అప్పటి అభ్యర్థులేరి జగన్…?

పార్లమెంటు స్థానాల్లో వైసీపీకి అభ్యర్థుల కొరత పట్టిపీడిస్తోంది. కొన్ని స్థానాల్లో బాగానే ఉంద‌నుకోవ‌డానికీ లేదు ఎందుకంటే అక్క‌డ ఆధిపత్య పోరు అధికంగా ఉంది. మ‌రికొన్ని స్థానాల్లో ఇందుకు ఆస్కార‌మే లేదు.. ఎందుకంటే అభ్య‌ర్థులే క‌రువ‌య్యారు కాబ‌ట్టి..! ప్ర‌స్తుతం రాజ‌ధాని ప్రాంతంలో వైసీపీ ప‌రిస్థితి చిత్ర‌విచిత్రంగా క‌నిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌లుగా ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో పార్టీ నేత‌ల్లో కొంత జోష్ క‌నిపించినా.. అది ఆ జిల్లాలు దాట‌గానే క‌నుమ‌రుగైంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల కోసం అభ్య‌ర్థుల వేట మొద‌లుపెట్టిన జ‌గ‌న్‌కు ఎదురుదెబ్బ‌లు త‌గులుతూనే ఉన్నాయి‌.

అభ్యర్థులను ఫైనలైజ్ చేసే పనిలో…..

2019 ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ పావులు క‌దుపుతున్నారు. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న త‌రుణంలో అభ్య‌ర్థుల‌ను ఫైన‌లైజ్ చేసే ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే కొన్ని జిల్లాల్లో అభ్య‌ర్థుల‌పై ఒక స్ప‌ష్ట‌త రాగా.. మ‌రికొన్ని జిల్లాల్లో మాత్రం ఎంత‌కీ క్లారిటీ రావ‌డం లేద‌ట‌. ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంత‌మైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ త‌ర‌ఫున పోటీచేసేందుకు అభ్య‌ర్థులే క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. అసెంబ్లీకి పోటీ చేయడానికి కొన్ని చోట్ల అభ్యర్థులు ముందుకు వస్తున్నా పార్లమెంట్‌కు పోటీ చేయడానికి మాత్రం అభ్యర్థులు లేర‌ట. గుంటూరు, కృష్ణాలో మొత్తం ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఒక్క స్థానం నుంచైనా ఫలానా వారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించే పరిస్థితి కనిపించడం లేద‌ట‌.

గత ఎన్నికల్లో ఈ ఐదింటిలో….

గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఐదు స్థానాల్లోనూ వైసీపీ ఓడిపోయింది. ఎన్నికలకు ముందు అన్ని స్థానాలను తామే గెలుస్తామని అతివిశ్వాసానికి పోయిన అధిష్టానం.. చివరకు ఫలితాలు చూసి ఖంగుతింది. దీంతో ఈసారైనా సరైన, గట్టి అభ్యర్థులను పోటీకి దించాలని భావిస్తోంది. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల నియోజకవర్గాల నుంచి వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, వరికూటి అమృతపాణి, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం నుంచి కొలుసు పార్థసారధి, విజయవాడ నుంచి కోనేరు రాజేంద్రప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఈ ఐదుగురిలో మచిలీపట్నం నుంచి పోటీ చేసిన పార్థసారధి మిన‌హా మిగిలిన వారెవ‌రూ ఇప్పుడు పార్టీ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా లేరు. దీంతో మ‌ళ్లీ వీరు పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు.

అందరూ కొత్తవారినే…..

ఈ నేపథ్యంలో ఐదుగురు కొత్త వారిని ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్క‌డ టీడీపీకి సంస్థాగ‌తంగా ప‌ట్టు ఉంది. అందులోనూ బ‌ల‌మైన అభ్యర్థులు కూడా ఉన్నారు. వారికి సమ ఉజ్జీలుగా పేరొందిన వారు వైసీపీలో లేరు. ఈ స‌మ‌యంలో కొత్త‌వారిని రంగంలోకి దించాలంటే అది అనేక స‌వాళ్ల‌తో కూడుకున్న ప‌ని. దీంతో మాజీ కాంగ్రెస్‌ నేతలు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న నేతలను పోటీ చేయాల‌ని వైసీపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాయబారాలు నడుపుతున్నారట‌. విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నంకు కూడా కొత్త అభ్య‌ర్థుల‌ను వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి. పార్థ‌సార‌థి తాను పెన‌మ‌లూరు నుంచి అసెంబ్లీకే పోటీ చేస్తాన‌ని… లేనిప‌క్షంలో తాను ఎంపీగా పోటీ చేసే ప్ర‌శ‌క్తే లేద‌ని జ‌గ‌న్‌కు ఇప్ప‌టికే చెప్పేశార‌ట‌. ఇది జ‌గ‌న్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది.

కొత్త అభ్యర్థుల కోసం….

ఇక గుంటూరు జిల్లాలో గుంటూరు నుంచి మాత్రం విజ్ఞాన్ సంస్థ‌ల అధినేత లావు ర‌త్త‌య్య త‌న‌యుడు శ్రీకృష్ణ దేవ‌రాయులు మాత్రం కాస్త యాక్టివ్‌గా తిరుగుతున్నాడు. అయితే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో కొన్ని చోట్ల పార్టీ బ‌ల‌హీనంగా ఉండ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌గా ఉంది. బాప‌ట్ల‌లోనూ కొత్త అభ్య‌ర్థి కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. నర్సరావుపేటలోనూ ఇదే పరిస్థితి. మ‌రి ఆ స్థానంలో ఎవ‌రిని భ‌ర్తీ చేస్తారో వేచిచూడాల్సిందే!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*