మరో వపర్ ఫుల్ నేత ఫ్యాన్ పార్టీలోకి…?

కాంగ్రెస్ లో యువనేత, మాజీ మంత్రి కొండ్రు మురళికి లైన్ క్లియర్ అయిందా. ..? వైసీపీలో చేరేందుకు సిద్ధమయిపోయారా? ఈ మేరకు జగన్ నుంచి క్లియరెన్స్ వచ్చిందా? అవుననే అంటున్నారు. కొండ్రుమురళి త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు రెడీ అయిపోతున్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చేరేసరికి మరో నాలుగు నెలలు పట్టే అవకాశముంది. ఈలోపే చేరాలా? లేక జగన పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా చేరాలా? అన్నది కొండ్రు మురళి తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారట.

అనుచరులతో సమావేశం…..

కొండ్రుమురళి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. మంత్రిగా పనిచేసిన కొండ్రు మురళి యువకుడు కావడం, దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన బలమైన నేతగా అనతి కాలంలోనే గుర్తింపు పొందారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో కొండ్రుమురళి పరిస్థితి డోలాయమానంలో పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న కొండ్రు మురళి యాక్టివ్ గా లేరు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదన్న సంగతి ఎవరికీ తెలియంది కాదు. దీంతో ఆయన పార్టీ మారాలనే గత కొన్నాళ్లుగా అనుకుంటున్నారు. తన అనుచరుల నుంచి వస్తున్న వత్తిడిని ఆయన తట్టుకోలేక పార్టీ మారాలనే నిర్ణయించుకున్నారు.

తొలుత తెలుగుదేశంలోకి…..

తొలుత కొండ్రు మురళి తెలుగుదేశం పార్టీలోకి వెళతారని ప్రచారం జరిగింది. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొండ్రు ఖచ్చితంగా టీడీపీలోకి వెళ్లేవారు. అప్పుడు ఆయనకు ఒక నియోజకవర్గమంటూ దొరికేది. కాని నియోజకవర్గాల పునర్విభజన లేదని తేలడంతో కొండ్రు మురళి టీడీపీ వైపు వెళ్లే ఆలోచన చాలా రోజుల క్రితమే విరమించుకున్నారు. తాజాగా వైసీపీసీనియర్ నేత బొత్స సత్యనారాయణ కొండ్రుమురళితో చర్చించినట్లు సమాచారం. ఆయనకు పార్టీలో తగిన గౌరవం లభిస్తుందని బొత్స హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సీటు కూడా కన్ఫర్మ్ చేశారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి.

వైఎస్ జయంతి రోజున…..

దీంతో కొండ్రు మురళి వైసీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కొందరు సీనియర్ నేతలను పార్టీలోకి చేర్చుకుని హైప్ తేవాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి జులై 8వ తేదీన పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు. ఆనంతో పాటు కొండ్రు మురళి కూడా అదే రోజు పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. జగన్ తో చర్చించిన తర్వాత పార్టీలో చేరతానని కొండ్రు మురళి తన సన్నిహితుల వద్ద చెప్పారు. దీంతో ఉత్తరాంధ్రలో మరో బలమైన నేత వైసీపీలో చేరబోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*