దెబ్బతిన్న పులిలా…జగన్..ఎప్పుడు….?

వైసీపీ అధినేత జగన్ ఎందుకు మౌనంగా ఉన్నట్లు…? దెబ్బతిన్న పులిలా రెచ్చిపోవడం లేదు ఎందుకు? ఇదీ వైసీపీ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఈ నెల 25వ తేదీన విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే యువకుడు దాడికి తెగబడ్డాడు. కోడి పందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేయడంతో జగన్ కు భుజంపై గాయమయింది. క్షణాల్లో తప్పుకోవడం వల్లనే జగన్ కు ప్రమాదం తప్పిందని, లేకుంటే మెడపైన కత్తి దిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఘటన జరిగిన వెంటనే ఎయిర్ పోర్టులోనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న జగన్ వెంటనే హైదరాబాద్ బయలు దేరి వచ్చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి లో జగన్ చేరారు. ఇవన్నీ జరిగిపోయిన విషయాలే. అందరికీ తెలిసినవే.

ఆరురోజులవుతున్నా…..

కాకుంటే సంఘటన జరిగి ఆరురోజులు గడుస్తున్నా జగన్ సంఘటనపై పెదవి విప్పడం లేదు. గత శనివారం పరీక్షించిన వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. భుజంపై తొమ్మిది కుట్లు పడటంతో పాదయాత్రలో పాల్గొంటే ఇన్ ఫెక్షన్ సోకుతుందన్న వైద్యుల సూచన మేరకు జగన్ తన పాదయాత్రకు విరామం ఇచ్చారు. అయితే సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర డీజీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులతో సహా అందరూ స్పందించారు. ఇది జగన్ అభిమాన దాడి మాత్రమేననితేల్చారు. సానుభూతి కోసం చేశాడని, తమ వద్ద ప్రాధమిక ఆధారాలున్నాయని తెలిపారు.

రాజకీయ దాడులు…..

జగన్ పై దాడి నుంచి తేరుకోని వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ నేతలు, డీజీపీ వ్యాఖ్యలు మంటపుట్టించాయి. దీంతో వారు ఎదురుదాడికి దిగడం స్టార్ట్ చేశారు. జగన్ పై దాడి వెనక కుట్ర ఉందన్నారు. అంతేకాదు ఏ1 ముద్దాయి చంద్రబాబు, ఏ2 ముద్దాయి డీజీపీ అంటూ ఆరోపించారు. ఏపీ పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ ఘటనపై విచారణ చేయించాలని వైసీపీ నేత వైవీసుబ్బారెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో బృందం ఢిల్లీకి వెళ్లి థర్డ్ పార్టీతో విచారణ జరపాలని కోరింది. ఇక తెలుగుదేశం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ మంత్రులు జగన్ తీరును తప్పుపడుతూనే ఉన్నారు.

సన్ డే బహిరంగ సభలో……

అయితే జగన్ మౌనానికి కారణం ఆయన ప్రస్తుతం విశ్రాంతిలో ఉండటమే కారణమంటున్నారు. ఈనెల 3వ తేదీ శనివారం నాడు తిరిగి విజయనగరం జల్లా సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆదివారం విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభలోనే జగన్ ఈ ఘటనపై స్పందిస్తారని వైసీపీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. జగన్ మౌనంగా ఉండటమే మంచిదని వైసీపీ నేతలూ భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ప్రజలు చీదరించుకుంటున్నారని, ఒకరకంగా జగన్ కు వారే సానుభూతి తెప్పించి పెడుతున్నారని ఓ వైసీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. జగన్ రానున్న ఆదివారం జరిగే బహిరంగసభలో జరిగిన సంఘటన, అనంతరం జరిగిన పరిణామాలపై స్పందిస్తారని ఓ ముఖ్యనేత ‘‘తెలుగు పోస్ట్ ’’ కు చెప్పారు. మరి జగన్ ఆరోజు ఏం మాట్లాడతారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొని ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*