వైసీపీ అభ్యర్ధిగా ఓ డాక్టర్….విక్టరీ ష్యూర్ అట….!!!

వైసీపీకి విశాఖ జిల్లా పాయకరావుపేటలో మంచి పట్టు ఉంది. 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆ పర్టీ తరఫున గొల్ల బాబూరావు బంపర్ మెజారిటీతో గెలిచారు. 2014లో తిరిగి ఆయనకే టికెట్ ఇస్తే గెలిచేవారు కానీ అమలాపురం ఎంపీగా పంపడంతో అక్కడా, ఇక్కడా కూడా వైసీపీ పరాజయం పాలు అయింది. ఇపుడు మళ్ళీ పాయకరావుపేటను కేంద్రంగా చేసుకుని బాబూరావు పార్టీ కోసం పనిచేస్తున్నారు.

రంగంలోకి డాక్టర్…..

అయితే బాబూరావుకి ఈసారి టికెట్ రాకపోవచ్చునని ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో ఆర్ధికంగా మంచి స్తోమత కలిగిన విశాఖ కేజీహెచ్ డాక్టర్ ఒకరిని బరిలోకి దింపాలని వైసీపీ ఆలొచిస్తోందని అంటున్నారు. కేజీహెచ్ లో ఆర్ ఎం ఓ గా ఉన్న డాక్టర్ బంగారయ్య పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన సరైన అభ్యర్ధి అవుతారని జగన్ కూడా భావిస్తున్నరట. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిత పట్ల ప్రజావ్యతిరేకత ఉండడంతో ఆమెను ఓడించే ధీటైన అభ్యర్ధిగా బంగారయ్య రేసులో ఉన్నారని ప్రచారం సాగుతోంది.

ఉచిత వైద్య సేవలు…..

కాగా రాజకీయాలపై బయటకు చెప్పకపోయినా బంగారయ్య గ్రౌండ్ వర్క్ బాగానే చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన పాయకరావుపేటలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడమే కాకుండా, పేదలకు బాగా సన్నిహితం అవుతున్నారు. అలాగే అన్ని వర్గాలతో సంబంధాలను బాగా పెంచుకుంటున్నారు. రాజకీయాల్లోకి వస్తే వైసీపీ నుంచే ఆయన బరిలో ఉంటారని సన్నిహితులు కూడా చెబుతున్నారు.

విజయమేనా….

బంగారయ్య రాజకీయాలోకి వస్తే విజయం సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. డాక్టర్ గా సుపరిచితుడైన ఆయనకు అట్టడుగు వర్గాలలో కూడా మంచి పేరుంది. ఆయన తన వైద్య సేవల పరంగా కూడా జనంలోకి బాగానే వస్తున్నారు. అయితే వైసీపీలో ముందు నుంచి ఉన్న నాయకులు, ముఖ్యంగా బాబూరావు వర్గం ఎంత మేరకు సహకరిస్తారన్నది కూడా ఇక్కడ చూడాల్సి ఉంది. జగన్ టికెట్ ఇచ్చేసి ఊరుకోకుండా పార్టీని సైతం సమన్వయం చేసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*