
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలు ఎంత దూకుడు ప్రదర్శిస్తున్నాయో.. పార్టీల్లోని నేతలు కూడా అంతే స్పీడును ప్రదర్శిస్తున్నారు. టికెట్‌ను దక్కించుకోవడం దగ్గర నుంచే ఈ స్పీడు ఊపందుకోవడం గమనార్హం. తాజాగా రాజధాని ప్రాంతం గుంటూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీకి కంచుకోట అయిన గుంటూరులో పాగా వేయాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించు కున్నారు. ఇదిలావుంటే, ఈ జిల్లా రాజకీయాల్లోకి ఓ ఎన్నారై మహిళ సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు జిల్లాలో ఆమె పొలిటికల్ ఎంట్రీనే హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పేరు విడుదల రజనీకుమారి.
స్వచ్ఛంద సంస్థ ద్వారా…..
వీఆర్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా పలు రకాల సేవలందిస్తూ చిలకలూరిపేట ప్రజలకు ఇటీవల సుపరిచితు రాలయ్యారు. ఏడాది కాలంగా నియోజకవర్గంలో తన ట్రస్ట్ ద్వారా ఆమె సేవా కార్యక్రమాలతో నియోజకవర్గ జనాల్లో తన పేరు మార్మోగేలా చేశారు. అంతకు ముందే సీఎం చంద్రబాబు అంటే అభిమానమంటూ ప్రత్తిపాటి పుల్లారావును కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆసీనులైన ఓ సభలో (విశాఖ మహానాడు ) ఉత్సాహంగా ప్రసంగించి ఆయన దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత ఆమె పేరు రాష్ట్ర వ్యాప్తంగాను సామాజిక మాధ్యమాల్లో మార్మోగింది.
శపథం చేసి మరీ….
ఇక్కడే కథ అడ్డం తిరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో చిలకలూరిపేట టీడీపీ టికెట్‌ను ఆమె ఆశించారు. ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అయ్యే ఖర్చంతా భరిస్తానని చెప్పినా పార్టీ అధిష్ఠానం విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె దూకుడుతో ప్రత్తిపాటి కాస్త కలవరపడ్డారు. ఆ తర్వాత రజనీ మామ చిలకలూరిపేట ఏఎంసీ నుంచి వైదొలగారు. టికెట్ ఆశించి భంగపడ్డ ఆమె ప్రత్తిపాటిని ఓడిస్తానంటూ శపథం చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. కొన్నాళ్లకు ఆమె వైసీపీని సంప్రదించారు. జగన్‌తో టికెట్ విషయంపై చర్చించారు. ఆరేడు నెలలుగా ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
వైసీపీలో ప్రయారిటీ ఉంటుందని….
అయితే అక్కడ వైసీపీ తరపున పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రంగంలో ఉండడంతో రజనీకి వైసీపీలో ఎలాంటి ప్రయారిటీ ఉంటుందో ? డైలమా నెలకొంది. అయితే ఎట్టకేలకు జగన్ ఆమెకు ఛాన్స్ ఇచ్చారని టాక్. రెండు రోజుల క్రితం ఆమె విశాఖ జిల్లాలో జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సీటుపై హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అది కూడా టీడీపీ సీనియర్, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించాలంటే మహిళా కోటా, ఆర్థిక బలంతో రజనీ వల్లే అవుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మర్రి రాజశేఖర్ కు…..
అయితే, ఇక్కడ వైసీపీ ఆవిర్భావం నుంచి అన్నీ తానై వ్యవహరిస్తున్న మర్రిరాజశేఖర్ పరిస్థితిపై చర్చ ప్రారంభమైంది. అయితే, దీనిని ముందుగానే గమనించిన జగన్.. చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇటు మర్రి జగన్ హామీతో సంతృప్తి చెంది రజనీకి ఎన్నికల్లో సపోర్ట్ చేస్తే తాను గ్యారెంటీగా పుల్లారావును ఓడిస్తానని చేసిన శపథం నెరవేరుస్తానని రజనీ ధీమాతో ఉంది. మొత్తానికి ఈ పరిణామం మంత్రి ప్రత్తిపాటికి మింగుడు పడడం లేదని సమాచారం. ఏదేమైనా .. వచ్చే ఎన్నికల్లో డైనమిక్ లేడీపై ప్రత్తిపాటి పోటీ కి సిద్దం కావాల్సిందే!!
Leave a Reply