ఎలా చేసినా జగన్ కు అడ్వాంటేజేనా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు విలన్? ఎవరు హీరో అన్నది వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారు. అది పక్కన పెడితే అధికార, ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఒకరిని మరొకరు విలన్లుగా చిత్రీకరించుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే జగన్ మోదీని ఒక్క మాట అనలేదని గడచిన నాలుగు మాసాలుగా తెలుగుదేశం పార్టీ వైసీపీ పైన విరుచుకుపడుతోంది. కేసుల మాఫీ కోసమే జగన్ కమలనాధుల జపం చేస్తున్నారని ఆరోపిస్తుంది. వైసీపీ విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్న ఫొటోలను కూడా టీడీపీ బయటకు విడుదల చేసి ఆ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది.

సోషల్ మీడియా వేదికగా….

నిజానికి బీజేపీపైన ఇప్పుడు ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటుగా, విభజన హామీలేవీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం పట్ల గుర్రుగా ఉన్నారు. ఇప్పడు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ కన్నా, విభజన హామీలు అమలుపర్చని బీజేపీని ప్రజలు ఏవగించుకుంటున్నారన్నది టీడీపీ అంచనాకు వచ్చింది. అందుకోసమే జగన్ కు, బీజేపీకి సంబంధాలున్నాయన్న ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. ప్రత్యేక హోదాకోసం వైసీపీ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసినా దానిపై కూడా టీడీపీ విమర్శలు చేస్తోంది. అవిశ్వాసం సమయంలో మోదీని రక్షించడానికే వైసీపీ ఎంపీలు ముందుగానే రాజీనామాలు చేశారని టీడీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది.

కాంగ్రెస్ వైపు అడుగులు….

మరోవైపు కాంగ్రెస్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంబంధాలు మెరుగుపర్చుకుంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ తో చేతులు కలిపితే తప్పేమిటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. ఒకరిద్దరు నేతలు కాంగ్రెస్ తో పొత్తు వద్దని బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా? లేదా? అన్నది అప్పటికప్పుడు నిర్ణయించాలన్నది చంద్రబాబు వ్యూహం. అప్పటి ప్రజల మూడ్ ను బట్టి పొత్తుపై నిర్ణయం తీసుకుంటారు. ఇక తెలంగాణ విషయానికొస్తే అక్కడ కాంగ్రెస్ తో పొత్తు దాదాపు ఖాయమైపోయినట్లే. ఈ మేరకు తెలంగాణ పార్టీ బాధ్యులకు చంద్రబాబు సంకేతాలిచ్చినట్లు కూడా తెలుస్తోంది.

తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా…..

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా ఏపీలో ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. ఏపీలో పొత్తు పెట్టుకుంటే తమకే లాభమని, తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా ఆంధ్రప్రజలు హర్షించరని చెబుతున్నారు. ఇందుకోసం అనైతిక పొత్తు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ హోరెత్తిస్తోంది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో చేతులు కలుపుతూ ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేస్తున్నారని, జగన్ ను అక్రమ కేసుల్లో ఇరికించిన వారితో చేయి కలిపి మరోసారి చంద్రబాబు కుట్రలకు తెరలేపుతున్నారన్న ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఎక్కడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా తమకు ఓట్ల పరంగా లాభదాయకమేనన్న వైసీపీ వాదనలో నిజమెంతో? అబద్ధమెంతో పక్కన పెడితే….టీడీపీకి మాత్రం కొంత డ్యామేజీ అని చెప్పక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*