జగన్ నేరుగా డీల్ చేయాల్సిందేనా?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీలో నాయ‌కులు టికెట్ల వేట‌లో ప‌డుతున్నారు. ఈ క్ర‌మం లోనే ఆధిప‌త్య పోరు పెరుగుతోంది. ఈ ప‌రిణామం అటు పార్టీకి, ఇటు నాయ‌కులు కూడా మేలు చేయ‌క‌పోగా.. కీడు చేస్తోం ద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం వైసీపీ అధినేత.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర కూడా చేస్తున్నారు.ఎండ, వాన‌, ఆరోగ్యాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా అలుపెరుగ‌కుండా ఆయ‌న పాద‌యాత్ర చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ యాత్ర విశాఖ‌ప‌ట్నం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం కూడా ప‌డుతున్నారు. నిజానికి మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు ప్రాతినిధ్యం వ‌హించిన న‌ర్సీప‌ట్నంలో జ‌గ‌న్ యాత్ర ఫెయిల్ అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు.

టిక్కెట్ల కోసం…….

కానీ, అంద‌రి ఊహ‌ల‌కు భిన్నంగా ప్ర‌జ‌లు పోటెత్తారు. మ‌రి ప్ర‌జ‌లు ఇలా ఫాలో అవుతుంటే.. పార్టీలోని నాయ‌కులు మాత్రం టికెట్ల కోసం త‌న్నుకుంటున్న ప‌రిస్తితి క‌నిపిస్తోంది. విశాఖ‌ప‌ట్నం జిల్లా పాయ‌క‌రావుపేట‌, య‌ల‌మంచిలి, తాగాజా న‌ర్సీప‌ట్నంల‌లో టికెట్ల నేత‌లు పోటీ ప‌డుతున్నారు. దీంతో పార్టీలో ముస‌లం పుడుతున్న ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. పాయకరావుపేట నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. కానీ కొన్ని నియోజక వర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు, విభేదాలు జగన్‌ లక్ష్యానికి, పార్టీ పటిష్ఠానికి అడ్డంకిగా మారుతున్నాయి.

నివురుగప్పిన నిప్పులా ఉన్న…..

జగన్‌ పాదయాత్రకు ముందు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమావేశాల్లో తీవ్రస్థాయిలో నాయకుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా వున్న అభిప్రాయ భేదాలు పార్టీ అధినేత రాకకు ముందు, తర్వాత కూడా బయటపడుతున్నా యి. పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో కోటవురట్ల మండల అధ్యక్షుడు పైలా రమేష్‌కు, తంగేడు రాజులకు మధ్య వున్న విభేదాలు బయటపడ్డాయి. విజయసాయిరెడ్డి సమక్షంలోనే పార్టీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడడం గమనార్హం.

జగన్ ను లాగుతున్నారు…..

ఇక‌, ఎలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో వైసీపీ నాయకులు కన్నబాబురాజు, బొడ్డేడ ప్రసాద్‌ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఇరువురు నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడమే కాకుండా పార్టీ అధినేత జగన్‌ను కూడా ఇందులోకి లాగడం, తాను ఆయనకు భారీగా డొనేషన్‌ ఇచ్చానంటూ కన్నబాబురాజు పేర్కొనడం కలకలం రేపింది. ఇదిలావుంటే, పాదయాత్రలో జగన్‌ గానీ, పార్టీ సీనియర్లుగానీ తమకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదని కొందరు నాయకులు బహిరంగంగా, మరికొందరు నిగూఢంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్థిగా ప్రకటించకపోవడం……

ఇక న‌ర్సీప‌ట్నంలో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడుకు గట్టి పోటీ ఇచ్చిన గణేష్‌కే మళ్లీ టిక్కెట్టు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే నియోజకవర్గంలో వారం రోజుల పాటు పాదయాత్ర నిర్వహించిన జగన్‌ కనీసం నర్సీపట్నం బహిరంగ సభలో కూడా గణేష్‌ను అభ్యర్థిగా ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది.ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ణేష్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప కూడా టిక్కెట్ రేసు ఉన్నారు. ఆమె ఇటీవ‌లే ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న కూడా చేశారు. త‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ టికెట్ ఇస్తానంటే.. ఆ పార్టీలోకే జంప్ చేస్తాన‌ని మీడియాతోనే చెప్పుకొచ్చారు. అంటే.. ఇక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు! అత్యంత కీల‌క‌మైన ఈ జిల్లాలో అందునా.. టీడీపీకి కంచుకోట‌ల వంటి నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న విశాఖ‌లో పార్టీని జ‌గ‌న్ ఎలా లైన్‌లో పెడ‌తారో చూడాలి.