జగన్ ఇలా చేస్తే కరెక్ట్ కాదేమో…!

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ.. రాజ‌కీయ వర్గాల్లో చ‌ర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఇప్పటి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. రేపు జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేయ‌డం అనేది జ‌ర్నలిజంలో ఎప్పటి నుంచో కొన‌సాగుతున్న ప్రక్రియ‌. ఇలాంటి విశ్లేష‌ణ‌ల‌కు, వార్తల‌కి ఎన‌లేని ఆద‌ర‌ణ కూడా ఉంది. ఇప్పుడు కూడా ఏపీలో ఇదే త‌రహా ముంద‌స్తు ఊహ‌ల‌తో ప‌రిస్థితిని విశ్లేషిస్తూ.. వార్తా క‌థ‌నాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజయం సాధించాలని, గెలుపు గుర్రం ఎక్కాల‌ని భావిస్తున్న ప్రధాన విప‌క్షం వైసీపీ గురించి ప్రత్యేకంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర ప్రయోజ‌నాల నేప‌థ్యంలో వైసీపీకి ఉన్న ఐదుగురు ఎంపీలు రాజీనామాలు స‌మ‌ర్పించారు.

ఎవరికీ టిక్కెట్ ఇవ్వరా?

దీంతో ఇప్పుడు వారు మాజీలుగా మారిపోయారు. కేంద్రంపై పోరును ఉధృతం చేయాల‌న్నా. కేంద్రంపై పోరు చేయాలన్నా.. వైసీపీ ఎంపీలు కొర‌గాకుండా పోయార‌నే వాద‌న తెర‌మీదికి వ‌స్తోంది. స‌రే ఈ ఎపిసోడ్ ను ప‌క్కన పెడితే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వైసీపీలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వైసీపీకి ప్రస్తుతం ఐదుగురు ఎంపీలు మిగిలారు(మాజీలే). అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ఐదుగురిని పార్టీ అధినేత ఎలా గౌర‌వించ‌నున్నారు. మొత్తంగా అంద‌రికీ టికెట్లు ఇస్తారా? ఇవ్వరా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఐదుగురిలో ముగ్గురు ఎంపీల‌కు టికెట్లు డౌటేన‌ని నిన్న మొన్నటి వ‌ర‌కు వార్తలు రాగా ఇప్పుడు ఏకంగా ఎవ‌రికీ టికెట్ ఇచ్చే యోచ‌న‌లో జ‌గ‌న్ లేడ‌నే ప్రచారం సాగుతోంది.

ఆ ఎంపీని అసెంబ్లీకి…..

నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిపై నిర్వహించిన సర్వే ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయట.. దీంతో ఆయన స్థానంలో ఆయన కుమారుడు గౌతమ్ రెడ్డిని బరిలోకి దించి, మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఉదయగిరి నుంచి బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నారట. అదే జ‌రిగితే మేక‌పాటి మ‌రో సోద‌రుడు చంద్రశేఖ‌ర్‌రెడ్డికి టిక్కెట్ ఉండ‌దు. ఇక ఒంగోలు ఎంపీగా ఉన్న జగన్ బంధువు వైవీ సుబ్బారెడ్డి టిక్కెట్టుకి ఎసరు తప్పేలా లేదు.. ఆయనకి టిక్కెట్టు ఇచ్చేదిలేదని, విజయవాడలో ఉండి పార్టీ కార్యక్రమాలు చూసుకోవాలని జగన్ చాలాకాలం క్రితమే చెప్పినట్టు సమాచారం.. ఆయన స్థానంలో ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డిని బరిలోకి దింపాలని జగన్ ఆలోచిస్తున్నారట.

షర్మిలను బరిలోకి దింపుతారా?

ఇక‌, తిరుపతి ఎంపీ వరప్రసాద్ కి కూడా ఈసారి టిక్కెట్టు దక్కేలా లేదు.. ఆయన స్థానంలో కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుందరరాజు అనే అధికారికి దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక కడప ఎంపీ స్థానం అయితే రోజుకో మలుపు తిరుగుతుంది.. ఈసారి అవినాష్ కి టిక్కెట్టు వ‌స్తుందా ? లేదా ఆయ‌న్ను అసెంబ్లీ లేదా మ‌రో నామినేటెడ్ ప‌ద‌వితో స‌రిపుచ్చుతారా ? అన్నది క్లారిటీ లేదు. అవినాష్ స్థానంలో జగన్ బాబాయ్ వివేకానందకు బరిలోకి దింపాలని చూస్తున్నారట.. ఒకవేళ ఆయన కాకపోతే షర్మిలకి టిక్కెట్టు ఇవ్వాలన్న ఒత్తిడి కూడా పెరుగుతుందట. దీంతో రాష్ట్రం కోసం త‌మ ప‌ద‌వుల‌ను తృణ ప్రాయంగా వదులుకున్న ఈ మాజీ ఎంపీల‌కు టికెట్ లు ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని పెద్ద ఎత్తున్న వార్తల‌పై పార్టీలోని ఏ ఒక్కరూ స్పందించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని ఎలా చూడాలో తెలియాలంటే వెయిట్ చేయ‌క‌త‌ప్పదు..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*