అంతా అనుకూలిస్తే…జైత్రయాత్రే…!

ప్ర‌కాశం జిల్లాలో రాజ‌కీయాలు ఆస‌క్తిని రేపుతున్నాయి. సీట్ల కేటాయింపులో పార్టీలు క‌స‌ర‌త్తు మొద‌లు పెట్టాయి.. ఇదే స‌మ‌యంలో టికెట్లు ఎలాగైనా సాధించాల‌ని ప‌లువురు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ప‌లువురు నేత‌లు మాత్రం త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం పార్టీలు మారుతున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి మహీధర్ రెడ్డి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా ప‌నిచేసిన‌ మహీధర్ రెడ్డికి కందుకూరు సీటును ఆ పార్టీ అధినేత‌ జగన్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్క‌డ గ‌తంలో మూడుసార్లు గెలిచిన మ‌హీధ‌ర్‌రెడ్డి ఇక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థి అవుతార‌ని భావించి జ‌గ‌న్ ప్ర‌స్తుతం ఇక్క‌డ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్న తూమాటి మాధ‌వ‌రావును త‌ప్పించి మ‌హీధ‌ర్‌రెడ్డికే దాదాపు సీటు ఖ‌రారు చేశారు.

కంచుకోటలో మరోసారి…..

గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత ఇక్క‌డ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో ఇక్క‌డ వైసీపీనే గెలిచింది. అయితే ఆ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడంతో ప్ర‌త్యామ్నాయ నేత‌గా మ‌హీధ‌ర్‌రెడ్డిని జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. అదేవిధంగా త‌మ పార్టీకి కంచుకోట‌గా ఉన్న ప్ర‌కాశం జిల్లాలో టీడీపీని ఢీకొట్టేందుకు జ‌గ‌న్ ఆ పార్టీకే చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు కూడా జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. వారు మ‌రెవ‌రో కాదు.. మాగుంట శ్రీ‌న‌వాసులురెడ్డి, క‌ర‌ణం బ‌ల‌రాం.. వీరిద్ద‌రూ టీడీపీలో అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో స‌రైన గుర్తింపు లేద‌ని కొంత‌కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. మాగుంట శ్రీ‌నివాసులుకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది.

వైవీని పార్ఠీకే పరిమితం…..

ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ఎంపీ సుబ్బారెడ్డిని పార్టీ ప‌నుల కోసం వాడువాల‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శ్రీనివాసుల‌రెడ్డి చివ‌ర్లో టీడీపీలోకి వ‌చ్చి ఇక్క‌డ ఆ పార్టీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేశారు. 13 వేల స్వ‌ల్ప తేడాతో మాత్ర‌మే ఇక్క‌డ మాగుంట ఓడిపోయారు. ఆ త‌ర్వాత బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చినా పార్టీలో ప్ర‌యారిటీ లేక‌పోవ‌డంతో ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉండ‌డం…ఆయ‌న‌తో వైసీపీ నాయ‌కులు ట‌చ్‌లోకి వెళ్ల‌డం…ఆయ‌న‌కు ఒంగోలు ఎంపీ సీటుపై హామీ ఇవ్వ‌డం జ‌రిగిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.ఒంగోలు ఎంపీ టికెట్ హామీతోనే మాగుంట చేరిక దాదాపుగా ఖ‌రారు అయిన‌ట్టేన‌ని ప‌లువురు నాయ‌కులు చెప్పుకుంటున్నారు.

దగ్గుబాటి కుటుంబం కూడా…..

ఇక‌ ఇదే జిల్లాకే చెందిన దగ్గుబాటి కుటుంబం కూడా వైసీపీలో చేరుతుంద‌నే టాక్ వినిపిస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ విష‌యం స్ప‌ష్ట‌త వ‌చ్చే అకాశాలు ఉన్నాయ‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు. ఇక గొట్టిపాటి వచ్చి టీడీపీలో చేరాక‌ కరణం బలరాంకు ఏ మాత్రం పార్టీలో గుర్తింపు లేకుండా పోయింద‌నే టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ కూడా ద‌క్కే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న వైసీపీలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల్లోనే కరణం బ‌ల‌రాం కూడా వైసీపీలో చేరే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయ‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే క‌ర‌ణం త‌న‌యుడు వెంక‌టేష్‌కు అద్దంకి అసెంబ్లీ నియోజ‌వ‌ర్గం సీటు ఇచ్చేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ సానుకూలంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు వైసీపీలోకి వెళితే అది ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం అవ్వ‌డం ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*