జగన్ వారిని టెన్షన్ పెడుతున్నారే…!!!

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో వేగం పెంచారు. ఈసారి సర్వేలోతో పాటు కొన్ని కీలక అంశాలపై జగన్ దృష్టి పెట్టనున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ పాదయాత్రతో ఇప్పటికే ప్రజలకు చేరువయ్యారు. దాదాపు ఏడాదిపైగానే 13 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని మలివిడత బస్సుయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బస్సుయాత్ర కు బయలుదేరే ముందే అభ్యర్థుల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని జగన్ సీరియస్ గా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు రెండు ప్రయివేటు సంస్థలకు సర్వే బాధ్యతలను అప్పగించారు.

సర్వే నివేదికలు అందిన తర్వాత….

ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లతో ఈ సర్వేను నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. జనవరి రెండో వారానికి సర్వేలు పూర్తి చేసి తనకు అందాలని ఆ సంస్థలకు జగన్ ఇప్పటికే ఆదేశించినట్లు చెబుతున్నారు. సామాజిక వర్గాలు, ఆర్థికబలంతో పాటు ప్రత్యర్థి గెలుపు అంచనాలను కూడా ఈ సర్వేలో తేల్చనున్నారు. ఏపీలో ఇప్పటికే జగన్ 126 నియోజకవర్గాల్లో పర్యటించారు. మిగిలిన నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేయనున్నారు. ఈ 126 నియోజకవర్గాల్లో జగన్ అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

కాపు సామాజిక వర్గం….

దీంతోపాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారి పేర్లలో కొన్నింటిని పక్కనపెట్టారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో మూడు నుంచి ఐదువేలు పైగా ఓట్లతో ఓడిపోయిన వారికి ఈసారి సీట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే ఇందులో కొందరికి మినహాయింపు ఉంటుంది. ఆ నియోజకవర్గంలో సామాజిక వర్గాల ఓటు బ్యాంకును చూసి జగన్ నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలసి పోటీ చేశాయి. ప్రధానంగా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉన్న చోట్ల గత ఎన్నికల్లో ఫలితాలను పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయించారు. ఈసారి జనసేన పోటీలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఐదువేల ఓట్ల కన్నా ఎక్కువ…..

అలాగే మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం ఐదువేల ఓట్లు మెజారిటీతో ఓడిపోయిన వారికి ఈసారి టిక్కెట్లు ఇచ్చేది లేదని చెప్పనున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అదే ప్రాతిపదికన కొన్ని నియోకవర్గాల్లో ఇన్ ఛార్జిలను కూడా మార్చినట్లు తెలుస్తోంది. ఇలా సీట్లు కోల్పోయే వారిలో వైసీపీలో క్రియాశీలకంగా ఉన్న నేతలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వారికి సర్దిచెప్పి కొత్త వారికి అవకాశమివ్వాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇస్తామని వారితో జగన్ ప్రత్యేకంగా భేటీ అయి చెప్పనున్నారని వైసీపీ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం మీద వైఎస్ జగన్ ఇటు సర్వేలతో పాటు గత ఎన్నికల ఫలితాల గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని తెలియడంతో కొందరు నేతల్లో టెన్షన్ మొదలయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*