జగన్ ఆశలకు గండికొట్టారే….!

వైసీపీ అధినేత జగన్ ఆశించిన మేరకు జరగడం లేదు. ప్రత్యేకహోదా సాధన కోసం రాజీనామాలు చేసి ఛాంపియన్లుగా నిలవాలని జగన్ భావించారు. ఈ మేరకు గత నెల ఆరోతేదీనే వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారు. కాని వారి రాజీనామాలు ఆమోదం ఇంతవరకూ పొందలేదు. మరోసారి వచ్చేనెల 5వ తేదీ తర్వాత ఎంపీలతో సమావేశం కావాలని స్పీకర్ నిర్ణయించారు. దీంతో రాజీనామాలు ఆ తర్వాత ఆమోదం పొందినా ఉప ఎన్నికలు రావన్న ఆందోళన పార్టీలో నెలకొంది.

సత్తా చాటాలని……

ఎంపీలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళితే ఐదు పార్లమెంటు నియోజకవర్గంలో వైసీపీ తన సత్తా చాటాలనుకుంది. ఐదు పార్లమెంటు స్థానాలు తమకు అనుకూలమైనవే కావడంతో వైసీపీ ఎంపీల చేత జగన్ రాజీనామా చేయించారు. ఐదు పార్లమెంటు స్థానాల పరిధిలో దాదాపు 35కు పైగా అసెంబ్లీ స్థానాలున్నాయి. ఐదు జిల్లాల్లో ఈ ఉప ఎన్నికలు ప్రభావం చూపుతాయి. 2019 సాధారణ ఎన్నికలకు ముందు జరిగే ఉప ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా జగన్ భావించారు. అందుకే రాజీనామాలను ఆమోదించుకుని రావాల్సిందిగా జగన్ తన పార్టీ ఎంపీలను స్పీకర్ వద్దకు పంపారు.

ఆ అవకాశమే లేదు……

కాని అందుతున్న సమాచారం ప్రకారం జూన్ ఐదోతేదీ తర్వాత వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం పొందినా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఎన్నికలో విజయం సాధించిన అభ్యర్థి పదవీ కాలం ఏడాది పాటు ఉండాలి. కాని జూన్ 5వతేదీ తర్వాత రాజీనామా ఆమోదించినా, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి కొంత సమయం పడుతుంది. దీంతో ఉప ఎన్నికలు జరిపితే గెలిచిన సభ్యుడికి ఏడాది పదవీ కాలం ఉండదు. వచ్చే ఏడాదిసాధారణ ఎన్నికలు జరుగుతుండటంతో ఏపీలో వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందినా ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

టీడీపీకి సానుకూలమే…….

వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందినా ఉప ఎన్నికలు జరగకపోతే తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మలచుకుంటుంది. ఇదంతా బీజేపీ, వైసీపీ కలిసిన ఆడిన డ్రామాలుగా పెద్ద యెత్తున ప్రచారం చేస్తుంది. ఇప్పటికే వైసీపీ, బీజేపీవి లాలూచీ రాజకీయాలంటూ చెబుతున్న తెలుగుదేశం పార్టీకి మరో అవకాశం దొరికినట్లవుతుంది. తాము తొలినుంచే చెబుతున్నామని, ఉప ఎన్నికల్లో గెలవలేకే వైసీపీ రాజీనామా డ్రామాలు ఆడిందని ఊరూవాడా చెప్పేస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీకి కొంత అనుకూలమని, వైసీపీకి ప్రతికూలమని భావిస్తున్నారు. రాజీనామాలు ఆమోదం పొందినా ఉప ఎన్నికలు జరగకుంటే సెమీ ఫైనల్స్ కు వెళదామనుకుంటున్న జగన్ ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*