గ్రిప్ వదులుకుంటే ఎలా…?

వైసీపీకి పట్టున్న ఆ జిల్లాలో వైసీపీ అధినేత జగన్ ఆ నాలుగు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిసింది. పాదయాత్రలో ఉన్నప్పటికీ తన శిబిరం వద్దకు జిల్లా నేతలను పిలిపించుకుని ఆ నియోజకవర్గాలపై చర్చించారు. ప్రకాశం జిల్లా అంటే వైసీపీకి గ్రిప్ ఉన్న జిల్లా. గతఎన్నికల్లో అధికస్థానాల్లో విజయం సాధించినా నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు లోనై నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని మారిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లోనూ ప్రకాశం జిల్లాలో తన పట్టును నిలుపుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు.

నాలుగు నియోజకవర్గాల్లో….

అందులో భాగంగా ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులురెడ్డి జగన్ ప్రత్యేకంగా సమావేశమయినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించి వివిధ నియోజకవర్గాల సమీక్ష జరిపిన సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించే దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కొంత సక్సెస్ కాగలిగారు. జగన్ కు రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొంత ఎడ్జ్ కనపడుతోంది. దీంతో చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి నేతల మధ్య ఐక్యత నెలకొనేందుకు, అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.

కొండపిపైనా…..

కాని జగన్ మాత్రం నాలుగు నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సంతనూతలపాడు, మార్కాపురం, కొండపి, యర్రగొండపాలెం నియోజకవర్గాలను ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో మార్కాపురం, యర్రగొండపాలెం, సంతనూతలపాడు నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. కొండపి మాత్రం టీడీపీ ఖాతాలో పడింది. అక్కడి నుంచి వైసీపీ తరుపున పోటీ చేసిన జూపూడి ప్రభాకర్ తర్వాత టీడీపీలో చేరిపోయారు. గెలిచిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు టీడీపీలో జంప్ చేశారు.

ఆమంచి కలిసి రాకుంటే…..

అయితే జగన్ కు వచ్చిన సర్వే నివేదికల ప్రకారం ఈసారి యర్రగొండపాలెం ఖచ్చితంగా మళ్లీ వైసీపీ ఖాతాలోనే పడుతుంది. జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులురెడ్డి కూడా అదే విషయాన్ని జగన్ తో చెప్పారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ను యర్రగొండపాలెం నుంచి ఈసారి పోటీ చేయించాలని నిర్ణయించారు. అందుకే అక్కడ ఇన్ ఛార్జిగా నియమించారు. సంతనూతలపాడు టీడీపీలో వర్గ విభేదాలు విపరీతంగా ఉండటంతో వాటిని తమకు అనుకూలంగా మలచుకోవాలని జగన్ పార్టీ భావిస్తోంది. అలాగే కొండపిలో కూడా టీడీపీలో లుకలుకలు ఎక్కువగానే ఉన్నాయి. దీన్ని క్యాష్ చేసుకోవాలని వైసీపీ భావిస్తుంది. అలాగే చీరాలలోనూ ఆమంచిని మంచి చేసుకోవాలని బాలినేనికి జగన్ సూచించినట్లు తెలుస్తోంది. ఆమంచి అంగీకరించకుంటే ప్రత్యామ్నాయ నేత పేరును సూచించాలని జగన్ చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో పట్టును కోల్పోకుండా వచ్చే ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగురేయాలని జగన్ ఆ పార్టీ నేతలను అప్రమత్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*