షార్ట్ ఫిల్మ్ తో జగన్…?

అప‌ర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. త‌న పాల‌న ఓ స్వర్ణయుగ‌మ‌ని, మ‌ళ్లీ మ‌ళ్లీ రావాల‌ని, కావాల‌ని ప్రజ‌లు కోరుకోవాల‌ని ఆయ‌న పిలుపునిస్తున్నారు. త‌న పాల‌న‌లో ఏపీలోని అన్ని మూల‌ల‌ను ప్రభావితం చేశామ‌ని, అన్ని స‌మ‌స్యలు తీరుస్తున్నామ‌ని ఆయ‌న ఎక్కడ ఏ వేదిక ఎక్కినా చెప్పుకొస్తున్నారు. అయితే, ఉత్తరాంధ్ర ప‌రిస్థితి ఏంటి? అక్కడి స‌మ‌స్యలు ప‌ట్టించుకున్నారా? అంటే మౌన‌మే స‌మాధానంగా క‌నిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా కిడ్నీ రోగుల దుస్థితి.. అక్కడి సాగు, తాగునీటి ప‌రిస్థితి.. ఉత్తరాంధ్ర సుజ‌ల శ్రవంతి అంటూ పెద్ద పెద్ద ప్రక‌ట‌న‌లు గుప్పించినా ఒన‌గూర‌ని ప్రయోజ‌నం వంటివి రాష్ట్రంలో ఉత్తరాంధ్రను ప్రత్యేక స‌మ‌స్యల ప్రభావిత ప్రాంతంగా మార్చేశాయి.

పవన్ ప్రకటనలకే….

దీనిపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొన్ని రోజులు ప్రక‌ట‌న‌లు చేయ‌డం, ప్రసంగాలు, ప‌ర్యట‌న‌ల‌తో స‌రిపుచ్చడం వ‌రకే ప‌రి మిత‌మ‌య్యారు. అయిన‌ప్పటికీ.. ప్రభుత్వం ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోలేదు. ఇక‌, తాజాగా ఇప్పుడు ఉత్తరాంధ్ర బాగానే ఉంద‌ని, త‌మ హ‌యాంలో పెద్ద ఎత్తున అభివృద్ధికి అవ‌కాశం ఇస్తున్నామ‌ని చెప్పుకొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు దిమ్మ తిరిగేలా.. జ‌గ‌న్ స‌రికొత్త ప్లాన్‌తో ముందుకు వ‌చ్చారు. ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలు ప్రతిబింబించేలా రూపొందించే డాక్యుమెంటరీ అండ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కాంటెస్ట్‌కు జ‌గ‌న్ సంక‌ల్పించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆలోచన మేరకు ఈ కాంటెస్ట్‌ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన వైసీపీ ఐటీ వింగ్‌ ఔత్సాహికులకు ఆహ్వానం పలికింది.

కళ్లకు కట్టేలా…..

ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కళ్లకు కట్టేలా షార్ట్ ఫిల్మ్స్‌ రూపొందించాలని నిర్వాహకులు కోరారు. ఈ కాంటెస్ట్‌ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని ప్రజల సమస్యలు వెలుగులోకి తీసుకురా వడంతో పాటు వాటి పరిష్కారానికి దోహదం చేసినట్లవుతుందన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సౌజన్యంతో అందజేస్తున్నట్లు తెలిపారు. ఇక‌, దీనికి రాజ‌కీయంగా ప్రాధాన్యం ఏర్పడ నుంది. ఉత్తరాంధ్రలో తాము అనేక విధాల అభివృద్ధి చేప‌ట్టామ‌ని, వంశ‌ధార న‌దిని ఇక్కడి ప్రజ‌ల‌కు అందించామ‌ని అంటున్నా.. కిడ్నీ రోగుల‌కు నెల‌కు రూ.2000 పింఛ‌న్లు ఇస్తున్నామ‌ని చెబుతున్నా.. ఇవ‌న్నీ వృథాయేన‌ని స్పష్టంగా తెలిసింది. మొత్తానికి ఈ ప‌రిణామం.. యువ‌త‌లో వైసీపీ క్రేజ్ పెంచుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*