వైసీపీలో పంచపాండవులు…ఎవరంటే…?

ఏపీలో విపక్ష వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా జిల్లాల్లో కీలక నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. ఇప్పటికే విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడున్న లెక్కలు, అంచనాల ప్రకారం చూస్తేనే 40కి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థుల కోసం సర్వేలు నిర్వహిస్తున్నారు.. దీంతో జగన్‌ ఇప్పుడున్న నియోజకవర్గాల ఇన్‌చార్జులను మార్చేస్తున్నారు.

ఉన్న పేర్లకు తోడు……

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ టిక్కెట్‌ కోసం ఇప్పటికే ఉన్న పేర్లకు తోడు మరో కొత్త అభ్యర్థి పేరు తెర మీదకు వచ్చింది. గిద్దలూరు వైసీపీ సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే తనకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీటు వస్తుందని తాను పోటీ చేసి తీరుతానని ప్రకటన చెయ్యడంతో గిద్దలూరు వైసీపీలో పెద్ద గందరగోళం నెలకొంది. ప్రస్తుతం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఎన్నారై ఐవీ. రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి పార్టీ మారడంతో జగన్‌ ఆ తర్వాత ఐవీ. రెడ్డికి ఇన్‌చార్జ్‌గా బాధ్యాతలు అప్పగించారు. ఐవీ. రెడ్డి టిక్కెట్‌ రేసులో ఉన్నా ఆయనకు టిక్కెట్‌ వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఐవీ.రెడ్డి సంగతి ఇలా ఉంటే ఒంగోలు ఎంపీ వైవీ. సుబ్బారెడ్డి మాజీ ఎమ్మెల్యే పిడతల సాయి కల్పన రెడ్డిని కొద్ది రోజులుగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు.

సాయి కల్పన కూడా…

కొద్ది రోజుల క్రితం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవ్వాలని ఆయన చేసిన పాదయాత్రలో సైతం సాయి కల్పన హడావిడి చేశారు. వీరిద్దరి సంగతి ఇలా ఉంటే 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచి.. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అన్నా రాంబాబు సైతం తాను వైసీపీ సీటు రేసులో ఉన్నానని చెబుతున్నారు. గిద్దలూరులో వైసీపీ సీటు కోసం ట్రైయాంగిల్‌ ఫైట్‌ జరుగుతుండగానే మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం గిద్దలూరులో పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం అయిన ఒంగోలులో తనకు అంత సానుకూల పరిస్థితులు లేకపోవడంతో కొద్ది రోజులుగా ఆయన పశ్చిమ ప్రకాశంలో గిద్దలూరు లేదా మార్కాపురం నియోజకవర్గాలకు మారతారన్న ప్రచారం జరుగుతుంది.

బాలినేని అయితే….

ఈ క్రమంలోనే బాలినేని పేరు గిద్దలూరు నుంచి వినిపిస్తోంది. గిద్దలూరులో ఐవీ. రెడ్డి, పిడతల సాయి కల్పనరెడ్డి, అన్నా రాంబాబుతో పోలిస్తే బాలినేని బలమైన అభ్యర్థి అవుతారని ఆయన అనుచర గణం పేర్కొంటోంది. అయితే బాలినేని కోరిక ఎలా ఉన్నా జగన్‌ ఆయన్ను ఒంగోలు నుంచి తప్పించేందుకు అంత సుముఖంగా లేరని టాక్‌. ఈ పేర్లు ఇలా ఉండగానే ఇప్పుడు గిద్దలూరు వైసీపీ సీటు కోసం పంచ పాండవుల్లాగా మాజీ ఎమ్మెల్యే యాళ్ళూరి వెంకటరెడ్డి తెర మీదకు వచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ టిక్కెట్‌ తనకే వస్తుందని తాను ఇక్కడ నుంచి పోటీ చేసి తీరుతానని ఆయన విలేకర్ల సమావేశం పెట్టిమరీ ప్రకటించారు. తాను మొదట నుంచి వైఎస్‌ అనుచరుడిగా ఉండేవాడినని ఆయన మృతి తర్వాత తనకు అన్యాయం జరిగిందని వాపోయారు.

అసలు సీటు ఎవరికి…?

నియోజకవర్గంలో పార్టీ నియమించిన ఇన్‌చార్జ్‌ ఐవీ. రెడ్డితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని వెంకట రెడ్డి చెప్పడం కొస‌మెరుపు. నియోజకవర్గంలో పాత గ్రూపు, కొత్త గ్రూపులని కలుపుకుని ముందుకు వెళ్తానని ఆయన ప్రకటించుకున్నారు. వెంకటరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య తనయుడు శ్రీరంగం కూడా ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం. ఏదేమైనా గిద్దలూరు వైసీపీలో ఇప్పటికే ఉన్న ముగ్గురు నాయకులకు తోడు తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు యాళ్ళూరి వెంకటరెడ్డి పేరు సైతం చర్చకు వస్తుండడంతో అసలు గిద్దలూరు సీటు ఎవరికి దక్కుతుందో కూడా తెలియక వైసీపీ శ్రేణులు తీవ్ర గందరగోళంలో పడ్డాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*