అదే జరిగితే…జగన్ అడ్రస్ గల్లంతేనా?

ఏపీలో అడ్ర‌స్ గ‌ల్లంతైన కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పుంజుకునేందుకు పెద్ద ఎత్తున పాత‌కాపుల‌కు ఇప్ప‌టికే ఆహ్వానాలు ప‌లికింది. అదేస‌మ‌యంలో త‌న పాత ఓటు బ్యాంకు మ‌రింత సుస్థిరం చేసుకునేందుకు, త‌న‌వైపు తిప్పుకొనేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీకి ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే కాంగ్రెస్ దెబ్బ‌కొడుతున్న‌ట్టు తెలుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. విభ‌జ‌న దెబ్బ‌తో కాంగ్రెస్ కు ఇక్క‌డ అడ్ర‌స్ గల్లంతైంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌లు బీజేపీ ఏదైనా న్యాయం చేస్తుంద‌ని భావించారు. కానీ, అది జ‌ర‌గ‌లేదు. కాంగ్రెస్ గ్యాప్‌ను బీజేపీ పూడ్చ‌లేదు. పైగా ప్ర‌త్యేక హోదాను పూర్తిగా అట‌కెక్కించింది. ఇదిలావుంటే, ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదాను తాము అధికారంలోకి వ‌స్తే ఇస్తామ‌న్నారు.

పది శాతం ఓట్లపై……

దీంతో ఏపీ ప్ర‌జల్లోని కాంగ్రెస్‌ సాంప్ర‌దాయ ఓటు బ్యాంకు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మ‌ళ్లుతోంది. వచ్చే ఎన్నికల్లో.. అధికారంలోకి రాకపోయినా.. ఓటు బ్యాంక్‌ను పెంచుకుంటే.. 2024లో సత్తా చాట‌వ‌చ్చ‌ని నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో 2.80 % ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ ఈ సారి కనీసం 5-10 % ఓట్లు సాధిస్తుందని నాయ‌కులు భావిస్తున్నారు. ఒక‌వేళ ఎన్నిక‌ల నాటికి ఈ విష‌యంలో ఏదైనా తేడా ఉంటే.. స‌రిచేయ‌డానికి కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వివిధ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయకుల‌ను చేర‌దీయ‌డం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే కాపు వ‌ర్గానికి చెందిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభానికి రెడ్ కార్పెట్ ప‌రుస్తున్నారు.

బీసీలను ప్రసన్నం చేసుకోవడానికి…..

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ బీసీల‌ను కూడా త‌మ వైపు తిప్పుకొనేలా పావులు క‌దుపుతున్నారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డంతోపాటు దీనిని 9వ షెడ్యూల్‌లో చేరుస్తామ‌ని కూడా హామీ ఇస్తున్నారు. బీసీల్లో (ఎఫ్‌)ను తీసుకురావ‌డం ద్వారా మ‌రింత‌గా బీసీల‌కు హామీల‌ను నెర‌వేరుస్తామ‌ని హామీ ఇస్తున్నారు. ఇలా అన్ని సామాజిక వ‌ర్గాల ఓట్ల‌ను కైవ‌సం చేసుకునే దిశ‌గా కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రభావం వైసీపీపై ప‌డుతుంద‌ని భావిస్తున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ఓటు బ్యాంకు దాదాపు వైసీపీకే చేరింది. కాంగ్రెస్‌లో కీల‌కంగా చ‌క్రం తిప్పిన నాయ‌కులు చాలా మంది వైసీపీలో ఉండ‌డంతో వారికి కాంగ్రెస్ ఓటు బ్యాంకే అండ‌గా ఉంటూ వ‌స్తోంది. ఇప్పుడు ఆ వర్గాలు మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరితే.. ఓట్ల చీలిక వల్ల.. వైసీపీకి నష్టం కలుగుతుందనేదని విశ్లేషకుల అభిప్రాయం.

ఐదు శాతం సాధించినా…..

ఇక కిర‌ణ్‌కుమార్ రెడ్డి లాంటి మాజీ సీఎంలు ఇప్ప‌టికే కాంగ్రెస్ చెంత చేరారు. ప్ర‌త్యేక హోదా విష‌యంతో పాటు ఏపీకి ఇత‌ర‌త్రా అందాల్సిన ఫ‌లాల విష‌యంలోనూ కాంగ్రెస్ సుముఖంగానే ఉంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ 5% ఓట్లు సాధిస్తేనే.. వైసీపీ విజ‌యావ‌కాశాలు స‌న్న‌గిల్ల‌డం ఖాయమ‌న్న రాజ‌కీయ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మ‌రోప‌క్క‌, త‌మ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు , పాత‌కాపుల‌ను చేర్చుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తే.. వివిధ సామాజిక‌వర్గాల్లోని నేత‌లు అండ‌గా నిలిచి పార్టీలోకి చేరితే.. ఆయా ఓటు బ్యాంకు కాంగ్రెస్‌లోకి చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. వైసీపీకి న‌ష్టం క‌ల‌గ‌క‌మాన‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కాని ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ కోలుకోవడమే కష్టమన్నది మరికొందరి భావన.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*