ఆ వైసీపీ సిట్టింగ్‌ కు సీటు టెన్షన్‌ పట్టుకుందా..!

ఏపీలో వైసీపీలో సీట్ల కేటాయింపుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ? కూడా ఎవరూ ఊహించలేకపోతున్నారు. నియోజకవర్గాల్లో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉండి ఎంతో బలమైన నేతలుగా ఉన్న వారిని సైతం జగన్‌ అనూహ్యంగా మార్చేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చూసుకుంటే ఈ లెక్క చాలానే ఉంది. ఒక్క గుంటూరు జిల్లాలోనే జగన్‌ నాలుగైదు సీట్ల ఎంపికలో బలమైన అభ్యర్థులుగా ప్రజలందరూ భావిస్తున్న వారిని సైతం పక్కన పెట్టేయడం సామాన్య జనాలకు సైతం మింగుడుపడలేదు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌, గుంటూరు వెస్ట్‌లో లేళ్ల అప్పిరెడ్డితో పాటు తాడికొండలో నాలుగు సంవత్సరాలుగా పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న హెన్రీ క్రీస్టియానా లాంటి వాళ్లను జగన్‌ చాలా సులువుగా తప్పించేశారు.

స్వయంగా తప్పుకోవాలని…..

తాజా సమాచారం ప్రకారం వైసీపీలో నియోజకవర్గ ఇన్‌చార్జులు, సీనియర్లకే కాకుండా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సైతం సీట్ల కేటాయింపులో షాకులు తప్పవని వైసీపీ వర్గాల నుంచే లీకులు వస్తున్నాయి. ఈ లిస్ట్‌లో రకరకాల ఈక్వేషన్లు పరిశీలించి జగన్‌ కొంత మంది సిట్టింగులను తప్పిస్తారని తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో ఒక గుంటూరు జిల్లా నుంచే ఏకంగా ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను తప్పిస్తారన్న చర్చలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ ముస్తాఫా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు వచ్చే ఎన్నికల్లో సీటుపై తఖ‌రారు నెలకొన్నట్టే తెలుస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో తాను సైతం స్వయంగా పోటీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచన కూడా ఆర్‌కే చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆర్థికపరమైన కారణాలతో…..

ఇక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ ముస్తాఫా నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్నా, కేడర్‌లో ఆయనకు పట్టున్నా… ఆర్థిక కారణాల నేపథ్యంలో ఆయన పరిస్థితి ఏంటన్న దానిపై పార్టీ అంతర్గత వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరి ఎమ్మెల్యేల సంగతి ఇలా ఉంటే పల్నాడు కేంద్రమైన నరసారావుపేట వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ వస్తుందా ? వ్యక్తిగతంగా సౌమ్యుడుగా పేరున్న, కేడర్‌లో పట్టున్న ఆయనకు ఎందుకు సీటు రాదన్న దానిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. గత ఎన్నికల్లో నరసారావుపేట నుంచి 16 వేల ఓట్ల తేడాతో విజయం సాధించిన గోపిరెడ్డికి వ్యక్తిగతంగా మంచి పేరే ఉన్నా… పేట‌లో వైసీపీ బలంగా ఉన్న రొంపిచ‌ర్ల మండలంలోని రెడ్డి సామాజికవర్గం నేతలు ఆయన తీరుపై అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఇటీవల సొంత పార్టీకి చెందిన బీసీ సేతలు సైతం ఆయనపై విమర్శలు చేస్తున్నారు.

వైసీపీలోని కొందరు నేతలు…..

అయితే దీని వెనుక వైసీపీలోనే కొందరు కీలక నేతల హత్తం ఉన్నట్టు కూడా నరసారావుపేట రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. నరసారావుపేటకే చెందిన మాజీ మంత్రి కాపు వెంకట కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్‌ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నరసారావుపేట నుంచి పోటీ చెయ్యాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన గతంలో వైసీపీలోకి వచ్చేట‌ప్పుడు నరసారావుపేట సీటు కోరుకోగా జగన్‌ ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉన్నందున‌ కాసు మహేష్‌ని గురజాల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. రెండేళ్లుగా కాసు మహేష్‌ రెడ్డి గురజాల నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా ఉన్నా ఆయన మనసంతా నరసారావుపేట చుట్టూనే తిరుగుతుందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇప్పటికి గురజాల నియోజకవర్గలోని నాలుగు మండలాల్ల ప్రజల్లోకి ఆయన ఆంత బలంగా చొచ్చుకుపోలేదన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి.

కాసుకు నాన్ లోకల్ కావడంతో…..

దీనికి తోడు గురజాలలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చాలా బలంగా ఉన్నారు.అది కాసు కుటుంబానికి నాన్‌ లోకల్‌ నియోజకవర్గం. అంతే కాకుండా గతంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మహేష్‌ రెడ్డి తాతా, మాజీ ముఖ్య మంత్రి కాసు బ్రహ్మానందం రెడ్డి, మహేష్‌రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. ఈ సెంటిమెంట్‌ నేపథ్యంలో కూడా మహేష్‌ రెడ్డి అక్కడ పోటీ చేసేందుకు అంత ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. నరసారావుపేటలో కాసు కుటుంబానికి సుదీర్ఘ‌మైన రాజకీయ చరిత్ర ఉంది. అంతే కాకుండా ఇక్కడ ఆ ఫ్యామిలీకి సొంత ఓటు బ్యాంకు కూడా ఉంది. ఈ క్రమంలోనే మహేష్‌ రెడ్డి నరసారావుపేట నుంచి పోటీ చేస్తే తానే చెయ్యాలని… తమ అడ్డాలో వేరే వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని పదే పదే అక్కడ తమ అనుచర గణంతో వ్యాఖ్యానిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

గోపిరెడ్డిపై మాటలదాడి…

ఈ క్రమంలోనే ఇప్పుడు ఇక్కడ సిట్టింగ్‌ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై వ్యూహాత్మకంగా కావాలని మాటల దాడి జరుగుతుందా ? అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాసు మహేష్‌ రెడ్డిని ఇక్కడ నుంచి పోటీ చేయించే కోణంలో శ్రీనివాసరెడ్డి టార్గెట్‌ చేసేలా వైసీపీలోనే కొందరు జిల్లా స్థాయి నాయకులు సైతం ఈ ప్లాన్‌ చేశారా అన్న చర్చలు కూడా నరసారావుపేటలో వినిపిస్తున్నాయి. ఏదేమైనాన ప్రస్తుతం నరసారావుపేట వైసీపీ రాజకీయం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్సెస్‌ కాసు మహేష్‌ రెడ్డి మధ్య‌ హాట్‌ హాట్‌గానే ఉంది. ఇది ఎన్నికల వేళ పేట‌లో ఈ వార్ వైసీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*