నడకలాగే సాగింది. ఆయన తన సమీప వైసిపి అభ్యర్థి కొండేటి చిట్టిబాబు ను 13505 ఓట్ల తేడా తో చిత్తుగా ఓడించారు. ఈ ఎన్నికల్లో పులపర్తి కి 74967 ఓట్లను 52.49 శాతాన్ని సాధించారు. వైసిపి అభ్యర్థి చిట్టిబాబు కి 61462 ఓట్ల ను 43.04 శాతం సాధించారు. ఈ ఎన్నికల్లో జనసేన, బిజెపి బలం టిడిపి అభ్యర్థి విజయంలో కీలక భూమిక వహించాయి.

జగన్ కొత్తవారికి అవకాశం?

వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఉల్టా పల్టా గా కనిపిస్తుంది. బిజెపి, జనసేన టిడిపి తో కటీఫ్ అవ్వడంతో బాటు పవన్ తన అభ్యర్థిని బరిలోకి దింపనుండటంతో పోటీ ఆసక్తికరం కానుంది. ఈసారి సిట్టింగ్ ఎమ్యెల్యే పులపర్తి నారాయణ మూర్తి ని టిడిపి మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసిపి తరపున చిట్టిబాబు నే తిరిగి జగన్ బరిలోకి దింపుతారా లేక కొత్తవారికి అవకాశం కల్పిస్తారా అన్నది వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వే పైనే ఆధారపడివుంది. దాంతో టిడిపి, వైసిపి, జనసేన అభ్యర్థులు ఎన్నికల ముందు మాత్రమే అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*