జగన్ ఈయనకు అన్యాయం చేస్తారా?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఎవ‌రు ఎలా మార‌తారో చెప్ప‌డ‌మూ క‌ష్టమే! ఇప్పుడు ఇదే జ‌రుగుతోంది ఏపీ రాజ‌కీయాల్లో. వ‌చ్చే ఎన్నిక‌ల హీట్ స్టార్ట్ అవ్వ‌డంతో ఏపీలో క‌ప్ప‌దాట్లు జోరందుకున్నాయి. అయితే ఎవ్వ‌రూ ఊహించ‌ని షాకులు కూడా నాయ‌కుల‌కు త‌ప్ప‌డం లేదు. ముఖ్యంగా గుంటూరు రాజ‌కీయాలు రోజుకోర‌కంగా మారుతున్నాయి. రాజ‌ధాని ప్రాంతంలోని చిల‌క‌లూరిపేట‌లో వైసీపీ ప‌రిస్థితి కొంత గంద‌ర‌గోళంలో ప‌డింది. పార్టీని ముందుండి న‌డిపిస్తున్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను అనూహ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌కుండా త‌ప్పిస్తున్నార‌నే వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఎన్నారై మ‌హిళ‌, చిల‌క‌లూరిపేట కోడ‌లు విడుదల ర‌జ‌నీకుమారిని వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీలోకి చేర్చుకున్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకే చిల‌క‌లూరిపేట టికెట్ ఇస్తార‌ని అంటున్నారు. అయితే, దీనిపై అధిష్టానం కానీ, సీనియ‌ర్ నేత‌లు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.

కేవలం ప్రచారమేనా?

కానీ, ప్ర‌చారం మాత్రం మ‌ర్రికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌ర‌నే ప్ర‌చారం మాత్రం బాగా జ‌రుగుతోంది. అది కూడా టీడీపీ నుంచి జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి చిల‌క‌లూరి పేట‌లో మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు హ‌వాను పూర్తిగా త‌గ్గించ గ‌ల స్థాయిలో మ‌ర్రి ఉన్నారు. ఆది నుంచి కూడా ఇక్క‌డ వైసీపీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. గ‌త ఎన్నిక‌ల‌లో ప్ర‌త్తిపా టికి గ‌ట్టిపోటీ కూడా ఇచ్చారు మ‌ర్రి. ఎన్నిక‌ల్లో చివ‌రినిమిషం వ‌ర‌కు కూడా భారీ ఎత్తున పోటీ ఇచ్చారు. మ‌రి అలాంటి మ‌ర్రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రింత‌గా ప్ర‌త్తిపాటికి పోటీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలోనే చిల‌క‌లూరిపేట‌లో ఆయ‌న నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను వింటున్నారు. మంత్రి ప్ర‌త్తిపాటికి ఎప్ప‌టిక‌ప్పుడు కౌంట‌ర్ వ్యాఖ్య‌లు ఇస్తూ.. కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో వాళ్ల ఫ్యామిలీ గ‌త 9 ఎన్నికల్లో వ‌రుస‌గా పోటీ చేస్తోంది.

సోమేపల్లి వారసుడిగా…….

మ‌ర్రి మామ‌, దివంగ‌త నేత సోమేప‌ల్లి సాంబ‌య్య రాజ‌కీయ వార‌సుడిగా ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. జ‌గ‌న్ పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి జిల్లాలో ఆయ‌న పెద్ద దిక్కుగా ఉన్నారు. జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగాను, పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగాను మ‌ర్రి పార్టీ అభివృద్ధిలో ఎంతో కీల‌కంగా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఉన్న/ మారిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ దాదాపు విడ‌ద‌ల ర‌జ‌నీకే ద‌క్క‌నుంద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను త‌మ పార్టీలోకి చేర్చుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కున్న బ‌లాన్ని కూడా చిల‌క‌లూరి పేట‌లో టీడీపీ వైపు మ‌ళ్లించేలా కృషి చేయాల‌ని, వైసీపీని గ‌ట్టిగా ఓడించాల‌ని కూడా ఆయ‌న‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపిన‌ట్టు తాజాగా వార్త‌లు వెలుగులోకి వ‌చ్చాయి.

గెలుపోటముల్లో……

పార్టీల‌తో సంబంధం లేకుండా యేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ప‌ల్లెలోనూ మ‌ర్రి ఫ్యామిలీకి న‌మ్మిన‌బంట్లు ఉన్నారు. ఇవి రేపు గెలుపు ఓట‌ముల్లో చాలా కీల‌కం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌పోర్ట్ లేకుండా ర‌జ‌నీ వైసీపీ నుంచి పోటీ చేసినా గెలుపు క‌ష్ట‌మే అన్న టాక్ కూడా అప్పుడే వ‌చ్చేసింది. ఇక ఆయ‌న్ను త‌మ వైపున‌కు తిప్పుకునే క్ర‌మంలో ఆర్థికంగా కూడా ఆదుకుంటామంటూ టీడీపీ వాళ్లు భ‌రోసా ఇచ్చార‌ట! దీంతో మ‌ర్రి త‌మ కూట‌మిలో చేరిపోతాడ‌ని కొంద‌రు అంటుంటే.. ఆయ‌న వైసీపీలోనే ఉన్నా ఫ‌ర్వాలేదు. త‌మ‌కు ప‌రోక్షంగా మ‌ద్ద‌తిస్తే.. చాల‌ని అంటున్నారట‌! ఇక ఇటు ర‌జ‌నీ మాత్రం మ‌ర్రి త‌న‌కు మ‌న‌స్ఫూర్తిగా స‌పోర్ట్ చేస్తే త‌న గెలుపు ఖాయం అని… మంత్రి పుల్లారావును చిత్తుగా ఓడిస్తాన‌ని స‌వాల్ విసురుతున్నారు. మ‌రి మ‌ర్రి అడుగులు ఎటు ప‌డ‌తాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*