జగన్ ‘‘మాయ’’ చేయలేరా?

రాజకీయాల్లో చేయలేనివి కూడా చేస్తామని చెప్పడం….అలివి కాని హామీలు ఇవ్వడం మామూలే. ఎన్నికల మ్యానిఫేస్టోలు కూడా అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కరికీ గూడు, గుడ్డ, కూడు నినాదం కొన్ని దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు హామీ ఇస్తున్నాయి. కాని ఏళ్ల తరబడి ఆ హామీలు అమలు కావడం లేదు. ఎన్నికల వేళ మరింత ముందుకు వెళ్లి సాధ్యం కాని హామీలు ఇవ్వడం రాజకీయనేతలకు అలవాటే. కాని వైసీపీ అధినేత జగన్ కు ఇది అలవాటు లేదన్నది మరోసారి స్పష్టమైంది. గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ హామీ ఇవ్వకపోవడంతో రైతాంగం దూరమయింది. ఫలితంగా జగన్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది.  చంద్రబాబు రైతురుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి రాగలిగారు.

గత ఎన్నికల్లోనూ….

కాని జగన్ తనకు గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించారు. ఒకవైపు అధికార తెలుగుదేశం పార్టీ కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి గత ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఆ మేరకు మంజునాధ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాత సిఫార్సులు చేయడంతో కాపు రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది. కేంద్రానికి పంపింది. యాభై శాతానికి మించి రిజర్వేషన్లు సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా కేంద్రం వద్దకు కాపు రిజర్వేషన్ల బిల్లును పంపి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు.

రిజర్వేషన్లపై పోరాటం జరుగుతున్నా….

మరోవైపు ముద్రగడ పద్మనాభం వంటి సీనియర్ నేతలు కాపు రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి, సీఎం కుర్చీ ఎక్కడానికే జగన్ తపించి పోతుంటారని అధికార తెలుగుదేశం పార్టీ నిత్యం విమర్శలు చేస్తుంటుంది. అయితే జగన్ అందుకు విరుద్ధంగా కాపులు ఎక్కువగా ఉండే తూర్పు గోదావరి జిల్లాలోనే నిర్భయంగా కాపు రిజర్వేషన్లపై తాను హామీ ఇవ్వలేనని, అది తన పరిధిలో లేదని చెప్పేశారు. అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్ కు మాత్రం రెట్టింపు నిధులు ఇస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కాపు సామాజిక వర్గం చుట్టే తిరుగుతున్నాయి. అన్ని పార్టీలూ వారిని ప్రసన్నం చేసుకోవడానికి తంటాలు పడుతున్న సమయంలో జగన్ ప్రకటన సంచలనం కల్గించిందనే చెప్పాలి.

జగన్ కు చేతకాదా?

జగన్ ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ఉంటారని పార్టీ నేతలే ఒక్కోసారి నివ్వెర పోతుంటారు. మాదిగ రిజర్వేషన్ల విషయంలనూ జగన్ ను కలవడానికి వచ్చిన ఆ ప్రతినిధులకు జగన్ అదే సమాధానం చెప్పడం నివ్వెర పర్చింది. తాను అబద్ధాలు ఆడనని, ప్రజలకు అలివి కాని హామీలిచ్చి వంచించలేనని జగన్ మరోసారి కాపు రిజర్వేషన్లపై ప్రకటన చేసి చెప్పకనే చెప్పినట్లయింది. హామీలు ఇవ్వకుండా, ప్రజలను మభ్యపెట్టకుండా జగన్ అధికారంలోకి ఎలా వద్దామనుకుంటున్నారో అర్థం కావడం లేదని తూర్పు గోదావరి జిల్లా కాపునేతలు తలలు పట్టుకుంటున్నారు. కాని జగన్ మాత్రం తన దారి తనదేనని చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీ అధినేత డేరింగ్ స్టేట్ మెంట్ ను స్వాగతించే వారి సంఖ్యే అధికంగా ఉందని చెప్పకతప్పదు. ఈప్రకటనతో జగన్ పట్ల విశ్వసనీయత పెరిగిందని వైసీపీ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. తొలినుంచి ప్రత్యేక హోదా విషయంలోనూ ఇదే మొండి వైఖరిని జగన అవలంబిస్తున్న సంగతి తెలిసిందే.

1 Comment on జగన్ ‘‘మాయ’’ చేయలేరా?

  1. అందరూ కలసి ప్రజలను సోమరులను చేయు చున్నారు.జగన్ ఆయన సొంత డబ్బు ఏమి తీసుకువచ్చి ప్రజలకు పెట్టడు అదే విదంగా చంద్రబాబు తన సొంత డబ్బు తెచ్చి పెట్టరు.ఇక్కడ ప్రజలు అర్థం చేచు కోవలసిన విషయం ఏమిటి అంటే ఎవరి సామాజిక వర్గాలను వాళ్ళు కాపాడు కుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.


*