జగన్ ను అలా టార్గెట్ చేస్తే….?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కౌంటర్ ఎటాక్ ఇవ్వడంలో దిట్ట. బహుశా ఇందులో ఆయనకున్న అనుభవం దేశంలో ఏ రాజకీయనేతకూ లేదనే చెప్పాలి. ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు తనపైనా, పార్టీపైనా, ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు కౌంటర్ ఇవ్వాలంటే అనేక పద్ధతులు పాటిస్తారు. ఒకటి ఆ సామాజిక వర్గాల వారితోనే ఎటాక్ చేయించడం. రెండు అవతలి వారి బలహీనతలను బయటపెట్టించడం. అందుకే ఫార్టీ ఇయర్స్ లో చంద్రబాబు రాజకీయంగా సక్సెస్ అయ్యారంటారు. తాను చేసింది కరెక్ట్…ఇతరులు చేసింది తప్పు అనుకునే చంద్రబాబు వైసీపీపై మరోసారి కౌంటర్ ఎటాక్ కు దిగారు.

పార్టీలో చేర్చుకుని…మంత్రిపదవులు ఇచ్చి….

వైసీీపీ నుంచి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరిట చంద్రబాబు వేసిన వలలో పడిన వైసీపీ ఎమ్మెల్యేల్లో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. తాము ఏపీ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నామని, చంద్రబాబు వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని పార్టీ మారిన నేతలు అప్పట్లో చెప్పారు. జగన్ పార్టీని మానసికంగా, సంఖ్యాపరంగా దెబ్బతీసేందుకు విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారన్నది కాదనలేని వాస్తవం. గత ఎన్నికల్లో ఏపీలో విపక్షం అంటూ ఏమీలేదు. బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేయగా, వైసీపీ ఒంటరి పోరు చేసింది. కాంగ్రెస్, కమ్యునిస్టులకు ఒక్కసీటు కూడా దక్కలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఒక్కటే విపక్షంగా ఉంది. దాన్ని వీక్ చేయాలన్న లక్ష్యంతోనే 23 మందిని పార్టీలోకి చేర్చుకున్నారన్నది వైసీపీ ఆరోపణ.

స్పీకర్ కు వైసీపీ లేఖ….

ఈ నేపథ్యంలో గత కొన్ని అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ డుమ్మాకొడుతోంది. విపక్షం లేకుండానే అధికార పక్షం శాసనసభ సమావేశాలను నిర్వహించుకుంటూ వస్తోంది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, నలుగురు మంత్రులను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేస్తేనే తాము శాసనసభ సమావేశాలకు హాజరవుతామని వైసీపీ చెబుతూ వస్తోంది. ఈమేరకు నిన్న వైసీపీ స్పీకర్ కు ఘాటుగా లేఖ కూడా రాసింది. తాము సభకు ఎందుకు రావడం లేదో…. కూలంకషంగా వివరించింది. అయితే పార్టీ మారిన వారిని చంద్రబాబు అనుకూల మీడియా రెబల్స్ గా అభివర్ణిస్తుండటం విశేషం. ఫిరాయింపుదారులకు బాబు అనుకూల మీడియా తిరుగుబాటు దారులు గా పేరు పెట్దడం విశేషం.  పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత చంద్రబాబు జగన్ కు ఘాటుగా లేఖరాయించారు.

జగన్ కు జంప్ జిలానీలు…..

జగన్ నియంతృత్వ పోకడలను భరించలేకపోతున్నామని, ఎవరి మాట విననందునే తాము పార్టీ నుంచి బయటకు వచ్చామని, అనుభవం, వయస్సులేని జగన్ నాయకత్వంలో పనిచేయలేక, రాష్ట్రం అభివృద్ధి కోసమే చంద్రబాబు పార్టీలోకి వచ్చామని చెబుతున్నారు. ఈ లేఖలో జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం విశేషం. పట్టిసీమ, పోలవరం, రాజధాని నిర్మాణాలను అడ్డుకోవాలని పార్టీ అంతర్గత సమావేశాల్లో జగన్ చెప్పినట్లు వారు ఆ లేఖలో చెప్పడం విశేషం. కేంద్రంతో కేసుల మాఫీకోసమే బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. అయితే పార్టీ మారిన వారికి నైతికత ఉంటుందా? అన్నదే ప్రశ్న. నియంతృత్వ పోకడలు భరించలేకే బయటకు వచ్చామని చెబుతున్న నేతలు పార్టీలో ఉన్నంత వరకూ జగన్ ను పొగడ్తలతో ఎందుకు ముంచెత్తారు? బీజేపీతో చంద్రబాబు కలసి ఉన్నప్పుడే బయటకు వచ్చిన ఈ నేతలు జగన్ కమలం పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఇప్పుడు ఎలా చెబుతారు? వంటి ప్రశ్నలు వైసీపీ నుంచి వస్తున్నాయి. మొత్తం మీద చంద్రబాబు తన మార్కు ఫార్ములాతోనే జగన్ ను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*