జగన్ జైత్రయాత్రకు వీళ్లే బ్రేకులు వేస్తారా?

ఎన్నికలకు ఎంతో సమయం లేదు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోష్ పెరగలేదు. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర పార్టీలో జోష్ తెచ్చినప్పటికీ నేతలు మాత్రం ఇంకా నిద్రమత్తును వీడలేదు. దీనికి ప్రధాన కారణం టిక్కెట్లు వచ్చే ఎన్నికల్లో తమకు టిక్కెట్ వస్తుందో రాదో? అన్న సందేహం వారిని జనంతో మమేకం చేయడం లేదు. ఇందులో పార్టీ అధిష్టానం తప్పు కూడా ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రధానంగా పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం సర్వే పైనే ఎక్కువగా ఆధారపడతారన్నది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్ట్ లను అనుసరించే టిక్కెట్లను కేటాయిస్తారన్నది వాస్తవం.

పాదయాత్రతో జోష్ రిగినా…..

అయితే ఇప్పటికే జగన్ దాదాపు 11 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని వచ్చారు. అక్కడక్కడా తప్ప ఎక్కడా అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను జగన్ ప్రకటించలేదు. దీనికి తోడు ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు సమన్వయ కర్తలను నియమించడం కూడా పార్టీకి ఇబ్బందిగా మారిందంటున్నారు. ఇద్దరు సమన్వయ కర్తలు ఒకే నియోజకవర్గంలో ఉండటంతో ఎవరూ పెద్దగా పార్టీపై దృష్టి పెట్టడం లేదు. దాదాపు రాష్ట్రంలోని 120 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఈసారి గెలుపు బాట పట్టిస్తాయని జగన్ విశ్వసిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం టిక్కెట్ల ఖరారుపై సందేహంతో మీనమేషాలు లెక్కిస్తున్నారు.

కార్యాలయాలకే పరిమితం…..

దీంతో కొన్ని నియోజకవర్గాల్లో నేతలు పార్టీ కార్యాలయానికే పరిమితమవుతున్నారు. ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు క్యాడర్ ను కూడా అయోమయంలోకి నెట్టేస్తుంది. టిక్కెట్ల విషయం తేలిస్తే తప్ప ప్రజల్లోకి వెళ్లినా ఉపయోగముండదని వారికి వారే చెప్పుకుంటున్నారు.ప్రజల్లోకి వెళ్లి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరం వెళ్లి తామే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి అని ఎలా ప్రకటించుకుంటామని నిలదీస్తున్నారు. అందువల్ల టిక్కెట్ ఖరారయ్యేంత వరకూ ప్రజల్లోకి వెళ్లినా ఉపయోగం ఉండదని, అందుకే తాము జగన్ ప్రకటన కోసం నిరీక్షిస్తున్నామని కోస్తా ప్రాంతానికి చెందిన వైసీపీ నేత ఒకరు చెప్పడం విశేషం.

ఆధిపత్య పోరుతో…..

కృష్ణా జిల్లాలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు, వంగవీటి రాధాలు సమన్వయ కర్తలుగా ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి టిక్కెట్ అనేది తేలలేదు. దీంతో ఇద్దరూ విడివిడిగానే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పార్టీలో ఇటీవల చేరిన యలమంచలి రవి, బొప్పన భవకుమార్ లు నియోజకవర్గ సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పోతుల ప్రసాద్ లు కో-ఆర్దినేటర్లుగా ఉన్నారు. పెడన నియోజకవర్గానికి ఉప్పాల రాంప్రసాద్, జోగి రమేష్ లు సమన్వయ కర్తలుగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఏలూరు నుంచి బలరామ్, ఆళ్లనానిలు ఉన్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో గంధం నాగబాబు, మేకా శేషుబాబులు, ఉండి నియోజకవర్గంలో నరసింహరావు, పాతపాటి సర్రాజులు నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో లేళ్ల అప్పిరెడ్డి, కిలారి రోశయ్య, పెదకూరపాడులో కావటి మనోహర్ నాయుడు, శంకరరావులు ఆధిపత్య పోరుతో పార్టీని పట్టించుకోవడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలో జ్యోతుల చంటిబాబు, ముత్యాల శ్రీనివాస్ లు జగ్గంపేట నియోజకవర్గానికి సమన్వయకర్తలుగా ఉన్నారు. ఇలా ఇద్దరున్న నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్నది క్షేత్రస్థాయిలో అందుతున్న సమాచారం. మరి జగన్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో వేచిచూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*