ఆ నలుగురిలో ఎవరు….?

నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు ముదిరాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ వైసీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థి లేరు. కానీ, ఇంత‌లోనే ఇక్క‌డ న‌లుగురు కీల‌క నాయ‌కులు ఈ టికెట్ కోసం పోటీ ప‌డుతున్నారు. దీంతో ఇక్క‌డి రాజ‌కీయాలు నాలుగు స్తంభాలాట‌ను త‌ల‌పిస్తున్నాయి. ఎవ‌రికి టికెట్ ఇచ్చినా అధినేత జ‌గ‌న్‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. రాత్రికి రాత్రి మారిన ఇక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై విశ్లేష‌కులు ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. నెల్లూరు కు చెందిన ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు వైసీపీలోకి కొత్త‌గా తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో ఒక‌రు మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి(ఈయ‌న ఇంకా చేర‌లేదు.. త్వ‌ర‌లోనే చేర‌తారు) మ‌రో నేత మాజీ సీఎం నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్‌రెడ్డి కుమారుడు నేదురుమ‌ల్లి రాం కుమార్‌రెడ్డి. ఆనం వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, తొలుత ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఆశించారు.

ఇద్దరూ వెంకటగిరిపైనే…..

అయితే, అక్క‌డ మేక‌పాటి గౌతం రెడ్డి ఉండ‌డంతో జ‌గ‌న్ దీనిని తిర‌స్క‌రించారు. ఈ నేప‌థ్యంలో వెంక‌ట‌గిరి స్థానంపై ఆనం న‌మ్మ‌కం పెట్టుకున్నా రు. ఇక‌, బీజేపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన రాంకుమార్ రెడ్డి వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీచేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, ఈయ‌న చేరిక‌తో ఇక్కడ కచ్చితంగా వైసీపీ ఎంతో కొంత లాభపడుతుందనే మాట వాస్తవం. అయితే నాయ‌కులు అంద‌రూ ఒకే చోట చేరిన‌ట్టుగా బలమైన నలుగురు నాయకులు వెంకటగిరి నుంచి ఆ పార్టీకి నాయకత్వం వహించబోతున్నారు. రాంకుమార్‌, జగన్‌ మధ్య చర్చలు ఏమి జరిగాయో ఎవరికీ తెలియదు. రాంకుమార్‌ బేషరతుగానే పార్టీలో చేరుతున్నారని, టిక్కెట్టు విషయంలో ఈయనకు హామీ ఏమీ ఇవ్వలేదని కొంతమంది చెబుతున్నారు. అయితే తమ నాయకునికే టిక్కెట్టు దక్కుతుందని నేదురుమల్లి వర్గీయులు గట్టిగా భావిస్తున్నారు.

వారితో పాటు వీరు…..

మరోవైపు నేడో రేపో వైసీపీలో చేరబోయే ఆనం రామనారాయణరెడ్డికి కూడా వెంకటగిరి టిక్కెట్టు ఇవ్వనున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఆనంకు జిల్లాలో మరో చోటు ఖాళీ లేని కారణంగా వెంకటగిరిలో ఆయనకు పూర్వ పరిచయాలు ఉన్న క్రమంలో ఆ టిక్కెట్టే ఇస్తారనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే వెంకటగిరి ఆశావహుల్లో ఆనం రెండో నేత అవుతారు. ఈ టిక్కెట్టుపై నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్నారు. టిక్కెట్టు తమకే ఇస్తారని వీరిద్దరు బలంగా విశ్వసిస్తున్నారు. ఒకవేళ అది జరగకపోతే జీర్ణించుకునే స్థితిలో లేనట్లు కనిపిస్తున్నారు. ఇలా.. ఒక టిక్కెట్టు కోసం నలుగురు ముఖ్య నాయకుల మధ్య పోటీ ఏర్పడటం ఏమంత మంచి పరిణామాలు కావనే వాదన వినిపిస్తోంది. ఈ నాయకులందరూ సఖ్యతగా, ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా మనస్పూర్తిగా పనిచేస్తే మాత్రం రాంకుమార్‌ చేరికతో వైసీపీకి మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే, ఆశావ‌హులైన మిగిలిన అభ్య‌ర్థులు చాప‌కింద నీరులా వ్య‌తిరేక ప్ర‌చారం చేస్తే.. మాత్రం తీవ్ర ఇబ్బంది త‌ప్ప‌దు! మ‌రి జ‌గ‌న్ ఈ టికెట్ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*