ఇక్కడ జగన్ టార్గెట్ ఆ నలుగురే….!

వైసిపి అధినేత జగన్ ఎక్కడికి వెళ్ళినా ఇసుక మాఫియా పై విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచి ఎక్కడికక్కడ తమ్ముళ్ళు అధికారులు కలిసి ఇసుక దోపిడీ ఉచితం పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా పశ్చిమ నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన జగన్ రాజమండ్రి సభలో గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా నడుపుతున్నారంటూ నలుగురు ప్రజా ప్రతినిధులపై నేరుగా ఆరోపణలు గుప్పించారు. వారెవరంటే రాజమండ్రి ఎంపీ మురళి మోహన్, మంత్రి జవహర్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్. ఈ నలుగురు ఈ ప్రాంతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక మాఫియా గా దోచుకుంటూ పెదబాబు,చినబాబులకు వాటాలు పంపుతున్నారని జగన్ ఆరోపించారు.

ఎంపీల రాజీనామాలను ప్రస్తావించని జగన్ …

పార్లమెంట్ లో ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కోరుతూ వైసిపి ఎంపీలు చేసిన రాజీనామాల వ్యవహారంపై జగన్ రాజమండ్రి సభలో ప్రస్తావించలేదు. ఈ రాజీనామాలను స్పీకర్ ఆమోదించకపోవడం, ఎన్నికలు తప్పించుకోవడానికే అని టిడిపి రాద్ధాంతం చేస్తున్నా వైసిపి చీఫ్ ఈ అంశాన్ని పక్కన పెట్టేశారు. తన తండ్రి హయాంలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన అభివృద్ధి ముఖ్యంగా రాజమండ్రి ప్రాంతానికి చేసిన పనులను ప్రస్తావించి 19 నియోజకవర్గాలు వున్న జిల్లాలో 15 మంది అధికార పార్టీలో ఉండి ఈ జిల్లాకు మేలు చేసిన ది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు.

బాబుపై సెటైర్లు…..

గోదావరి పై నాలుగోవంతెన, నన్నయ్య యూనివర్సిటీ ఇలా అనేక శాశ్వత అభివృద్ధి పనులు వైఎస్సాఆర్ చేసినవేనని గుర్తు చేశారు. పోలవరం అవినీతి మయంగా మార్చేశారని మాటి మాటికీ శంఖుస్థాపనలు ఏమిటంటూ ఎద్దేవా చేశారు. ఇల్లు పూర్తి కాకుండా గృహ ప్రవేశం చేయడం చంద్రబాబు కే చెల్లిందని, చంద్రబాబు పోలవరం డయాఫ్రామ్ వాల్ శంఖుస్థాపనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నవరత్నాల్లో వైద్యానికి సంబంధించి వెయ్యి రూపాయలు దాటే ఖర్చును ఆరోగ్య శ్రీ లో చేరుస్తామని పేర్కొన్నారు. ఒక పక్క వరాలు కురిపిస్తూ మరోపక్క అధికారపార్టీపై విమర్శలు ఆరోపణలు గుప్పిస్తూ సాగిన జగన్ ప్రసంగానికి విశేష స్పందనే లభించడంతో వైసిపి శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*