జగన్ ఒప్పుకుంటేనే బెటర్ కదా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల ఆరోతేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు దాదాపు పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం జరిగే వర్షాకాల సమావేశాలు చాలా కీలకంగా మారనున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటం, కొన్ని ప్రజాసమస్యలను ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అగ్రిగోల్డ్ బాధితుల సమస్య, నిరుద్యోగ భృతి, రైతు రుణ మాఫీతో పాటు తాజాగా వచ్చిన వరదలకు పంటనష్టంపై శాసనసభలో చర్చించాలని అన్ని వర్గాల వారూ కోరుకుంటారు.

హాజరుకాకుంటే…..

కాని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాలకూ హాజరవుతుందా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేంత వరకూ తాము శాసససభలోకి అడుగుపెట్టబోమని వైసీపీ గతంలోనే చెప్పింది. అయితే అనర్హత వేటు విషయం స్పీకర్ పరిధిలోనిదని, తాము ఏమీచేయలేమని ప్రభుత్వం వాదిస్తోంది. స్పీకర్ కూడా న్యాయస్థానంలోఈసమస్య ఉందని చెబుతున్నారు. అంటే అనర్హత వేటు అంశం ఇక దాదాపు ముగిసిపోయినట్లే.

జీతాలు తీసుకుంటూ…..

ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన మేధావులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ ప్రజాసమస్యలను ప్రస్తావించకపోవడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీసి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి తాము శాసనసభకే రామని చెప్పడం కరెక్ట్ కాదని అంటున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సయితం వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం ఆ ఛాన్స్ ను మిస్సయిందన్నారు.

జగన్ నిర్ణయంపైనే…..

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే ఏకంగా ప్రతిపక్ష నేత జగన్ ప్రజాసమస్యలను ప్రస్తావించలేక పారిపోయాడన్నారు. దీంతో పాటు రాజధాని బాండ్ల అంశం కూడా ఈ సమావేశాల్లో చర్చకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనంటున్నారు. అమరావతి బాండ్ల విషయంలో నిపుణులు సయితం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలోని కొందరు ఎమ్మెల్యేలు కూడా శాసనసభ సమావేశాలకు వెళ్లి ప్రజాపక్షాన పోరాడితే మేలన్న అభిప్రాయానికి వచ్చారు. ఈ విషయాన్ని జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు.ప్రస్తుతం విశాఖపట్నం జిల్లాలో జగన్ పాదయాత్ర జరుగుతోంది. మరో రెండు జిల్లాలే మిగిలిఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు జగన్ అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. మరి జగన్ అసెంబ్లీ సమావేశాల హాజరుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*