వైసీపీలో గుండె దడ…ద‌డ‌.. రీజ‌న్ ఏంటంటే..!

రాజ‌ధాని జిల్లా గుంటూరులో వైసీపీ ప‌రిస్థితి పెనం మీద‌నుంచి పొయ్యిలోకి ప‌డిన‌ట్టు అవుతోంది. పార్టీ అధినేత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ఇక్క‌డి నాయ‌కులు విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు.. గుండెలు అర‌చేతిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నారు. మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డం, ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌డంతో ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేలు స‌హా నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌న్వ‌య క‌ర్త‌ల గుండెల్లోనూ రైళ్లు ప‌రిగెడుతున్నాయి. దీంతో ఇక్క‌డ ప‌రిస్థితి వైసీపీకి అనుకూలంగా లేక‌పోగా.. డేంజ‌ర్ బెల్స్ మోగిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరులోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చిల‌క‌లూరి పేట‌లో మంచి ఫామ్‌లో ఉన్న మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను జ‌గ‌న్ అనూహ్యంగా ప‌క్క‌న పెట్టారు. గ‌తంలో ఆయ‌న ఇక్క‌డ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు.

రజనీకి ప్రాధాన్యత ఇవ్వడంతో…

జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా నిన్న‌టి వ‌ర‌కు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ త‌న స‌త్తాచాటాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, దీనికి జ‌గ‌న్ బ్రేక్ వేస్తూ.. నిన్న‌గాక మొన్న వ‌చ్చిన విడ‌ద‌ల ర‌జ‌నీకుమారికి పెద్ద పీట వేశారు. దీంతో మ‌ర్రి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయాలా? లేక రెబ‌ల్‌గా మారాలా? అని ఆలోచిస్తున్నాడు. ఆయ‌న ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేసిన గెలిచిన రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ ప‌రిణామం త‌ర్వాత మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోని నాయ‌కులు కూడా త‌మ‌కు ఎప్పుడు గండం పొంచి ఉందో అంటూ జాత‌కాలు చెప్పించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వారంతా గుండెలు చిక్క‌బుచ్చుకుని ఉన్నారు.

ఆర్థికంగా ఇబ్బందుల్లో…..

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. సిట్టింగులుగా ఉన్న మంగ‌ళ‌గిరి, న‌ర‌స‌రావుపేట‌, బాప‌ట్ల‌, మాచ‌ర్ల, గుంటూరు తూర్పు ఎమ్మెల్యేలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డం, ప్ర‌బుత్వం క‌క్ష క‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం, నిధులు మంజూరు చేయ‌క‌పోవ‌డం వంటి రీజ‌న్ల కార‌ణంగా వీరు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ముస్తాఫా ప‌రిస్థితి అంద‌రిక‌న్నా భిన్నంగా ఉంది. రోడ్డు అభివృద్ధి చేయాల్సి వ‌స్తే.. ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్ల‌దీయొచ్చు. కానీ, ఇక్క‌డ నిత్యావ‌స‌ర‌మైన నీరు స‌మ‌స్య‌. ఇక్క‌డి ప్ర‌జ‌లు నిత్యం నీటి కోసం యుద్దాలు చేసుకుంటున్నారు. పోనీ ఈసమ‌స్య‌ను ప్ర‌భుత్వానికి చెప్పి ప‌రిష్క‌రిద్దా మంటే.. నువ్వు మా పార్టీలో చేరు అప్పుడు చేద్దాం అనే మాట త‌ప్ప స‌రైన హామీ లేనేలేదు. దీంతో ముస్తాఫా.. స్థానికంగా నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు త‌న వ‌ద్ద ఉన్న నిధులును క‌రిగించేశారు. రోజూ 20 నుంచి 30 ట్యాంక‌ర్ల మంచినీటిని కొనుగోలు చేసి.. ఇంటికో డ్ర‌మ్మును కొనిచ్చి నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. ఇది గ‌డిచిన మూడేళ్లుగా కొన‌సాగుతోంది. మ‌రి ఈయ‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు ఎక్క‌డ ఉంటాయి.

చితికిపోయిన ఆళ్ల……

అదేవిధంగా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ప‌రిస్థితి మ‌రింత దారుణం. వైసీపీ త‌ర‌ఫున ఆయ‌న అధికార పార్టీపై ఎప్ప‌టిక‌ప్పుడు న్యాయ పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఆశ్ర‌మం భూముల విష‌యంలో ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టారు. ఇలా ఆయ‌న ఎప్పుడు న్యాయ పోరాటం చేసినా ఖ‌ర్చు ల‌క్ష‌ల నుంచి కోట్ల‌కు ఎగ‌బాకింది. దీంతో ఆయ‌న కూడా చితికిపోయాడు. అయితే ఆయ‌న్ను కూడా త‌ప్పించాలా ? అన్న ఆలోచ‌న‌తో జ‌గ‌న్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఆయ‌న్ను మంగ‌ళ‌గిరి నుంచి త‌ప్పించి స‌త్తెన‌ప‌ల్లి అసెంబ్లీ లేదా న‌ర‌సారావుపేట ఎంపీగా పంపాల‌న్న ఆలోచ‌న మాత్రం ఉంద‌ట‌.

బీ ఫామ్ వచ్చేంతవరకూ ….

ఇక పెద‌కూర‌పాడులో గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు ప్ర‌స్తుతం వినుకొండ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. బ్ర‌హ్మ‌నాయుడు వినుకొండ‌కు వెళ్లాక ఇక్క‌డ కావ‌టి మ‌నోహ‌ర్‌నాయుడుకు సీటు ఇచ్చినా ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదు. దీంతో ఇప్పుడు పెద‌కూర‌పాడులో పార్టీని బ‌తికిస్తోన్న మ‌నోహ‌ర్‌నాయుడుకు సైతం సీటుపై గ్యారెంటీ లేదు. ఇక వినుకొండ‌లో బొల్లా బ్ర‌హ్మ‌నాయుడును మారుస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న‌కు బ‌దులుగా గుంటూరులో ప‌ని చేస్తోన్న ఓ డాక్ట‌ర్ పేరు విన‌ప‌డుతోంది. మ‌రో షాక్ ఏంటంటే న‌రసారావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని త‌ప్పించేసి ఆయ‌న‌కు బ‌దులుగా ప్ర‌స్తుతం గుర‌జాల ఇన్‌చార్జ్‌గా ఉన్న కాసు మ‌హేష్‌రెడ్డిని అక్క‌డ పోటీ చేయించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే పార్టీలో న‌మ్మ‌క‌మైన సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు కూడా సీటు లేదన్న దారుణ‌మైన సంకేతాలు కేడ‌ర్‌లోకి వెళ్లిపోతాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపించే స‌రికి డ‌బ్బున్న వారికే టికెట్లు అనే పంథాలో జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యం వీరికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఫైన‌ల్‌గా చెప్పాలంటే బీ ఫామ్ వ‌చ్చే దాకా వైసీపీ సీటు వ‌స్తుంద‌న్న గ్యారెంటీ ఆ పార్టీ నాయ‌కుల‌కే లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*