జగన్ ఆపరేషన్ ఇక్కడ ఫెయిలయిందే….!

ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో ఏకైక విప‌క్షం వైసీపీ ప‌రిస్థితి ఏంటి? అక్క‌డ పార్టీ పుంజుకుంటోందా? లేక రోజు రోజుకు దిగ‌జారుతోందా? ప‌రిస్థితి ఏంటి? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఇక్క‌డ రాజ‌కీయం ప‌రిస్థితి చూస్తే ఇక్క‌డ అటు కాంగ్రెస్‌కు, ఇటు టీడీపీకి కూడా ప్ర‌జ‌లు జై కొడుతున్నారు. ప్ర‌ధానంగా త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేవారికే ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డుతుండడం గ‌మ‌నార్హం. 1994లో ఒక‌సారి.. త‌ర్వాత 2014 ఒక‌సారి మాత్రం ఇక్క‌డి ప్ర‌జ‌లు టీడీపీకి అవ‌కాశం ఇచ్చారు. మిగిలిన అన్ని ఎన్నిక‌ల్లో ఒక్క‌సారి మాత్రం ఇండిపెండెంట్‌గా బ‌రిలోకి దిగిన బూచేప‌ల్లి సుబ్బారెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన సీనియ‌ర్ నేత శిద్దా రాఘ‌వ‌రావు గెలుపొందారు.

శిద్దాకు చెమటలు పట్టించిన…..

అదే స‌మ‌యంలో ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన బూచేప‌ల్లి అడుగ‌డుగునా శిద్దాకు చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఆ ఎన్నిక‌ల్లో శిద్దాకు 88,821 ఓట్లు వ‌స్తే.. బూచేప‌ల్లికి 87,447 ఓట్లు వ‌చ్చాయంటే ఏ రేంజ్‌లో బూచేప‌ల్లి హ‌వా సాగి ఉంటుందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ దెబ్బ‌తో కేవ‌లం వెయ్యి పైచిలుకు ఓట్ల‌తోనే శిద్దా ఇక్క‌డ విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ఇక్క‌డ గెలిచేందుకు నానా తంటాలు ప‌డి ఎలాగోలా గ‌ట్టెక్కిన శిద్ధా మంత్రి అయ్యాక మాత్రం ప‌నులు చేస్తూ గ్రిప్ తెచ్చుకున్నారు. అయినా ఆయ‌న ప‌రిస్థితి ఇక్క‌డ అంత సులువుగా ఏమీ లేదు. ఇక‌, ఇక్క‌డ విప‌క్షం ప‌రిస్థితికి వ‌స్తే.. ఆధిప‌త్య ధోర‌ణి నేప‌థ్యంలో నేత‌లు త‌మ‌లో తాము పోరాడుకుంటున్న క్ర‌మంలో వైసీపీ ఇక్క‌డ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌డం లేదు.

మాధవరెడ్డితో బూచేపల్లికి……

నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన ప‌ట్టున్న బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఈసారి తాను పోటీ చేయనని ప్రకటించారు. అంతేకాదు, అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై ఆయ‌న ఒకింత గుర్రుగా కూడా ఉన్నారు. దీంతో ఆయ‌న కొన్నాళ్లుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. దీంతో వైసీపీ అధినేత‌ జగన్‌.. బాదం మాధవరెడ్డిని ఇన్‌చార్జిగా ప్రకటించారు. అయితే, మాధవరెడ్డితో బూచేపల్లికి సత్సంబంధాల్లేవు. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌, నాయ‌కుల‌ను న‌డిపించ‌డం వంటి కీల‌క అంశాల్లో వైసీపీ శ్రేణులు ఎక్క‌డి గొంగ‌ళి అక్క‌డే అన్న చందంగా ఉన్నాయి.

గ్రూపులకు చెక్ పెట్టే ప్రయత్నాలు….

మ‌రోప‌క్క‌, పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలో నేత‌లు ఒక‌రికొక‌రు పోటీ ప‌డుతున్నారు. దీంతో ఒక‌ర‌కంగా పార్టీలో శూన్య‌త ఆవ‌రించింది. బూచేప‌ల్లికి ఉన్న ప్ర‌జాద‌ర‌ణ మ‌రో నేత‌కు ఇక్క‌డ లేక‌పోవ‌డం, ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ నుంచి త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించ‌డం, పోనీ.. తానెవ‌రికైనా మ‌ద్ద‌తిస్తాన‌ని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం వంటి ప‌రిణామాలు వైసీపీకి ఇబ్బంది క‌రంగా మారాయి. ద‌ర్శి విష‌యంలో జ‌గ‌న్ చేస్తోన్న ఆప‌రేష‌న్లు ఫ‌లించ‌డం లేదు. ఇక వైవి.సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసుల రెడ్డి కూడా ఇక్క‌డ గ్రూపుల మ‌ధ్య కొట్లాట‌ల‌కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. దీంతో ద‌ర్శిలో సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్న వైసీపీ బ‌లమైన లీడ‌ర్ లేక కొట్టుమిట్టాడుతోంది. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ద‌ర్శి వైసీపీలో ఏం జ‌రుగుతుందో చూడాలి. వైసీపీ పుంజుకునేందుకు ఆ పార్టీ నేత‌లు ఎలాంటి వ్యూహాలు అమ‌లు చేస్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*