సెంటిమెంట్…ఇక ఆయింట్ మెంట్

వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటి వరకూ రాజీనామాలు డ్రామాలంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఇక విలువ ఉండదు. వైసీపీ పార్లమెంటు సభ్యులయితే తమ రాజీనామాలను రెండు నెలల క్రితమే చేశారు. ఆమోదించడం …ఆమోదించకపోవడం అది స్పీకర్ పరిధిలోని అంశం. ఇక ఉప ఎన్నిలకు జరుగుతాయా? లేదా? అన్నది ఎన్నికల కమిషన్ పరిధిలోనిది. సాధారణంగా నిబంధనల ప్రకారం ఏడాదిలోపు పార్లమెంటు గడువు ముగిస్తే మాత్రం ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదు. అలగే మోడీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఉప ఎన్నికలు జరగవు. ఏకంగా సార్వత్రిక ఎన్నికలకు వెళ్లడమే.

మైలేజీ గ్యారంటీ…..

ఉప ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది పక్కనపెడితే వైసీపీకి మాత్రం భారీ మైలేజీ దొరుకుతుందన్నది విశ్లేషకుల అంచనా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా సెంటిమెంట్ బలంగా ఉంది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను గత ఎన్నికల్లో ప్రజలు మట్టి కరిపించారు. డిపాజిట్లు కూడా దక్కలేదు. సింగిల్ సీట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా సెంటిమెంట్ కూడా అదేస్థాయిలో ఉందంటున్నారు. ఈ పరిస్థితులను అధ్యయనం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీతో కటీఫ్ చెప్పి బయటకు వచ్చి ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకున్నారు. బీజేపీని, మోడీని దుయ్యబడుతున్నారు.

విమర్శలకు జవాబు….

ఇప్పటి వరకూ పాదయాత్రలో ఉన్న జగన్ మోడీని విమర్శించడం లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే ఈ సమయంలో వైసీపీ ఎంపీల రాజీనామాలు స్పీకర్ ఆమోదించడంతో ఇక సెంటిమెంట్ ను క్యాష్ చేసుకునేందుకు వైసీపీకి మంచి అవకాశం దక్కింది. జగన్ కూడా అందుకే రెండు నెలల ముందే పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించారు. తాము పదవులను తృణప్రాయంగా ప్రత్యేక హోదా సాధనకోసం వదులుకుంటామన్న సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపగలిగారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వంటి వారు కూడా ఈ రాజీనామాలను ఆహ్వానించక తప్పని పరిస్థితిని జగన్ క్రియేట్ చేశారు.

అదిరిపోయే అస్త్రం…..

తొలి నుంచి వైసీపీ అధినేత జగన్ ప్రత్యేకహోదా నినాదానికి కట్టుబడి ఉన్నారు. మోడీ, చంద్రబాబు సంబంధాలు బాగున్నప్పడే, మోడీ అమరావతికి వస్తున్నప్పుడే హోదా కోసం ఏడు రోజుల పాటు జగన్ ఆమరణదీక్ష చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పేసినా ఇంకా టీడీపీ పదవులను పట్టుకుని పాకులాడుతుందన్న ప్రచారాన్ని వైసీపీ ముమ్మరంగా చేయనుంది. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదాయే ప్రధాన అంశం కావడంతో ఎంపీల రాజీనామాల ఆమోదం వైసీపీకి కలసి వస్తుందన్నది విశ్లేషకుల అంచనా. మరోవైపు సెంటిమెంట్ అనే ఆయింట్ మెంట్ ను పూసే వీలుచిక్కింది వైసీపికి. మొత్తం మీద రాజీనామాల ఆమోదంతో వైసీపీలో మరింత జోష్ పెరిగిందనే చెప్పొచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*