జగన్ అలాంటి నిర్ణయం ఎందుకంటే….?

వైసీపీ అధినేత జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసేంత వరకూ పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో డిసెంబరు 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 11వ తేదీన కౌంటింగ్ ను నిర్వహిస్తారు. అప్పటి వరకూ పాదయాత్రలోనే ఉండాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన రూట్ మ్యాప్ లో కూడా కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఏడాది పూర్తవుతున్నా……

జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర పేరుతో గత ఏడాది నవంబరు 6వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికి 11 నెలలు పూర్తయింది. ముందుగా అనుకున్న ప్రకారం యాత్రను నవంబరు 5వ తేదీకి ముగించాలి. దీనివల్ల ఏడాది పాటు ప్రజల్లో ఉన్నట్లు ఉంటుందని యాత్రను అలా ప్లాన్ చేశారు. అయితే యాత్రకు ప్రతి జిల్లాలో అపూర్వ స్పందన లభిస్తోంది. మరోవైపు పండగలు, తుఫాను ల వంటి సమయంలో యాత్రకు విరామమివ్వాల్సి వచ్చింది.

తెలంగాణ ఎన్నికలు…..

అంతేకాకుండా మరోవైపు తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని జగన్ భావిస్తున్నారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే దృష్టి పెట్టనున్నారు. తెలంగాణ ఎన్నికలలో జోక్యం చేసుకోవడం అనవసరమని ఆయన భావిస్తున్నారు. పాదయాత్రను ముందుగానే ముగిస్తే తెలంగాణ ఎన్నికల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే యాత్రను పొడిగించాలన్న నిర్ణయానికి జగన్ వచ్చారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పాదయాత్ర అనంతరం……

ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప పాదయత్ర విజయనగరం జిల్లాలో జరుగుతోంది. తొలుత రూపొందించిన రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా యాత్రను రూపొందించాలని నిర్వాహకులను జగన్ ఆదేశించినట్లు సమాచారం. విజయనగరం జిల్లా తర్వాత శ్రీకాకుళం జిల్లా ఒక్కటే మిగిలింది. ఈ పాదయాత్ర ముగిసిన వెంటనే కొంత విశ్రాంతి తీసుకుని సంక్రాంత్రి పండగ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి బస్సు యాత్రను ప్రారంభించడానికి వైసీపీ కార్యాచరణను రూపొందించింది. ఎన్నికలు జరిగే వరకూ జనంలోనే ఉండాలన్నది జగన్ ఉద్దేశ్యంగా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*