జగన్ కు చెక్ పెట్టేందుకే సబ్బంహరిని….?

సీనియర్ నేత సబ్బం హరి బరస్ట్ అయ్యారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమని చెప్పకనే చెప్పారు. తన అభిమానులు, కార్యకర్తల సమావేశంలో సబ్బంహరి ప్రసంగించిన తీరు చూస్తే ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరేటట్లే కన్పిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమయిన సబ్బం హరి కార్యకర్తలు, తన అభిమానుల సమావేశం కేవలం నామమాత్రమేనన్నది టాక్.

వైసీపీలో చేరి…..

సబ్బం హరి సీనియర్ నేత. విశాఖ జిల్లాలో పట్టున్న నేత. కాంగ్రెస్ పార్టీ నేతగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ప్రియ శిష్యుడిగా ఉన్న సబ్బం హరి రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. ఎంపీగా, విశాఖ మేయర్ గా పనిచేసిన సబ్బం హరికి పెద్దయెత్తున అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరారు. అక్కడ పొసగక పోవడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చారు.

కొన్నాళ్లుగా విశ్రాంతి……

గత కొన్నేళ్లుగా ఏ పార్టీలో చేరకుండా రాజకీయ విశ్రాంతి తీసుకుంటున్న సబ్బం హరి తెలుగుదేశం పార్టీలో చేరతారన్న ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. ఆయనకు అసెంబ్లీ లేదా ఎంపీగా టిక్కెట్ టీడీపీ ఖరారు చేసిందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే సబ్బం హరి మాత్రం దానిపై ఎలాంటి వివరణ ఇంతవరకూ ఇవ్వలేదు. అనకాలపల్లి ఎంపీగానో, విశాఖ టౌన్ లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో సబ్బం హరి ఉన్నారు.

జగన్ సభతో మళ్లీ……

అయితే ఆదివారం విశాఖలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సభ సూపర్ సక్సెస్ అయింది. వేల సంఖ్యలో జనం సభకు పోటెత్తారు. ఈ సందర్భంగానే సబ్బం హరిని తెలుగుదేశం పార్టీ లైన్లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. విశాఖలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రపై ప్రభావం చూపేందుకే సబ్బం ఈ వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోంది. తన  అనుచరులతో సమావేశమైన సబ్బం హరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం కూడా చంద్రబాబు వ్యూహంలో భాగమేనంటున్నారు. అయితే ఈ సందర్భంగా సబ్బం హరి తన మనసులో మాటను మాత్రం చెప్పేశారు. తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని, ఏ పార్టీ నుంచి అనేది రెండునెలలో చెబుతానని అనడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*