పిల్లి చెప్పినా…జగన్ ఆయన వైపే మొగ్గు…?

కోనసీమ లోని ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి రాజకీయంగానే కాదు భౌగోళికంగాను అనేక ప్రత్యేకతలు వున్నాయి. ఐ పోలవరం మండలం,ముమ్మిడివరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాలు ముమ్మిడివరం నియోజకవర్గంలో భాగం. ముమ్మిడివరం బాలయోగికి పట్టున్న ప్రాంతంగా , ఆధ్యాత్మిక ప్రదేశంగా ప్రసిద్ధి. గోదావరి నదీ పాయలు విశాలమైన సముద్ర తీరం ఈ నియోజకవర్గం సొంతం. రామకృష్ణ మిషన్ చేపట్టిన యానాం ఎదుర్లంక పర్యాటకులను ఆకర్షిస్తుంది. మత్సకారులు అధికంగా నివసించే ఈ ప్రాంతం లో తుఫాన్ లు వచ్చినప్పుడు నష్టం తీవ్రంగా ఉంటుంది. రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, లోక్ సభ స్పీకర్ గా రాణించిన టిడిపి నేత స్వర్గీయ గంటి మోహన చంద్ర బాలయోగి ఇక్కడే పుట్టిపెరిగారు. కొబ్బరి,వరి, చేపలవేట ఇక్కడి వారి ప్రధాన జీవనాధారం. అత్యంత సుందరమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నప్పటికీ దశాబ్దాలుగా అన్ని ప్రభుత్వాలు ముమ్మిడివరం నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశాయి. ఓఎన్జీసీ, కెయిర్న్ ఎనర్జీ, గెయిల్, రిలైయన్స్ వంటి సంస్థలు ఇక్కడ వున్న అపార చమురు నిక్షేపాలను తరలించుకుపోవడంలో పెట్టిన శ్రద్ధ ఈ ప్రాంత అభివృద్ధిపై నామమాత్రంగానే పెట్టాయి. ఇటీవలే ఇక్కడ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏర్పాటు తో ఉపాధి అవకాశాలు మెరుగుపడినా మత్సకారుల వేటకు ఈ కార్యకలాపాలు అడ్డుగా నిలిచాయి. ప్రస్తుతం ముమ్మడివరం నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. 1983 నుంచి అసెంబ్లీ ఎన్నికలు పరిశీలిస్తే ...

టీడీపీ ఆవిర్భావం తర్వాత….

1983 లో టిడిపి ఏపీ రాజకీయ ముఖ చిత్రంలోకి రాగానే ఎన్టీఆర్ కొత్తపార్టీని ముమ్మిడివరం ప్రజలు ఆదరించారు. వాకాటి సక్కుబాయి టిడిపి అభ్యర్థిగా నాడు గెలిచారు. 1985 లో పండు కృష్ణ మూర్తి టిడిపి నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆతరువాత 1989, 1994 ఎన్నికల్లో బత్తిన సుబ్బారావు వరుసగా గెలిచి కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఇక్కడ పూర్వవైభవం తెచ్చారు. 1999 లో జరిగిన ఎన్నికల్లో చెల్లివివేకానంద టిడిపి నుంచి 2004 లో పినిపే విశ్వరూప్ కాంగ్రెస్ నుంచి 2009 లో పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కాంగ్రెస్ నుంచి 2014 లో దాట్ల సుబ్బరాజు టిడిపి నుంచి అసెంబ్లీ లో అడుగుపెట్టారు.

మూడు దఫాల ఎన్నికలు పరిశీలిస్తే …

2004 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ గాలి విపరీతంగా ఆయన చేసిన పాదయాత్ర ఫలితంగా వీచింది. కాంగ్రెస్ అభ్యర్థి విశ్వరూప్ 15 వేల 357 ఓట్ల మెజారిటీతో చెల్లి శేషకుమారి పై ఘన విజయం సాధించారు. 2009 ఎన్నికలు వచ్చేటప్పటికి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గాలి కోనసీమలో ఊపేస్తోంది. త్రికోణ పోటీలో కాంగ్రెస్ టిడిపి ప్రజారాజ్యం నువ్వా నేనా అని తలపడ్డాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాడ సతీష్ 1925 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. టిడిపి అభ్యర్థి నడింపల్లి శ్రీనివాస రాజు రెండవస్థానంలో, ప్రజారాజ్యం అభ్యర్థి కుడుపూడి సూర్యనారాయణ రాజు మూడవ స్థానం దక్కించుకున్నారు. ఓట్ల పరంగా పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి సతీష్ కి 51 వేల 87 ఓట్లు రాగా టిడిపి అభ్యర్థి శ్రీనివాస రాజు కి 49162 ఓట్లు, ప్రజారాజ్యం అభ్యర్థి కుడిపూడి సూర్యనారాయణ కు 31400 వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం ప్రభావంతో టిడిపి పరాజయం పాలుకాగా కాంగ్రెస్ అభ్యర్థి గట్టెక్కారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో టిడిపి కి బిజెపి, జనసేన పొత్తు కలిసివచ్చింది. ఫలితంగా దాట్ల సుబ్బరాజు 29 వేల 538 ఓట్లు మెజారిటీతో వైఎస్సార్ సిపి గుత్తుల శ్రీనివాసరావు పై విజయం సాధించారు. రెండు ప్రధాన పార్టీల నడుమ 17.0ఓట్ల శాతం తేడా ఇక్కడ బిజెపి, జనసేన టిడిపికి ఇచ్చిన మద్దతు ప్రభావాన్ని స్పష్టంగా చాటిచెబుతుంది.

పొన్నాడకే వైసిపి టికెట్ …

టిడిపి సిట్టింగ్ అభ్యర్థి సుబ్బరాజు కి తిరిగి టికెట్ దక్కేది లేనిది ఆ పార్టీ సర్వే తేల్చనుంది. వైసిపి నుంచి మాత్రం ఈసారి పొన్నాడ సతీష్ కె టికెట్ దాదాపు ఖరారు అయ్యింది. మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినా మత్సకారులు అధికంగా వున్న నియోజకవర్గం కావడంతో వైసిపి చీఫ్ జగన్ పొన్నాడ కె మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. రాబోయే 2019 ఎన్నికల్లో జనసేన కూడా పోటీకి దిగనున్న నేపధ్యం బిజెపి తన మిత్రపక్షం టిడిపి కి బద్ధవిరోధిగా మారిన పరిస్థితుల్లో ఇక్కడి ఫలితం ఉత్కంఠ భరితమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*