జగన్ ఈ నేతను పక్కన పెట్టేశారా…!!

ఆయన మాజీ ఎమ్మెల్యే. రెండు పర్యాయాలు కాంగ్రెస్, వైసీపీల నుంచి నెగ్గిన చరిత్ర ఉన్న నాయకుడు. పార్టీకి చిత్తశుద్ధితో పనిచేస్తారని పేరుంది. 2014 ఎన్నికల్లో అమలాపురం ఎంపీ సీటుకు వైసీపీ నుంచి పోటీకి దిగి ఓడిపోయిన ఆయన తిరిగి పాయకరావుపేట నుంచే తన గెలుపు వ్యూహాలను రచించుకుంటున్నారు. ఆయనే గొల్ల బాబూరావు. మాజీ అధికారి మాత్రమే కాదు, వైఎస్ కి ఇష్టుడైన నాయకుడు.

అలా రాజకీయాల్లోకి…..

ఆయన ప్రభుత్వ అధికారిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చేశారు. 2009 ఎన్నికల్లో నాటి సీఎం వైఎస్సార్ ఆయన్ని తీసుకుని కాంగ్రెస్ తరఫున పాయకరావుపేట నుంచి పోటీ చేయించారు. మంచి మెజారిటీతో ఆయన గెలిచి వైఎస్ నమ్మకాన్ని నిలబెట్టారు. ఆ తరువాత వైఎస్ చనిపోవడంతో ఆయన జగన్ వైపు చేరిపోయారు. జగన్ తరఫున నిలబడి కిరణ్ సర్కార్ కి వ్యతిరేకంగా ఓటు వేసి ఎమ్మెల్యే పదవి కోల్పోయిన బాబూరావు తరువాత వచ్చిన ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు.

టికెట్ డౌటట……

గత నాలుగున్నరేళ్ళుగా బాబూరావు పాయకరావుపేటను వేదికగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఆయన తనకు టికెట్ ష్యూర్, గెలుపు అంత కంటే ష్యూర్ అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య మారిన రాజకీయ సమీకరణల్లో ఆయనకు టికెట్ ఇవ్వరంటూ ప్రచారం సాగుతోంది. బాబురావు మంచి క్యాండిడేట్ కానీ, ఆర్ధికంగా బలవంతుడు కాకపోవడాన్ని సాకుగా చూపించి పక్కన పెట్టేస్తున్నారుట. దాంతో షాక్ తినడం ఈ మాజీ ఎమ్మెల్యే వంతు అవుతోంది.

బడా బాబులకేనా……

పాయకరావుపేట సీటుని ఆర్థికంగా బలంగా ఉన్న వారికే ఇవ్వాలని వైసీపీ డిసైడ్ అయినట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. రేసులో ఓ ప్రభుత్వ డాక్టర్ తో పాటు, మరి కొంతమంది కూడా ఉన్నారని అంటున్నారు. అదే జరిగితే వారు గెలుస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బాబూరావు సైతం కొత్త వారికి టికెట్ ఇస్తే సహకరిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక పాయకరావుపేటలో వైసీపీకి సానుకూల వాతావరణం ఉంది. మరి దాన్ని సొమ్ము చేసుకోవాలంటే బాబురావు మాత్రమే ధీటైన క్యాండిడేట్. ఆయనకే టికెట్ ఇచ్చి ఆర్ధిక సాయం ఇస్తే ఈ సీటు గ్యారంటీ అని గట్టిగా వినిపిస్తోంది. మరి హై కమాండ్ ఎలా నిర్ణయిస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*