ప్రశ్నలు…సందేహాలు.. పటాపంచలు చేస్తారా??

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నేటికి 298వ రోజుకు చేరుకుంది. ఆయన విశాఖపట్నంలో హత్యాయత్నం జరిగిన తర్వాత 18 రోజులు విశ్రాంతి తీసుకుని ఈ నెల 12వ తేదీ నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ జగన్ తనపై జరిగిన హత్యాయత్నం గురించి ఎక్కడా మాట్లాడలేదు. హైకోర్టులో పిటీషన్, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లకు రాసిన లేఖ ద్వారానే ఆయన అభిప్రాయం తెలిసింది. అంతేతప్ప బహిరంగంగా ఆయన ఎక్కడా తనపై జరిగిన హత్యాయత్నం, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై స్పందించలేదు. జగన్ స్పందన కోసం ఇటు పార్టీ నేతలతో పాటు అటు అధికార పక్షం నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పార్వతీపురం సభలో…..

అయితే ఈరోజు ప్రజాసంకల్ప పాదయాత్ర పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. ఈ సభలోనే తనపై జరిగిన దాడి, తర్వాత జరిగిన ఘటనలపై జగన్ స్పందిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కోడికత్తితో దాడి అని, అది డ్రామా అంటూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బలంగాప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ కూడా వైసీపీ వీరాభిమాని అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పి ఈ ఘటన తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. డీజీపీ కూడా ఒక చేయివేశారు. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. స్వతంత్ర దర్యప్తు సంస్థ విచారణ చేయాలని ఆయన కోరుతున్నారు.

వారిద్దరే టార్గెట్ గా…..

ఈనేపథ్యంలో చంద్రబాబు, డీజీపీ పైనా జగన్ ఫైర్ అయ్యే అవకాశముంది. ప్రజల ఎదుటే తన మనసులో మాట చెప్పాలనుకుంటున్నారు జగన్. జరిగిన ఘటనతో పాటు దాని వెనక ఎవరు ఉన్నారన్న విషయాన్ని కూడా సభలో జగన్ వివరించనున్నారు. తనపై దాడికి దిగిన శ్రీనివాస్ ఎవరి ప్రోద్బలంతో ఈ చర్యకు పాల్పడ్డారో జగన్ పూర్తిగా ప్రజలకు చెప్పనున్నారని వైసీపీ కీలక నేత ఒకరు చెప్పారు. ఇప్పటికే దాడిలో గాయపడిన జగన్ ను చూసేందుకు ఇతర జిల్లాల నుంచి కూడా పాదయాత్ర వద్దకు చేరుకుంటున్నారు. పార్టీ శ్రేణులతో పాటు జగన్ అభిమానులు ఎక్కువగా తరలి వస్తుండటంతో పోలీసులకు భద్రత కల్పించడం కూడా కష్టంగా మారింది.

భద్రత మధ్య….

జగన్ పై దాడి జరిగిన తర్వాత పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జగన్ తో పాదయాత్ర చేస్తున్న వారికి బ్లూరంగు ప్రత్యేక గుర్తింపు కార్డులను పోలీసు శాఖ జారీ చేసింది. అలాగే జగన్ తో కలసి మాట్లాడాలంటే ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలి. నేరుగా జగన్ వద్దకు వెళ్లే ఛాన్స్ లేదు. తొలి అంచెలో జగన్ సొంత ప్రయివేటు సెక్యూరిటీ ఉంటుంది. రెండో అంచెలో ఏపీ పోలీసులుంటారు. మూడో అంచెలో రోప్ పార్టీ ఉంటుంది. ఇక జగన్ రాత్రి పూట బస చేసే శిబిరం వద్దకూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరి జగన్ ఈరోజైనా తన పై జరిగిన దాడి, తర్వాత జరిగిన పరిణామాలపై స్పందిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*