జగన్ పై..ఆ ఎమ్మెల్యేల వత్తిడి నిజమేనా?

వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు జగన్ పై వత్తిడి తెస్తున్నారా? వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? అవును. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అదే చర్చ జరుగుతుంది. వైసీపీ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసి, పార్లమెంటు సమావేశాలు జరగుతున్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నారు. తన నియోజకవర్గ పనులను చేయించుకునేందుకు రాజీనామా చేసిన ఎంపీలు ఢిల్లీ చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు. తిరుపతి ఎంపీ వరప్రసాద్ రాజీనామా చేసినా తన నియోజకవర్గంలో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ఆయన ఢిల్లీలోనే మకాం వేసి ఉన్నారు. మిగిలిన ఎంపీల పరిస్థితి కూడా ఇంతే.

సమావేశాలకు హాజరుకావాలని….

ఇక అసెంబ్లీ సమావేశాలను ఈ నెలలో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. బహుశా ఈనెల 20వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకావాలని వైసీపీ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల అంశం, నిరుద్యోగ భృతి, ప్రత్యేక హోదా వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇది చక్కటి అవకాశంగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్, మేధావులు అసెంబ్లీకి గైర్హాజరవుతుండటాన్ని తప్పుపడుతున్నారు.తమ మనసులో ఉన్న విషయాలను జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

గత రెండు సమావేశాలకు….

వైసీపీ నుంచి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ జగన్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. గత రెండు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లలేదు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజాసమస్యలను చర్చించాల్సిందేనని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించకుండా పక్షపాత ధోరణిని అవలంబిస్తున్న చంద్రబాబును సభ సాక్షిగా నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఒకరు ‘‘తెలుగు పోస్ట్’’కు చెప్పారు. పోలవరంలో అంతా డ్రామా జరుగుతుందని, దీనిపై కూడా తాము నిలదీయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అనేక సమస్యలను……

అంతేకాకుండా రాష్ట్రంలో 16 లక్షల ఓట్లు గల్లంతవ్వడానికి కూడా కారణం చంద్రబాబేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారులను మేనేజ్ చేసి తమ పార్టికి చెందిన ఓట్లను గల్లంతుచేశారని, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినా, సభ సాక్షిగా బయటపెడితే చంద్రబాబు బండారాన్ని ప్రజల ముందు ఉంచినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల5వ తేదీన జగన్ తో జరిగే సమావేశంలో తమ నిర్ణయాన్ని ఆయనకు చెప్పాలని కొందరు నిర్ణయించుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం అసెంబ్లీ సమావేశాలు జరిగితే వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యేందుకు జగన్ అంగీకరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*