జ‌గ‌న్ ఆ పని అర్జెంట్ గా చేయరూ….!

గుంటూరు జిల్లాలో అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వర్గం చిల‌కలూరిపేట‌. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్నారు మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు. అయితే, అదే స‌మ‌యంలో కాంగ్రెస్ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి గ‌తంలో ఎమ్మెల్యేగా గెలిచిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ బాధ్య‌త‌లు మోస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న పార్టీ జిల్లా అధ్య‌క్షుడిగా ప‌ని చేయ‌డంతో పాటు పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా కూడా ప‌నిచేశారు. అయితే వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ ప్ర‌త్తిపాటి చేతిలో ఓడిపోతూ వ‌స్తోన్న ఆయ‌న ఆర్థికంగా తీవ్ర‌మైన ఇబ్బందుల్లో ఉన్నారు. మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌డం, ప్ర‌త్తిపాటి పుల్లారావు వంటి ఆర్థిక బ‌లం ఉన్న నాయ‌కుడిని ఓడించ‌డం అంటే మాట‌లు కాద‌ని నిర్ణ‌యించుకున్న జ‌గ‌న్ ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దిగేందుకు ముందుకు వ‌చ్చిన ఎన్నారై మ‌హిళ విడ‌ద‌ల ర‌జ‌నీని రంగంలోకి దింపారు. ఆమెకు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌గ్గాలు అప్ప‌గించారు.

ప్రచారంలో మర్రి…….

అయితే, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ మాత్రం త‌న మానాన త‌ను ప్ర‌చారం ముమ్మ‌రం చేసుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మ‌ర్రి.. టికెట్ త‌న‌కే ల‌భిస్తుంద‌ని అనుకుంటున్నారు అయితే, ఇప్ప‌టికే టికెట్‌పై భ‌రోసాతో ఉన్న విడ‌ద‌ల ర‌జ‌నీ మాత్రం నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. దీంతో వైసీపీలో ఇద్ద‌రు నాయకులు అన్న‌ట్టుగా ఉంది వ్య‌వ‌హారం. ఈ విషయంలో పార్టీ అధిష్టానం నుంచి స్ప‌ష్ట‌మైన‌ స్పష్టత లేకపోవడంతో కేడర్‌ అయోమయంలో పడింది. ఈలోగా ఎవరికివారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి రెండు గ్రూపుల వారు ఎవరికివారే భారీ ఎత్తున పోటాపోటీగా నిర్వహించారు. నిన్న‌టి వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న మ‌ర్రి రాజశేఖర్‌ నియోజకవర్గంలో పర్యటించడం ప్రారంభించారు.

ఆత్మీయ సమావేశం పేరుతో…..

తాజాగా ఆయ‌న తొలుత పట్టణంలోని 1వ వార్డులో ఆత్మీయ సమావేశం పేరుతో ఆ వార్డు నాయకులను కలసి ఎన్నికలలో తన పోటీ ఖాయమని వారికి తెలిపారు. యడ్లపాడు మండలం లింగారావుపాలెంలోనూ రాజశేఖర్‌ పర్యటించారు. గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. అలాగే గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు మెజార్టీ వ‌చ్చిన చిల‌క‌లూరిపేట మండ‌లంలో త‌న ఆత్మీయులు, బంధువుల‌తో ఓ సీక్రెట్ మీటింగ్ కూడా నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. త‌న‌కు కాకుండా ఎవ‌రికి సీటు ఇచ్చినా స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేద‌ని అక్క‌డ కొంద‌రు తీర్మానించిన‌ట్టు కూడా తెలుస్తోంది.

రజనీ రెట్టించిన ఉత్సాహంతో…..

ఇదిలా ఉంటే స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మితులైన విడదల రజని రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌’ యడ్లపాడు మండలం ఉన్నవ నుంచి ప్రారంభించారు. గుంటూరు, కోటప్పకొండలో పార్టీ కార్యక్రమాలలో సమన్వయకర్త హోదాలో రజని పాల్గొన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన వాగ్దాటితో పాటు పార్టీ కార్య‌క్ర‌మాల‌తో ఆమె దూసుకుపోతున్నారు. ఇక పార్టీలో నిన్న‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న నాయ‌కులు సైతం ఆమెను క‌లిసి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. పుల్లారావును ఆమె బ‌లంగా ఢీకొడుతుంద‌న్న అంచ‌నాలు కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి.

ఆమె కార్యక్రమాల్లో……

ఇదిలా ఉంటే ర‌జ‌నీ చేప‌డుతోన్న కార్య‌క్ర‌మాల్లో రాజశేఖర్‌ పాల్గొనలేదు. దీంతో పార్టీలో ఒకింత అయోమ‌యం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఇప్ప‌టికైనా క‌లుగ జేసుకుని రాజ‌శేఖ‌ర్‌కు న‌చ్చ‌జెప్పు కోవ‌డం లేదా ఆయ‌న‌కు పార్టీలో స‌ముచిత‌మైన స్థానంపై బ‌ల‌మైన హామీ ఇస్తే పేట‌లో వైసీపీ జెండా ఎగ‌ర‌డం ప‌క్కాయే అని ఆ పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. వాస్త‌వంగా గుర‌జాల‌లో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణ‌మూర్తి బ‌దులుగా కాసు మ‌హేష్‌రెడ్డికి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ప‌గ్గాలు ఇచ్చిన‌ప్పుడు జ‌గ‌న్ ఓపెన్‌గానే జంగాకు పార్టీలో ప్రాధాన్యం ఉంటుంద‌ని.. ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అలాంటి బ‌ల‌మైన హామీ జ‌గ‌న్ మ‌ర్రికి కూడా ఇస్తే పేట వైసీపీలో క్లారిటీ ఇవ్వ‌డంతో పాటు ర‌జ‌నీ జోరు మ‌రింత ఊపందుకోవ‌డం ఖాయ‌మే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*