వైసీపీ రైజ్ అవుతోందే.. !

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో టీడీపీ – వైసీపీ అభర్ధుల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మాగంటి బాబు లక్ష ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాగంటి బాబు వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ కేంద్ర సర్వీసుల అధికారి తోట చంద్రశేఖర్ పై ఘన విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి దివంగత మాజీ మంత్రి… ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన కాకలు తీరిన రాజకీయ యోధుడైన కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్ పోటీ చేస్తున్నారు.

మాగంటిని ఎదుర్కొంటారా?

వాస్తవంగా చూస్తే గతేడాది కోటగిరి శ్రీధర్ ను ఏలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నియమించినప్పుడు ఆయన మాగంటి బాబుని ఎదుర్కుంటారా ..? ఇక్కడ బలంగా ఉన్న టీడీపీ అభ్యర్ధికి గట్టి పోటీ ఇస్తారా ..? సామాజిక సమీకరణాల పరంగా శ్రీధర్ అభ్యర్థిత్వం సరైనదేనా ..? అనే సందేహాలు లెక్కకు మిక్కిలిగా వచ్చాయి. అయితే క్రమ క్రమంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు…. నియోజకవర్గంలో క్రమం తప్పకుండా శ్రీధర్ పర్యటించడం… సామాన్య కార్య‌క‌ర్త‌లా క‌లిసిపోతుండ‌డం… యువ నాయకుడు కావడంతో జనాల్లో లభిస్తోన్న ఆదరణ చూస్తుంటే శ్రీధర్ – బాబు మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

వైసీపీకి అనుకూలంగా……

ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలోని కొన్ని ప్రధాన సెగ్మెంట్స్ లో టీడీపీలో అంతర్గతంగా ఉన్న గ్రూపు రాజకీయాలు రోజురోజుకి మితిమీరుతున్నాయి. ఇవన్నీ వైసీపీకి అనుకూలంగా మారే ఛాన్సులు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఎంట్రీతో జరిగిన ముక్కోణపు పోటీలో టీడీపీ చాలా సెగ్మెంట్స్ లో ఘోరంగా దెబ్బతింది. జిల్లా కేంద్రం అయిన ఏలూరులో టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణ కేవలం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్థి ఇక్కడ పోటీలో ఉండడంతో మళ్ళీ ఇక్కడ టీడీపీ ఓటు బ్యాంకుకు భారీగా గండిపడే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

జనసేనాని ప్రచారం వల్లనే…..

గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ ఏలురూ లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చెయ్యడంతో అన్ని సెగ్మెంట్స్ లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో పాటు మాగంటి బాబుకి లక్ష ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ ఐదేళ్లలో అనేక సమీకరణాలు మారిన నేపథ్యంలో టీడీపీ తన ఓటు బ్యాంకును భారీగా కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ జనసేన నుంచి ఏ సామజిక వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీలోకి దింపుతారనే క్లారిటీ లేకపోయినా .. ప్రస్తుత ఈక్వేషన్లు బట్టి చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికే ఇక్కడ జనసేన ఎంపీ సీటు ఇవ్వొచ్చని ప్రాధమికంగా తెలుస్తోంది.

ఇక్కడ వైసీపీకి మెజారిటీ….

నియోజకవర్గాల వారీగా చూస్తే.. జిల్లా కేంద్రమైన ఏలూరులో జనసేన ప్రభావం గట్టిగా ఉంది. ఇంకా చెప్పాలంటే జిల్లాలో జనసేన గెలిచే ఒకటి రెండు సీట్లలో ఏలూరు కూడా ఉంటుందని జనసేన వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ జనసేన పోటీ చేస్తే.. టీడీపీ ఓటు బ్యాంకుకు దెబ్బపడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మాజీ మంత్రి పీతల సుజాత ప్రాతినిధ్యం వహిస్తున్న చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ, ఎమ్యెల్యే వర్గాలుగా రెండుగా చీలిపోయింది. ఈ నియోజకవర్గం శ్రీధర్ సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ ప్రధానంగా ద్రుష్టి సారిస్తే వైసీపీకి మెజార్టీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక పోలవరం నియోజకవర్గంలో కోటగిరి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం నేపథ్యంలో పోలవరంలో కూడా ఈసారి హోరాహోరీ పోరు తప్పేలా లేదు. పోలవరంలో వైసీపీకి వరుసాగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ రికార్డ్ క్రియేట్ చేసిన బాలరాజు అభ్యర్థిగా బరిలో ఉండడం కలిరానుంది.

చింతమనేని ఇలాకాలోనూ…..

ఇక విప్ చింతమనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దెందులూరు నియోజకవర్గంలో యువనేత కొఠారి అబ్బాయి చౌదరి ఎంట్రీతో ప్రభాకర్ జోరుకు కాస్త‌ బ్రేక్ పడనుంది. ఇక్కడ మరింత కష్టపడితే టీడీపీని మరింత నిలువరించవచ్చనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎమ్యెల్యే గన్ని వీరాంజనేయులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన- టీడీపీ నుంచి వైసీపీకి గట్టి పోటీ ఎదురు కానుంది. ఇక్క‌డ జ‌న‌సేన అభ్య‌ర్థి కులాన్ని బ‌ట్టి కూడా వైసీపీ బ‌లాబ‌లాలు మారే ఛాన్సులు ఉన్నాయి. ఇక కృష్ణాజిల్లా పరిధిలో ఉన్న నూజివీడు నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉండగా.. సిట్టింగ్ ఎమ్యెల్యే మేకా ప్రతాప అప్పారావుతో వైసీపీ బలంగా కనిపిస్తుండగా.. టీడీపీలో నియోజకవర్గ ఇంచార్జ్ ముద్ద‌ర‌బోయిన వెంకేటేశ్వ‌ర‌రావు, ఎంపీ మాగంటి బాబు గ్రూపు తగాదాలు వైసీపీ కి మరింత కలిసిరానున్నాయి.

వైసీపీకి కలసి వచ్చేవే……

ఇక ఏలూరు సెగ్మెంట్ లో ఉన్న కృష్ణా జిల్లాలోని మరో నియోజకవర్గం కైకలూరు లో బీజేపీ ఎమ్యెల్యే కామినేని శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో టీడీపీ క్యాడర్ నిరాశ నిస్పృహలతో ఉన్నాయి. ఇక్క‌డ టీడీపీ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేస్తారో ? తెలియ‌క‌పోవ‌డంతో ఆ పార్టీ కేడ‌ర్ చెల్లా చెదురుగా ఉంది. ఈ పరిణామాలన్నీ కూడా వైసీపీకి కలిసిరానున్నాయి. అయితే ఈ పరిణామాలను వైసీపీ ఎంతవరకు తమకు అనుకూలంగా మార్చుకుని కైకలూరులో బలోపేతం అవుతాయో చూడాల్సి ఉంది. ఇక శ్రీధర్ కు ఎంపీ అభ్యర్థిత్వం వచ్చిన నాటికి నేటికీ ఏలురూ లోక్‌స‌భ నియోజకవర్గ పరిధిలో వైసీపీ బలం పుంజుకున్నట్టే కనిపిస్తోంది. ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు, టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఇవన్నీ వైసీపీ కి సానుకూలంగా కనిపిస్తున్నాయి. మరి వీటిని శ్రీధర్ ఏమేరకు సద్వినియోగం చేసుకుని ఏలురూ కోటాపై వైసీపీ జెండా ఎగురవేస్తాడో చూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*