వారి వల్లనే వైసీపికి ఇక్కడ ఎడ్జ్…. !!

గాజువాక విశాఖ జిల్లాలో కీలకమైన అసెంబ్లీ సీటు. పూర్తిగా పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఈ సీటు ఎపుడూ హాట్ గానే ఉంటుంది. ఇక్కడ ఒకసారి గెలిస్తే మళ్ళీ గెలవడం బహు కష్టం. ఎందుచేతనంటే ఇక్కడ అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అలాగే, అనేకమైన ప్రైవేట్ సంస్థలు కూడా ఉన్నాయి. వీటిల్లో వేలాదిగా కార్మికులు, వారి కుటుంబాలు ఓటర్లుగా ఉన్నారు. ఇక్కడ గెలుపు వారి చేతుల్లోనే ఉంటుంది.వారి ఆవేశమే జాతకాలను మార్చేస్తుంది.

పల్లా జాక్ పాట్…….

ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన పల్లా శ్రీనివాసరావు 2009 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఏకంగా అప్పటి కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి గట్టి పోటీ ఇచ్చారు. అపుడు పోటీలో ఉన్న టీడీపీ ఎంపీ క్యాండిడేట్ ఎంవీవీఎస్ మూర్తి మూడవ స్థానానికి పడిపోయారు. ఇక ఆ తరువాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడం తరువాత అటువైపు ఉన్న నేతలు టీడీపీ తీర్ధం పుచ్చుకోవడంతో పల్లా కూడా సైకిలెక్కేసారు.

రాజకీయ కుటుంబం…..

పల్లా శ్రీనివాసరావు అలా 2014 ఎన్నికల్లో గాజువాక టికెట్ సంపాదించి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచారు. ఆయనది కూడా రాజకీయ కుటుంబమే. తండ్రి పల్లా సింహాచలం విశాఖ రెండో నియోజకవర్గం ఉన్నపుడు ఓసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ వారసత్వంగా పల్లా రాజకీయాల్లో రాణిస్తున్నారు. అప్పట్లో ఆయన గెలుపు వెనక తండ్రి పలుకుబడి కూడా చాలా ఉంది.

సామాజిక సమీకరణలు…..

గాజువాకలో సామజిక సమీకరణాలు కూడా పల్లా గెలుపునకు గత ఎన్నికల్లో సహకరించాయి. ఆయన యాదవ సామజికవర్గం. ఆ ఓట్లు అక్కడ దండిగా ఉండడంతో పాటు కార్మిక వర్గం పూర్తి మద్దతు కూడా దక్కింది. తండ్రి పల్లా సింహాచలం కార్మిక నాయకుడు కావడం కూడా హెల్ప్ అయింది. మొత్తానికి వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిన నాటి పోరులో పల్లా విజయ బావుటా ఎగరేశారు.

మారుతున్న వాతావరణం…..

నాలుగున్నరేళ్ళతో పోలిస్తే ఇపుడు మార్పు కనిపిస్తోంది. గాజువాకలో ఈసారి కొత్త రాజకీయం కనిపిస్తోంది. ఇక్కడ నుంచి జనసేన కూడా బరిలో నిలుచుంటోంది. ఆ పార్టీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు పోటీ చేస్తున్నారు. అలాగే యాదవ సామాజిక వర్గానికి చెందిన‌ కోన తాతారావు కూడా అదే పార్టీలో చేరారు. ఇక వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తిప్పల నాగిరెడ్డి జనంలో తిరుగుతూ సానుభూతి బాగా పెంచుకున్నారు. పైగా కార్మిక వర్గం ఓట్లు కూడా ఈసారి ఆయన‌కు పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

పనితీరు పెదవి విరుపు…..

పల్లా శ్రీనివాసరావు పనితీరు కూడా జనం పెదవి విరిచేలా ఉందని టాక్. కచ్చితంగా ఇదీ అభివృధ్ధి అని ఛెప్పుకోదగిన ఒక్క పని కూడా ఆయన చేయలేకపోయారని అంటున్నారు. గాజువాకలో కార్మికులు, పేదలు అధికంగా ఉన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఈసారి ప్రభావం చూపించే అవకాశలు ఉన్నాయి.పైగా జనసేన బరిలో ఉండడంతో ఓత్ల చీలిక టీడీపీకే దెబ్బ కొడుతుందని అంటున్నారు. కార్మికుల మద్దతు వైసీపీకి లభిస్తుందని, ఆ పార్టీకే ఎడ్జ్ ఉందని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే పల్లాకు కాని కాలమేనని సర్వేలు కూడా చెబుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*