ఇక్కడ జగన్ ‘‘రాజా’’ ఎవరు?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్పలేం. ఒక‌ప‌క్క రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు త‌మ పార్టీని బ‌లోపేతం చేసుకునేందుకు నానా తిప్పలు ప‌డుతున్నారు. ఈ క్రమంలోనే పాత‌కాపుల‌కు పెద్ద ఎత్తున పెద్ద పీట వేస్తున్నారు. పార్టీల‌ను వ‌దిలి వెళ్లిపోయిన వారిని తిరిగి రావాలంటూ ప్రత్యేకంగా ఆహ్వానాలు ప‌లుకుతున్నారు. అంతేకాదు, అలా వ‌చ్చిన వారికి మంచి భ‌విష్యత్తు కూడా ఉంటుంద‌ని వారు హామీలు ఇస్తున్నారు.. అయినా కూడా కాంగ్రెస్ కు చెందిన నాయ‌కులు ఏ ఒక్క‌రూ మాట‌ల‌ను వినిపించుకోవ‌డంలేదు. పైగాఇప్పుడు ఉన్న వారు కూడా ఒక‌రిద్దరు త‌మ దారి తాము చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం నేదురుమ‌ల్లి జ‌నార్దన్ రెడ్డి కుమారుడు రాం కుమార్ రెడ్డి త‌న దారి తాను చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న త్వర‌లోనే వైసీపీలో చేరేందుకు ముహూర్తం రెడీ అయింది.

జగన్ రెడీగా ఉన్నారా?

అంతేకాదు, ఆయ‌న పార్టీలోకి వ‌స్తే.. వెంట‌నే నెల్లూరు జిల్లాలోని కీల‌క నియోజక‌వ‌ర్గం వెంక‌ట‌గిరి టికెట్ ఇచ్చేందుకు జ‌గ‌న్ రెడీగా ఉన్నార‌ని స‌మాచారం. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంక‌ల్ప యాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌‌ను ఆయన కలిశారు. అయితే పార్టీలో చేరిక ఏ రోజు అనే విషయం మాత్రం తెలియరాలేదు. రాంకుమార్‌రెడ్డికి టిక్కెట్ హామీ ఇచ్చారా..? లేదా అనే విషయం మాత్రం తెలియరాలేదు. కాగా కొద్దిరోజుల క్రితం మాట్లాడిన ఆయన.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నేదురుమల్లి జనార్దనరెడ్డి నాల్గవ వర్ధంతిని పురస్కరించుకుని కార్యక్రమంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

పూర్తి స్థాయి రాజకీయాల్లో….

ఇకపై పూర్తి స్థాయి రాజకీయాల్లో కొనసాగుతానని, 2019 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీచేసి, విజయం సాధిస్తానని, ఇంత కాలం రాజకీయంగా నీరసించిన నేదురుమల్లి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతామని చెప్పుకొచ్చారు. రాం కుమార్‌రెడ్డి ప్రసంగిస్తుండగా.. మధ్యలో ఓ అభిమాని మన పార్టీ ‘వైసీపీ’ అంటూ గట్టిగా అరవగా.. దీనికి స్పందించిన ఆయన మీ అభిప్రాయాలను మరో 3 నెలలు మనసులోనే ఉంచుకోవాలి. మీ అందరి మనసుల్లో ఏ పార్టీ అనుకుంటున్నారో అదే పార్టీ నుంచి వెంకటగిరిలో పోటీ చేస్తానని చెప్పారు. అనుకున్నట్లుగానే ఆయన మూడు నెలల తర్వాత జగన్‌ను కలవడంతో నేదురుమల్లి అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. మొత్తానికి రాం కుమార్ రెడ్డికి వైసీపీ టికెట్ ఖ‌రారైంద‌ని అంటున్నారు పార్టీ నేత‌లు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పి త‌ప్పదా…?

వైసీపీలో చేరుతోన్న రాం కుమార్ రెడ్డి వెంక‌ట‌గిరి నుంచే పోటీ చేస్తున్నట్టు చెప్పేశారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో వెంక‌ట‌గిరి నుంచే పోటీ చేయాల‌ని చూస్తున్నారు. వాస్తవానికి ఆయ‌న ఆత్మకూరు సీటు కోసం జ‌గ‌న్‌తో బ‌ల‌మైన లాబీయింగ్ చేశారు. అయితే అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేక‌పాటి గౌతంరెడ్డి బ‌లంగా ఉన్నారు. దీంతో ఆనంకు ఆ సీటు ఇవ్వలేన‌ని ఆత్మకూరు నుంచి పోటీ చేయాల‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు అప్పట్లో వార్తలు వ‌చ్చాయి. ఇప్పుడు నేదురుమిల్లి వార‌సుడు సైతం అదే సీటు త‌న‌దే అని ఓపెన్‌గానే చెపుతుండ‌డంతో పాటు వైసీపీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధం కావ‌డంతో జ‌గ‌న్‌కు ఇప్పుడు ఆత్మకూరు సీటు విష‌యంలో త‌ల‌నొప్పి త‌ప్పేలా లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*