ఫ్యాన్ పార్టీ వ్యూహాన్ని మార్చేసిందా?

ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. స్పందించాల్సింది ప్ర‌తిప‌క్షమే. అందునా విభ‌జ‌న త‌ర్వాత పూర్తిగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీ వంటి రాష్ట్రానికి ఇబ్బందులు ఎదుర‌వుతున్నప్పుడు స్పందించాల్సింది కూడా వైసీపీనే. అయితే, ఇప్పుడు కీల‌క స‌మ‌యంలో ముఖ్యంగా ఏడాదిలో ఎన్నిక‌లు ఉండ‌గా వైసీపీ మ‌రింత ఉథృతంగా పోరాడాల్సిన స‌మ‌యంలో ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెన‌క్కి అన్న‌చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది ఆ పార్టీ. గ‌డిచిన మూడు మాసాలుగా రాష్ట్రంలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం తీవ్ర‌స్థాయిలో సాగుతోంది. అధికార పార్టీ కూడా ఈ విష‌యంలో ముందుకు వ‌చ్చి.. ప్ర‌జ‌ల‌ను ఏకం చేసేందుకు, కేంద్రంపై పోరు సాగించేందుకు రెడీ అయింది. మ‌రి ఈ స‌మ‌యంలో వైసీపీ కూడా ముందుండి పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎవ‌రైనా భావిస్తారు.

ఎంపీల చేత రాజీనామా చేయించి…..

ప్రత్యేక హోదా అంశంపై తన ఎంపీల చేత రాజీనామా చేయించిన జగన్ సొంతంగా హోదాపై ఉద్యమ కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఈ కార్యక్రమాల్లో కేంద్రంపై కంటే రాష్ట్రంలోని టీడీపీనే టార్గెట్ వైసీపీ చేస్తోంద‌న్న విమర్శలూ లేకపోలేదు. ఈ ప‌రిణామం పై వైసీపీ నేత‌లు రోజుకో విధంగా స్పందిస్తున్నారు. తామే నిజ‌మైన ప్ర‌త్యేక హోదా ఉద్య‌మ కారుల‌మ‌ని వారు చెబుతు న్నారు. ఈ క్ర‌మంలోనే కేంద్రంపై వ్య‌తిరేకంగా తాము అవిశ్వాసం నోటీసులు ఇచ్చామ‌ని, నిరాహార దీక్ష‌కు సైతం దిగామ‌ని చెబుతున్నారు.

కేంద్రానికి తెలియాలంటే….

ఏపీకి ప్ర‌త్యేక హోదా రావాల‌న్నా.. ఏపీ ఆర్థికంగా నిల‌దొక్కుకోవాల‌న్నా.. కూడా కేంద్రానికి ఏపీ స‌మ‌స్య‌లు తెలియాలి. ఏపీలో ఏం జ‌రుగుతోందో? ప్ర‌జ‌లు ఎలా రోడ్ల మీదికి వ‌స్తున్నారో కూడా తెలియాలి. అయితే, కేంద్రం మాత్రం ఈ విష‌యా ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే టీడీపీ నేత‌లు కేంద్రానికి తెలిసి వ‌చ్చేలా.. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన బీజేపీ జాతీయ సార‌థి అమిత్ షాను అడ్డ‌గించారు. ఆయ‌న‌కు న‌ల్ల‌జెండాలు చూపించి ఎందుకు ఏపీకి వ‌చ్చా రంటూ ప్ర‌శ్నించారు. పెద్ద ఎత్తున తిరుమ‌ల‌లో హ‌ల్ చ‌ల్ సృష్టించారు.ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ దృష్టిని ఆక‌ర్షించింది.

తాము ఆందోళనకు దిగితే….

ఇక్క‌డ వైసీపీ కూడా ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేసి ఉండాల్సింది. బీజేపీ జాతీయ స్థాయి అధ్య‌క్షుడికి సెగ త‌గిలేలా కూడా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. వైసీపీ నేత‌లు ఒక్క‌రుకూడా ఇక్క‌డ స్పందించ‌లేదు. అయితే వైసీపీ వాదన వేరేలా ఉంది. ఇటీవల తిరుపతిలో తాము ఆందోళన నిర్వహిస్తే ఒక బైక్ తగులబడిన సంఘటనను తెలుగుదేశం ప్రభుత్వం పెద్దదిగా చేసి చూపిందని, తాము రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నట్లు ప్రచారం చేసిందని, మరి అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడిని ఎలా చూడాలని వారు ప్రశ్నిస్తున్నారు. ‘‘మా వ్యూహాలు మాకున్నాయి. అంతిమంగా కేంద్రప్రభుత్వం, టీడీపీయే మా టార్గెట్. రెండూ కలసి ఏపీ ప్రజలను మోసం చేశాయి’’ అంటున్నారు వైసీపీ నేతలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*