ఇక్కడ జగన్ తప్పు చేస్తున్నారా…?

ఏపీ ఐటీ రాజ‌ధానిగా వెలుగొందుతున్న విశాఖ‌లో నానాటికీ పుంజుకోవాల్సిన వైసీపీ.. రానురాను దిగ‌జారిపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక్క‌డ పార్టీ పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే, నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు పెరిగిపోవడంతో క‌ష్టాలు పార్టీని వెంటాడుతున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. విశాఖ ఉత్తర నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ క‌ష్టాలు ఎదుర్కొంటోంది.గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్కడ విజ‌యం సాధించాల‌ని పార్టీ భావించింది. అయితే, అనూహ్య రీతిలో ఇక్కడ బీజేపీ-టీడీపీ త‌ర‌ఫున రంగంలోకి దిగిన విష్ణుకుమార్ రాజు విజ‌యం సాధించారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా ఇక్కడ సీటు ద‌క్కించుకోవాల‌ని వైసీపీ భావించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ ముగ్గురు స‌మ‌న్వయ క‌ర్తల‌ను రంగంలోకి దింపింది.

ఇంత కాలం కష్టపడితే….

పసుపులేటి ఉషాకిరణ్‌.. సత్తి రామకృష్ణారెడ్డి.. సనపల చంద్రమౌళి.. వైసీపీ ఇంచార్జులుగా ఇక్కడ ఉన్నారు. పార్టీ కోసం అహ‌ర‌హం శ్రమించారు.ఇక్కడ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని గెలుపు గుర్రం ఎక్కించాల‌ని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యక్రమాల‌ను భుజాన వేసుకున్నారు. అయితే, వీరివ‌ల్ల పార్టీ గెలుపు గుర్రం ఎక్కడం క‌ష్టమ‌ని అనుకున్నారో ఏమో.. ఇక్కడ పార్టీ వ్యవ‌హారాల‌ను చూస్తున్న వైసీపీ ప్రధాన కార్యద‌ర్శిఎంపీ విజ‌యసాయి రెడ్డి ఈ ముగ్గురినీ ప‌క్కకు పెట్టి.. వీరి స్థానంలో సింగిల్‌ కో ఆర్డినేటర్‌గా ఇటీవలే పార్టీలో చేరిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కేకే రాజును నియమించారు. అయితే తొలగించిన సమన్వయకర్తల‌ను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. అయిన‌ప్పటికీ.. ఈ ముగ్గురు స‌మ‌న్వయ క‌ర్తలు మాత్రం తీవ్ర అసంతృప్తిలోనే ఉన్నారు.

అసంతృప్తిలో ముగ్గురు…..

తాము పార్టీకి ఎంతో క‌ష్టప‌డ్డామ‌ని, పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నామ‌ని వారు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. అయినా వీరిమాట‌ల‌ను ప‌ట్టించుకునే వారు క‌రువ‌య్యారు. వాస్తవానికి ఈ ముగ్గురికి ఈ నియోజక వర్గంలో చెప్పుకోదగ్గ పట్టే ఉంది. స్థానిక ప్రజలతో మంచి సంబంధాలే ఉన్నాయి. తమ ముగ్గురిలో ఎవరినో ఒకరిని సమన్వయకర్తగా నియమిస్తే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదని అనుచరులతో అంటున్నారట! ఇప్పటి వరకు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారిని పక్కనపెట్టి అర్థబలం ఉన్నవారిని అందలం ఎక్కించడం వల్ల ప్రజలలో తప్పుడు సంకేతాలు వెళతాయని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, కొత్తగా వ‌చ్చిన స‌మ‌న్వయ క‌ర్త.. రాజు.. ఏమేర‌కు పార్టీని బ‌లోపేతం చేస్తాడో చూడాల‌ని అంటున్నారు.

కోరి కష్టాలు తెచ్చుకుందా?

విశాఖ ఉత్తరంలో ప‌రిస్థితి ఇలా ఉంటే తూర్పులో అయితే ఆ పార్టీ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెల‌గ‌పూడి శ్రీరామ‌కృష్ణ బాబుపై పోటీ చేసేందుకు స‌రైన నాయ‌కుడే లేడు. అక్కడ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌పై పోటీ చేసి ఓడిపోతోన్న వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ సారి పోటీ చేయ‌న‌ని చెప్పేశారు. ఇక మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు భీమిలి, పెందుర్తిలోనూ పార్టీ ప‌రిస్థితి అనుకూలంగా లేదు. ఇక విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు పార్టీ త‌ర‌పున స‌రైన నాయ‌కుడు లేడు. ఏదేమైనా.. ఇప్పుడు విశాఖ‌ వైసీపీలో అధిష్టానం పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి ఉత్తరం లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ కోసం క‌ష్టప‌డిన వారిని ప‌క్కన పెట్టేసి కోరి క‌ష్టాలు తెచ్చుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*