గెలవాలంటే కుదరదులే….!

వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఆగస్టు 15వతేదీ కావడంతో ఆయన ఇక్కడే జెండాను ఆవిష్కరిస్తారు. దాదాపు రెండు నెలల పాటు సుదీర్ఘ సమయం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర నిన్ననే విశాఖ జిల్లాకు చేరుకుంది. ఈ జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలో జగన్ తొలి అడుగు వేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలని జగన్ భావిస్తున్నారు. అందుకోసమే ఎక్కువ రోజులు నర్సీపట్నంలోనే జగన్ ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయ్యన్న కు పట్టున్న…..

విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం అనగానే తొలుత గుర్తుకొచ్చేది మంత్రి అయ్యన్న పాత్రుడు. చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఈ నియోజకవర్గం ఆరుసార్లు ఆదరించింది. అయ్యన్నకు మంచి పట్టున్న నియోజకవర్గం. వచ్చే ఎన్నికలలోనూ ఏడోసారి గెలిచేందుకు అయ్యన్న పాత్రుడు సిద్ధమవుతున్నారు. 1967లో నర్సీపట్నం నియోజకవర్గం ఆవిర్భవించింది. తొలి ఎన్నికలో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించినా 1985 నుంచి ఈ నియోజకవర్గంలో పసుసు జెండాయే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. అందులోనూ 1985 నుంచి అయ్యన్న పాత్రుడే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటం విశేషం.

వరుస గెలుపులతో…..

1983లో నర్సీపట్నం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అయ్యన్న పాత్రుడు కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రరాజుపై వెయ్యి ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 1985లో నర్సీపట్నం నుంచి అయ్యన్న పాత్రుడు టీడీపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీరామమూర్తి పై కేవలం 811 స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే 1989లో అయ్యన్న ఓటమి పాలయ్యారు. తిరిగి 1994లో అదే నియోజకవర్గంలో విజయం సాధించారు. 1999, 2004లో వరసగా విజయం సాధించిన అయ్యన్న 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల పాప చేతిలో ఓటమిపాలయ్యారు. తిరిగి గత ఎన్నికల్లో కూడా స్వల్ప ఓట్ల మెజారిటీతోనే అయ్యన్న గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేశ్ పైన కేవలం2,338 ఓట్ల తేడాతోనే విజయం సాధించడం విశేషం.

స్వల్ప ఓట్ల తేడాతోనే…..

అయ్యన్న గెలిచిన ప్రతిసారీ స్వల్ప ఓట్ల తేడాయే కావడంతో ఈసారి జగన్ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి అయ్యన్న ఓటమిని చూడాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నర్సీపట్నం నియోజకవర్గంలో ఈసారి సరైన అభ్యర్థిని రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే కొందరి పేర్లు వస్తున్నా అయ్యన్నను ఢీకొనేది ఎవరా? అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. జగన్ పై ఒంటికాలి మీద లేచే అయ్యన్న పాత్రుడిపై జగన్ ఎటువంటి విమర్శనాస్త్రాలు సంధిస్తారో చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*